logo

సాగర్‌ కాలువలో యువ వైద్యుడి గల్లంతు

ప్రమాదవశాత్తు సాగర్‌ కాలువలో పడి యువ వైద్యుడు గల్లంతైన సంఘటన త్రిపురాంతకం మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది.

Published : 05 Oct 2022 04:51 IST

త్రిపురాంతకం, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు సాగర్‌ కాలువలో పడి యువ వైద్యుడు గల్లంతైన సంఘటన త్రిపురాంతకం మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. బంధువులు, పోలీసులు తెలియజేసిన వివరాల మేరకు..గుంటూరు జిల్లా చేబ్రోలుకు చెందిన ఉదయగిరి భరత్‌ (23) అనే యువకుడు తన బంధువుల ఇంట్లో జరిగే ఓ ప్రార్థన కార్యక్రమంలో పాల్గొనేందుకు త్రిపురాంతకం వచ్చారు. బంధువులైన ఇద్దరు యువకులతో కలిసి సమీపంలోని సాగర్‌ కాలువకు వెళ్లారు. వారిద్దరూ ఈత కొడుతుండగా భరత్‌ తన చరవాణితో వీడియో తీస్తూ  ప్రమాదవశాత్తు జారి కాలువలో పడ్డాడు. పక్కనే ఈత కొడుతున్న ఇద్దరు యువకులు అతడిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కాలువలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న భరత్‌ తల్లి అరుణ సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించింది. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఆ మేరకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై వెంకట సైదులు తెలిపారు. భరత్‌ తన అన్నతో కలిసి ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అన్నా, తమ్ముడు ఇద్దరూ విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఇంతలో ఈ ఘటన చోటు చేసుకుంది.


చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ఒంగోలు అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందారు. పేర్నమిట్ట రెడ్డిపాలెం సమీపంలో ఈ నెల 2న కారు ఢీకొని... మంగమూరుకు చెందిన తేళ్ల ప్రేమనాథం తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి ఒంగోలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. తెదేపా నాయకులు  ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.


విషజ్వరంతో మహిళ మృతి

కంభం, న్యూస్‌టుడే : విషజ్వరంతో బాధపడుతూ మహిళ మృతి చెందిన సంఘటన కంభం మండలం కందులాపురం పంచాయతీ అరాఫత్‌ నగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఆ ప్రాంతానికి చెందిన జె.అరుణ (32) ఇటీవల జ్వరం బారిన పడింది. పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించారు. జ్వరం తగ్గలేదు. పలు రకాల పరీక్షలు చేయించడంతో డెంగీ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. అరుణకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని