logo

చెన్నకేశవస్వామి భూములు కబ్జా

చూస్తుండగానే ఆ ఆలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఒకప్పుడు వందల ఎకరాల్లో ఉన్నవి కాస్త ఇప్పుడు రెండంకెలకు చేరాయి.

Published : 05 Oct 2022 04:51 IST

ఇప్పటికే చేతులు మారిన 269 ఎకరాలు
అధికార పార్టీ నేతల అండతో జోరుగా ఆక్రమణలు

మార్కెట్‌ యార్డుకు సమీపంలోని దేవస్థానం భూమిలో అక్రమ కట్టడాలు

చూస్తుండగానే ఆ ఆలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఒకప్పుడు వందల ఎకరాల్లో ఉన్నవి కాస్త ఇప్పుడు రెండంకెలకు చేరాయి. ఇటు అధికారులూ వాటిని కాపాడే ప్రయత్నం చేయకపోవడం ఆక్రమణదారులకు మరింత కలిసివస్తోంది. మార్కాపురంలో నెలకొన్న పరిస్థితి ఇది.

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు, మార్కాపురం, న్యూస్‌టుడే: మార్కాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఏటా జరిగే బ్రహ్మోత్సవాలకైతే లక్షల్లో హాజరవుతారు. ఈ ఆలయానికి సంబంధించిన రికార్డుల ప్రకారం 319.01 ఎకరాల భూములు ఉన్నాయి. అందులో భజంత్రీ, పెద పురోహితం, చిన పురోహితం, వేద పారాయణం, ఆచార్య పురోహితం, కల్యాణవస్త్రాలు, దేవాలయ సర్వీలు తదితర సేవలందించేవారి కోసం 269 ఎకరాల ఇనాం భూములు ఉన్నాయి. వాటిలో ఇప్పటివరకు 85 శాతం భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. ప్రస్తుతం అలయ పరిధిలో కేవలం 49.46 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఇందులో 24.62 ఎకరాలు లీజుకు ఇచ్చారు. గతంలో ఏటా రూ.లక్షల్లో వచ్చిన ఆదాయం ప్రస్తుతం రూ.57,900కు పడిపోయింది. అనేకం ఆక్రమణల్లో ఉండగా ఇంకొన్ని భూములు కోర్టు కేసుల్లో ఉన్నాయి. ఉన్నవి కూడా కాజేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.

జాతీయ రహదారికి చెంతనే..
మార్కాపురం మార్కెట్‌యార్డుకు సమీపంలో 565 జాతీయ రహదారి పక్కనే లక్ష్మీ చెన్న కేశవస్వామి దేవస్థానానికి చెందిన భజంత్రీల మాన్యం ఉంది. సర్వే నంబరు 206-బిలో మొత్తం 6.01 ఎకరాలు ఉండగా ఇందులో 1.15 ఎకరాలు జాతీయ రహదారిలో కలిసిపోయింది. మరో 1.25 ఎకరాలను ఇతరులకు గతంలో పట్టా ఇచ్చారు. మిగిలి ఉన్న మూడున్నర ఎకరాల భూమిని కొంతమంది ఆక్రమణదారులు అధికార పార్టీ నాయకుల అండదండలతో కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాత్రికి రాత్రే చదును చేసి కంకర, ఇసుక, ఇటుకలు వేశారు. ఈ ప్రాంతంలో ఎకరా రూ.6 కోట్ల వరకు విలువ చేస్తుంది  ఆన్యాక్రాంతమైన మాన్యం భూములను కాపాడాల్సిన అవసరం ఉంది.


మార్కాపురంలో వివాదాస్పద భూమి

ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు
ఈవోగా ఇటీవలే బాధ్యతలు చేపట్టాను. ఆలయ భూములకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్నాం.. దేవుని మాన్యం భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొన్నింటిని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించాం. ఆక్రమణలు చేసిన వారిని నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరికలు జారీ చేశాం. నోటీసులు జారీ చేసి భూములను సంరక్షిస్తాం.

- జి.శ్రీనివాసరెడ్డి, ఈవో, మార్కాపురం

లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థానం

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts