logo

Prakasam: సింగరాయకొండలో ఏం జరుగుతోంది?వరుస ఘటనలతో వణుకు

సింగరాయకొండ ప్రాంతం ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక ఘటనతో సంచలనం కలిగిస్తుంది. ఒకదానివెంట ఒకటిగా ఇక్కడ జరుగుతున్న నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Updated : 16 Oct 2022 08:18 IST

గత నెల 23న స్టేషన్‌ ఆవరణలో ఆందోళనకారులు నిప్పంటించిన లారీ

సింగరాయకొండ ప్రాంతం ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక ఘటనతో సంచలనం కలిగిస్తుంది. ఒకదానివెంట ఒకటిగా ఇక్కడ జరుగుతున్న నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సమస్యలు తలెత్తినప్పుడు తక్షణం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసు అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ‘రాజీ’కీయం గట్టిగా పనిచేస్తోంది. ఇటీవల వైకాపా నాయకుడి హత్యోదంతం మరవకముందే శుక్రవారం ఓ హోటల్‌లో యువకుడిపై జరిగిన దాడి కలకలం రేపుతోంది.

ఒంగోలు నేరవిభాగం, సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: రెండేళ్లక్రితం ఓ యువకుడు ఏకంగా సింగరాయకొండ స్టేషన్‌ ఆవరణలోనే ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. గత నెల చివరివారంలో ఓ హత్య కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న లారీని తగలబెట్టేందుకు ప్రయత్నించాడో యువకుడు. ఇదీ స్టేషన్‌ ఆవరణలోనే జరిగింది. అదే సమయంలో అక్కడి చలివేంద్రానికి కూడా నిప్పు పెట్టేశారు. నాలుగు నెలల క్రితం మూలగుంటపాడు పరిధిలోని ఓ కాలనీలో జరిగిన ఘర్షణ తీవ్రమైనదే. దాడులు, ప్రతిదాడులకు ఇది ఆస్కారం ఇచ్చింది. ఆ సమయంలో పోలీసులు బాధితులపైనే లాఠీఛార్జి చేయడం విమర్శలకు తావిచ్చింది. ఎస్సీ కమిషన్‌ పర్యటించి ఈ అంశాన్ని తప్పుబట్టింది. నెల క్రితం పాకల గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా రెండు వర్గాలకు చెందిన యువకుల మధ్య ఘర్షణ జరిగింది. పలువురు యువకుల తలలు పగిలి తీవ్ర రక్తగాయాలయ్యాయి. పోలీసు స్టేషన్‌లో రాజీ కుదిర్చారు. మూలగుంటపాడు గ్రామానికి చెందిన పసుపులేటి రవితేజ, ఎ.అజయ్‌ల మధ్య జరిగిన గొడవ తీవ్రమై రవితేజ గత నెల 22న హత్యకు గురయ్యారు.

తీవ్రమైన నేరాలకు దారితీస్తూ..
ఈ తరహా సంఘటనల నేపథ్యంలో విధుల్లో అలసత్వం వహించిన ఒక ఎస్సై, సీఐలపై బదిలీ వేటు పడింది. నేరాలు, అల్లర్లను సకాలంలో అదుపు  చేయకపోవడంతో చిన్నచిన్న గొడవలు సైతం తీవ్రమైన ఘటనలకు దారితీస్తున్నాయి. నేర ప్రవృత్తి గల యువకులు నిత్యం పోలీసు స్టేషన్‌ పరిసరాల్లో సంచరిస్తున్నా నిఘా కరవైంది. కనీస చర్యలు లేక మట్టి, ఇసుక దందాలు, గంజాయి విక్రయాలు, క్రికెట్‌ బెట్టింగులు సింగరాయకొండలో నిత్యకృత్యంగా మారాయి. కొంతమంది పోలీసు సిబ్బంది మామూళ్లు తీసుకొని ‘పంచాయితీలూ’ నిర్వహిస్తున్నారు.


అర్ధరాత్రి.. ఏడు ఇళ్ల లూటీ

రాములమ్మ కాలనీలో చోరీ జరిగిన ఇంటిని పరిశీలిస్తున్న డీఎస్పీ నాగరాజు, సీఐ రంగనాథ్‌

సింగరాయకొండ గ్రామీణం: సింగరాయకొండలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. వరుసగా ఏడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఆభరణాలు, నగదు తస్కరించారు. బుంగబావి ప్రాంతంలోని తంబా శేషయ్య ఇంటిలో రూ.20 వేల నగదు, 5 సవర్ల బంగారం.. అంబేద్కర్‌నగర్‌ కాలనీలోని షేక్‌ బాషా నివాసంలో  రూ.50 వేల నగదు, రాములమ్మకాలనీలో పి.మోహనరావు ద్విచక్ర వాహనం, మేకల లక్ష్మి ఇంటిలో రూ.67 వేల నగదు 8 సవర్ల ఆభరణాలు, సుబ్బరామిరెడ్డి నగర్‌లోని కోడి బాలకృష్ణ నివాసంలో నగదు, నగలు దోచుకెళ్లారు. ఇంకా జె.కృష్ణవేణి, వి.శ్రావణ్‌కుమార్‌ల నివాసాల్లోని వస్తువులు పోయాయి. బాధితుల ఫిర్యాదుతో ఒంగోలు డీఎస్పీ నాగరాజు, సీఐ రంగనాథ్‌ తమ సిబ్బందితో సంఘటనా స్థలాలకు చేరుకుని పరిశీలించారు. వేలిముద్ర నిపుణులు వచ్చి ఆధారాలు సేకరించారు. త్వరలోనే నిందితులను గుర్తించి పట్టుకుంటామని.. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని డీఎస్పీ తెలిపారు. మండలంలో శాంతి భద్రతల లోపమే నేరాలకు కారణమని, ప్రత్యేక దృష్టి సారించి వారి ఆటకట్టిస్తామని డీఎస్పీ తెలిపారు. పాత నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని