logo

నీటిని ఇంకిద్దాం.. మొక్కలు పెంచేద్దాం

గ్రామాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలుచేస్తోంది. ఏటా ముందస్తుగా గ్రామసభలు ఏర్పాటుచేసి రానున్న సంవత్సరానికి అవసరమైన పనుల గుర్తింపు చేపడుతుంటారు.

Published : 05 Oct 2022 04:51 IST

2023-24 సంవత్సర ఉపాధి పనుల్లో వీటికే పెద్దపీట

ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలుచేస్తోంది. ఏటా ముందస్తుగా గ్రామసభలు ఏర్పాటుచేసి రానున్న సంవత్సరానికి అవసరమైన పనుల గుర్తింపు చేపడుతుంటారు. వాన నీటిని భూగర్భంలో సంరక్షించే పనులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుంది. రానున్న ఆర్థిక సంవత్సరానికి కూడా ఉపాధి కింద ఇవే అగ్రభాగం. అలాగే పండ్లతోటల సాగు, ప్రభుత్వ స్థలాల్లో మొక్కల పెంపకం వంటివి ఉంటాయి. 

120 రకాల పనులకు అనుమతి
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 120 రకాల పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రతి గ్రామంలో ఉపాధి కార్డు పొందిన కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పిస్తారు. కొత్త పనుల గుర్తింపు నిమిత్తం ఈ నెల 2 న గ్రామసభలకు శ్రీకారం చుట్టారు. సెలవులు రావడంతో ఈ నెల 6 నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో సభలు నిర్వహించనున్నారు.

ఏవి చేపట్టనున్నారంటే..
నీటి సంరక్షణ, నీటి నిల్వలో భాగంగా వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, చెక్‌డ్యామ్‌లలో పూడికతీత పనులు చేస్తారు. పొలం చుట్టూ సరిహద్దు, అంతర్గత కందకాలు, కుంటలు, ఇంకుడు గుంతలు, ఇంజక్షన్‌ బోర్లు వంటివి చేపట్టనున్నారు. రహదారులకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాలు, చెరువులు, కుంటల కట్టలు, రైతుల పొలాలు, ఉద్యాన పండ్లతోటల సాగు, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటుతారు. జిల్లాలో కరవు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు డ్వామా పీడీ శీనారెడ్డి తెలిపారు. నవంబరు 13లోపు గ్రామ సభల ద్వారా వచ్చే ఏడాదికి పనులను గుర్తించనున్నామన్నారు.

* 2022-23లో ఉపాధి కార్డులు: 5.95 లక్షలు
* పనులకు వచ్చిన కుటుంబాలు: 3.09 లక్షలు
* ప్రస్తుత ఏడాది పని దినాల లక్ష్యం: 1.20 కోట్లు
* ఇప్పటివరకు పూర్తయిన పని  దినాలు: 1.36 కోట్లు
* రోజుకు సరాసరి వేతనం: రూ.257

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని