logo

పరిమితికి మించి సాగు అనర్థమే

పొగాకు ఎక్కువ మొత్తంలో పండించొద్దని అధికారులు రైతులను హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది పొగాకు రైతులు లాభాల ఆర్జించడంతో సాగు విస్తీర్ణం పెంచే ఆలోచనలో ఉన్నారు.

Published : 05 Oct 2022 04:51 IST

పొగాకు రైతులకు అధికారుల సూచన

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని హితవు

పొగాకు పంట

పొగాకు ఎక్కువ మొత్తంలో పండించొద్దని అధికారులు రైతులను హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది పొగాకు రైతులు లాభాల ఆర్జించడంతో సాగు విస్తీర్ణం పెంచే ఆలోచనలో ఉన్నారు. బోర్డు అధికారులు మాత్రం  పరిమితికి సాగు చేయవద్దని సూచిస్తుండటం గమనార్హం. ఇప్పటికే అన్ని వేలం కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ పంటతో పాటు ప్రత్యామ్నాయంగా బొబ్బర్లు, మినుము, శనగ, మొక్కజొన్న, కంది, పెసర తదితరాలను కొంత విస్తీర్ణం మేర సాగు చేసుకోవాలని చెబుతున్నారు. అధిక ధరలు చెల్లించి బ్యారన్లు కౌలుకు తీసుకుంటే రైతులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

పొదిలి, న్యూస్‌టుడే

జిల్లాలో పొగాకు నాట్లు ప్రారంభమయ్యాయి. వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు పశ్చిమ ప్రాంతంలోని రైతాంగం నాట్లకు ఉపక్రమించారు. ముందస్తుగా నారుమడులు వేసిన రైతులు నారు తీయడం ప్రారంభించారు. మరో 15 రోజులకు పూర్తిస్థాయిలో నారు రైతులకు అందుబాటులో రానుంది. ఈ ఏడాది జిల్లాలోని ఎస్‌ఎల్‌ఎస్‌ రీజియన్‌లో 29.13 మిలియన్‌ కిలోలు, ఎస్‌బీఎస్‌లో 36.95 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతించింది. పొగాకు బ్యారన్‌ రిజిస్ట్రేషన్ల పక్రియ కొనసాగుతుంది.  ప్రస్తుతానికి ఎస్‌ఎల్‌ఎస్‌లో 8011 బ్యారన్లు, 11,420 మంది రైతులు 21708 హెక్టార్లలో, ఎస్‌బీఎస్‌ పరిధిలో 10350 బ్యారన్లు, 11972 మంది రైతులు 21,737 హెక్టార్లలో పంటసాగుకు అనుమతించారు.

కర్ణాటకలో తగ్గిన ఉత్పత్తి...
కర్ణాటకలో ఈ ఏడాది కూడా పొగాకు పంట ఉత్పత్తి తగ్గింది. అనుమతించిన పంట కన్నా దాదాపు 35 శాతం పైగా తగ్గినట్లు అధికారులు అంటున్నారు. గత రెండేళ్లుగా పొగాకు బోర్డు అనుమతించిన దాని కన్నా కర్ణాటకలో పంట ఉత్పత్తి తగ్గగా సగటు ధరలు పెరిగాయి. గత ఏడాది అక్కడ పంట తగ్గడం వల్ల ఆంధ్రాలో మార్కెట్‌ ఒకింత జోరుగా సాగింది. దీంతో పొగాకు రైతులు లాభాల బాట పడ్డారు.అక్కడ 2022-23 పంట కాలానికి వంద మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతించినప్పటికీ అధిక వర్షాల ప్రభావంతో 70 మిలియన్ల కన్నా ఎక్కువ పంట ఉత్పత్తి వచ్చే అవకాశం లేదు. అక్కడ పంట ఉత్పత్తి తగ్గిన నేపధ్యంలో మన జిల్లాలో పొగాకు సాగు విస్తీర్ణం పెంచే ఆలోచనలో రైతులు ఉన్నట్లు తెలిసింది. బోర్డు అధికారులు మాత్రం పరిమితికి మించి పొగాకు సాగు చేయవద్దని సూచిస్తున్నారు.

అనుమతించిన మేరకే...
పొగాకు రైతులు అధిక విస్తీర్ణంలో పంట సాగు చేయొద్దు. బోర్డు ఆదేశాల మేరకు ఒక్కొక్క బ్యారన్‌కు 7.22 ఎకరాల్లో పంట సాగు చేసుకోవాలి. బ్యారన్‌కు 3650 కిలోల పొగాకు అధికారికంగా ఉత్పత్తికి అనుమతించారు. వాతావరణం అనుకూలంగా ఉన్నందున రైతులు ఇప్పుడే నాట్లు వేసుకోవాలి. పొదిలి వేలం కేంద్రంలో 8.5 మిలియన్‌ కిలోల పొగాకు ఉత్పత్తికి అనుమతించాం.. 

- గిరిరాజ్‌కుమార్‌, వేలం కేంద్రం నిర్వహణ అధికారి, పొదిలి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు