logo

దసరా పిలిచింది

దసరాకు వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. గత నెల 29 నుంచి ఈనెల 3వ తేదీ వరకు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుకు ప్రత్యేక సర్వీసులను నడిపారు. గతంతో పోల్చుకుంటే శని, ఆదివారాలు మినహా ఈసారి ప్రయాణికుల రద్దీ తగ్గింది.

Published : 05 Oct 2022 04:51 IST

మార్కాపురం: మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ప్రయాణికుల కోలాహలం

ఒంగోలు అర్బన్‌, కనిగిరి, న్యూస్‌టుడే: దసరాకు వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. గత నెల 29 నుంచి ఈనెల 3వ తేదీ వరకు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుకు ప్రత్యేక సర్వీసులను నడిపారు. గతంతో పోల్చుకుంటే శని, ఆదివారాలు మినహా ఈసారి ప్రయాణికుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి జిల్లాకు 70 ప్రత్యేక సర్వీసులు తిరిగాయి. మిగిలిన రెండు నగరాలకు సాధారణ సర్వీసులతో పాటు అదనంగా రెండు నడిపారు. కేవలం 50 శాతం ప్రయాణికులతో తిరగగా సంస్థకు రూ.16 లక్షల రాబడి వచ్చింది. దసరా పండగ పూర్తయిన తరువాత తిరిగి హైదరాబాద్‌కు అవసరాన్ని బట్టి సర్వీసులు నడుపుతామని అధికారులు తెలిపారు.

స్వస్థలాలకు రాక..
కనిగిరి ప్రాంత వాసులు తెలంగాణ రాష్ట్రంలో అధికంగా ఉన్నారు. పండగ కోసం హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, బోధన్‌, నిర్మల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, తదితర ప్రాంతాల నుంచి విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, వలస కూలీలు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. అధికారులు ప్రత్యేకంగా కనిగిరి డిపో నుంచి హైదరాబాద్‌కు 15 బస్సులను ఏర్పాటుచేశారు. వారం పాటు సర్వీస్‌లు తిప్పడంతో డిపోకు సుమారు రూ.5 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు మేనేజర్‌ శ్రీమన్నారాయణ తెలిపారు. గతంలో అధికంగా వలస కుటుంబాలు ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాల్లో వచ్చేవారని, ప్రస్తుతం ముందుగానే ప్రచారం నిర్వహించి వారం రోజులుగా బస్సులు నడిపామన్నారు.

డిపో వారీగా చూస్తే..
జిల్లాలో దసరా సందర్భంగా ఆర్టీసీ 101 ప్రత్యేక బస్సులను కేటాయించింది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు తగ్గడంతో వీటిలో 70 మాత్రమే నడిచాయి. 29న హైదరాబాద్‌ నుంచి 3.. 30న 13, అక్టోబర్‌ 1న 30, అలాగే 2 న 16, 3న కేవలం రెండు సర్వీసులు మాత్రమే నడిచాయి. ఒంగోలు డిపోకు 31 బస్సులు కేటాయించగా 15 మాత్రమే వచ్చాయి. హైదరాబాద్‌ నుంచి కనిగిరికి 15, గిద్దలూరు డిపోకు 14, మార్కాపురం 11, పొదిలికి 11 వచ్చాయి. అదే క్రమంలో చెన్నై నుంచి కనిగిరికి 4, బెంగుళూరు నుంచి ఒంగోలుకు కేవలం ఒక్క బస్సు నడిచాయి. కొన్ని సంస్థలు పండుగకు కేవలం ఒక రోజు మాత్రమే సెలవు ఇవ్వడంతో ఎక్కువమంది సొంత ప్రాంతాలకు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. మరో వైపు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తుండటంతో వారి తాకిడి కూడా లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని