logo

యువకుడి ప్రాణం నిలిపారు!

రోడ్డు ప్రమాదంలో పొట్ట చీలి పేగులు బయటకు వచ్చిన వ్యక్తికి స్థానిక రమేష్‌ సంఘమిత్ర ఆసుపత్రి వైద్యులు ప్రాణం పోశారు.

Published : 05 Oct 2022 04:51 IST

ప్రమాదంలో బయటికొచ్చిన పేగులు

వైద్యుల శస్త్రచికిత్స

వివరాలు తెలియజేస్తున్న రమేష్‌ సంఘమిత్ర ఆసుపత్రి వైద్యులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో పొట్ట చీలి పేగులు బయటకు వచ్చిన వ్యక్తికి స్థానిక రమేష్‌ సంఘమిత్ర ఆసుపత్రి వైద్యులు ప్రాణం పోశారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆసుపత్రి గ్యాస్ట్రో సర్జన్‌ డాక్టర్‌ కార్తీక్‌బాబు, సీవోవో డాక్టర్‌ కె.హరికుమార్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. కురిచేడు మండలం పెద్దవరం గ్రామానికి చెందిన పాతికేళ్ల యువకుడు... పది రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. పొట్ట చీలి పేగులు బయటకు వచ్చాయి. స్థానికులు టవల్‌ చుట్టి దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... అక్కడి వైద్యుడు తాత్కాలికంగా కుట్లు వేసి... వేలాడుతున్న పేగులను జాగ్రత్తగా ఓ తగరపు సంచిలో మూటలా కట్టి పెద్దాసుపత్రికి వెళ్లాలని సూచించారు. కుటుంబీకులు బాధితుడిని సంఘమిత్ర ఆసుపత్రికి తరలించగా... డాక్టర్‌ కార్తీక్‌, ఇతర వైద్యుల బృందం పరిశీలించి అత్యవసరంగా శస్త్రచికిత్స చేశారు. ప్రమాదం జరిగిన గంట వ్యవధిలో ఆసుపత్రికి రావడం, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలేవీ లేకపోవడంతో యువకుడి ప్రాణాలు దక్కాయన్నారు. ఆసుపత్రికి వచ్చేసరికి పొట్టభాగం సగం మేర చీలిపోయి... చిన్నపేగు 75 శాతం మేర బయటికి వచ్చిందన్నారు. మూడు లీటర్లకు పైగా రక్తస్రావం జరిగిందన్నారు. ప్రస్తుతం యువకుడు కోలుకున్నాడని చెప్పారు. క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన... వైద్యులు కార్తీక్‌బాబు, వంశీ, మృధుల, పవిత్రను ఆసుపత్రి ఎండీ పి.రమేష్‌బాబు అభినందించారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని