logo

రాజుకుంటున్న రాజకీయ వేడి

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా జిల్లాలోనూ సమీకరణాలు మారుతున్నాయి. అధికార పార్టీలోని నాయకులు ఒకవైపు గ్రూపులతో సతమతం అవుతున్నప్పటికీ తాజాగా మూడు రాజధానుల అంశంతో కార్యక్రమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు.

Updated : 05 Oct 2022 05:25 IST

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా జిల్లాలోనూ సమీకరణాలు మారుతున్నాయి. అధికార పార్టీలోని నాయకులు ఒకవైపు గ్రూపులతో సతమతం అవుతున్నప్పటికీ తాజాగా మూడు రాజధానుల అంశంతో కార్యక్రమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో ఏకైక రాజధాని అమరావతి అజెండాగా తెదేపా ముందుకెళ్తుంది. 2024లో జరగనున్న ఎన్నికలను ఇరుపార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు గుర్రాలను వడపోసి బరిలోకి దించే ప్రయత్నాలు చేపట్టాయి. ఒకవైపు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జులతో నేరుగా మాట్లాడి దిశానిర్దేశం చేస్తున్నారు. కొండపిలో ఎమ్మెల్యే స్వామి మరోసారి పోటీచేయనుండగా మరో నాలుగు చోట్ల పోటీ చేసే అభ్యర్థులకు పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇదే సమయంలో గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజాప్రతినిధులను జనాల్లోకి పంపిన అధికారపార్టీ ప్రతి అంశం పరిశీలిస్తోంది. ఈనెల 15 నుంచి ఎమ్మెల్యేల కార్యక్రమాన్ని సర్వే బృందం గమనించనుంది.
పోటాపోటీగా చేరికలు ..
రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఒకవైపు భూములిచ్చిన రైతులు పాదయాత్ర చేస్తున్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అమరావతి అంటూ ప్రధాన ప్రతిపక్షం తెదేపా స్పష్టంచేస్తోంది. మూడు రాజధానులే తమ విధానం అంటూ వైకాపా విమర్శలు గుప్పిస్తోంది. ఇదే అంశంపై వైకాపా జిల్లా అధ్యక్షుడు బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ విజయదశమి రోజున పూజా కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించి పాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కాగా.. వైకాపా నాయకులకు ప్రజలే బుద్దిచెబుతారని తెదేపా నాయకులు దీక్షల్లో వ్యాఖ్యానిస్తున్నారు. నియోజకవర్గాల్లో పట్టుపెంచుకునే ప్రయత్నాలను తెదేపా మొదలు పెట్టింది. కనిగిరి, గిద్దలూరు, ఒంగోలు, మార్కాపురం, కొండపి వంటి నియోజకవర్గాల్లో వందలమంది ఇప్పటికే తెదేపాలో చేరారు. వైకాపా అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆ పార్టీలోకి వెళ్లినవారు, మూడేళ్లలో స్థానికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నవారు తెదేపాలో చేరుతున్నారు. రెండు రోజులక్రితం ఒంగోలు నగరంలో వందలమంది యువకులు దామచర్ల జనార్దన్‌ సమక్షంలో తెదేపాలో చేరారు. దీనికి పోటీగా మరుసటి రోజే కొందరు యువకులకు వైకాపా కండువాలు కప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని