logo

ఎట్టకేలకు మాజీ వాలంటీరు విడుదల

నాగులుప్పలపాడు మండలం ఒమ్మెవరంలో ‘గడప గడపకు..’ కార్యక్రమాన్ని అడ్డుకొన్న ఎస్సీ కాలనీ వాసులపై కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. మాజీ వాలంటీరును పోలీసులు స్టేషన్‌లోనే నిర్బంధించి విడిచిపెట్టకపోవడం విమర్శలకు తావిచ్చింది.

Published : 25 Nov 2022 05:48 IST

రెండురోజుల పాటు స్టేషన్‌లోనే నిర్బంధం

నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: నాగులుప్పలపాడు మండలం ఒమ్మెవరంలో ‘గడప గడపకు..’ కార్యక్రమాన్ని అడ్డుకొన్న ఎస్సీ కాలనీ వాసులపై కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. మాజీ వాలంటీరును పోలీసులు స్టేషన్‌లోనే నిర్బంధించి విడిచిపెట్టకపోవడం విమర్శలకు తావిచ్చింది. మంగళవారం సాయంత్రం మొదలైన ఈ హైడ్రామాకు గురువారం తెరపడింది. వివరాలిలా ఉన్నాయి.. ఈనెల 14న ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబును గ్రామస్థులు, కొందరు ఎస్సీ కాలనీవాసులు అడ్డుకోగా మొత్తం 23 మందిపై కేసులు నమోదయ్యాయి. ఒంగోలు డీఎస్పీ కార్యాలయానికి పిలిచిన అనంతరం అందరినీ విడిచిపెట్టగా మాజీ వాలంటీరు నాగరేణును మాత్రం మంగళవారం నుంచి నాగులుప్పలపాడు స్టేషన్‌లోనే ఉంచారు.. ఎస్సీ, ఎస్టీ కేసులో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అదుపులోకి తీసుకొన్న ఆయనను 24 గంటలలోపు న్యాయస్థానానికి హాజరుపరచాల్సి ఉన్నా అలా చేయలేదు. బుధవారం రాత్రి కూడా నాగరేణును స్టేషన్‌లో ఉంచడంతో హైకోర్టు న్యాయవ్యాది వెంకటరామశర్మ చేరుకొని పోలీసులను ప్రశ్నించారు. ఎస్సై, సీఐలపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు తీసుకొని అందుకు సంబంధించిన రసీదు ఇవ్వాలని స్పష్టంచేశారు. దీంతో ఉన్నతాధికారులు చరవాణి ద్వారా ఆయనను సంప్రదించి సమయం ఇవ్వాలని, గురువారం నాగరేణును విడుదల చేస్తామని తెలిపారు. అప్పటికే స్థానిక పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకొన్న గ్రామస్థులకు న్యాయవాది ఇదే అంశాన్ని తెలిపారు. దీంతో వారు వెనుదిరిగారు. గురువారం ఉదయం 11 గంటలకు పోలీస్‌స్టేషన్‌లో ఉన్న నాగరేణుకు 41 నోటీసు అందజేసి పోలీసులు విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు