logo

Super Star Krishna: అభిమాన నటుడి అడుగుజాడ

గుండెపోటుతో సినీ నటుడు కృష్ణ కన్నుమూయడంతో ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

Updated : 16 Nov 2022 09:33 IST

నాడు జిల్లాలో పర్యటించిన కృష్ణ

చీమకుర్తి, ఒంగోలు నగరం: గుండెపోటుతో సినీ నటుడు కృష్ణ కన్నుమూయడంతో ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. గతంలో కృష్ణ జిల్లాకు వచ్చిననాటి గురుతులను పలువురు నెమరువేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిమిత్తం 1985 ప్రాంతంలో చీమకుర్తి వచ్చారు. ఇక్కడి ప్రధాన రహదారిలో ఎన్‌ఎస్పీ కాలనీ నుంచి పాత బస్టాండు కూడలి వరకు రోడ్డుషో నిర్వహించారు. ఆయనను చూసేందుకు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. స్థానిక పోలీసు స్టేషన్‌ ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించాలని ఏర్పాట్లు చేయగా కొన్ని కారణాల వల్ల సభలో పాల్గొనకుండానే ఆయన వెళ్లిపోయారు. అలాగే ఒంగోలులోనూ ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మంగళవారం గెలాక్సీపురిలో నాటి పర్యటన అంశాలపై చర్చ సాగింది. ఇక జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఆయన చిత్రపటాలకు అభిమానులు, కళాకారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒంగోలు పీవీఆర్‌ పాఠశాల మైదానంలో క్రీడాకారులు ఆయన చిత్రంతో ముద్రించిన బ్యానర్‌ పట్టుకొని ప్రదర్శన నిర్వహించారు. స్థానిక నేత రావూరి బుజ్జి మాట్లాడుతూ కృష్ణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. ఈ సంఘటన ఆయన అభిమానులను కలచివేసిందన్నారు. కార్యక్రమంలో రెహమాన్‌, పసుపులేటి సాయి, సుబ్బారావు, నరేంద్ర, శేఖర్‌, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలోనూ కార్యక్రమం జరిగింది. సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.ప్రసాద్‌ తదితరులు కృష్ణ సినీ విశేషాలను పంచుకున్నారు.

పీవీఆర్‌ పాఠశాల మైదానంలో సినీ హీరో కృష్ణ చిత్రంతో ప్రదర్శన నిర్వహిస్తున్న క్రీడాకారులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని