logo

చెంచు గిరిజన మహిళలకు ఆసరా

నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు గిరిజన మహిళలు అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆయా కాలాల్లో పండే ఫలాలను సేకరిస్తుంటారు. ఉసిరి, మామిడి, నిమ్మ, జామ, సీతాఫలం వంటి ఫలాలు సేకరించి విక్రయిస్తుంటారు.

Published : 25 Nov 2022 05:56 IST

అటవీశాఖ ఆధ్వర్యంలో శిక్షణ
స్వయం ఉపాధి దిశగా అడుగులు

తయారు చేసిన సంచులతో..

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు గిరిజన మహిళలు అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆయా కాలాల్లో పండే ఫలాలను సేకరిస్తుంటారు. ఉసిరి, మామిడి, నిమ్మ, జామ, సీతాఫలం వంటి ఫలాలు సేకరించి విక్రయిస్తుంటారు. మిగిలిన సమయాల్లో ఉపాధి దొరకక ఇబ్బందులు పడుతున్నారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు అటవీశాఖ సంకల్పించింది. అందులో భాగంగా పుట్టగొడుగుల పెంపకం, జూట్‌, గుడ్డ, కాగితం సంచుల తయారీలో శిక్షణ అందించి స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయిస్తోంది.

పుట్టగొడుగుల పెంపకంలో..

నల్లమల అటవీ ప్రాంతంలోని పెద్దమంతనాల, చింతల, తుమ్మలబైలు, మర్రిపాలెం, చిన్నారుట్ల గూడేలాకు  చెందిన 15 మంది మహిళలకు పుట్టగొడుగుల పెంపకంలో అనంతపురానికి చెందిన నిపుణులతో శిక్షణ ఇప్పించారు. చింతల చెంచు గిరిజన గూడెంలో రూ.ఒక లక్షలతో పుట్టగొడుగుల యూనిట్ ఏర్పాటు చేశారు. ఇందులో మహిళలు పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టారు. మిగిలిన నాలుగు గూడేల్లో త్వరలో యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

కాగితం సంచుల తయారీ

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం ప్లాస్టిక్‌ సంచుల నిషేధించింది. ప్లాస్టిక్‌ సంచుల వినియోగాన్ని తగ్గించాలంటే ప్రత్యామ్నాయంగా కాగితం, గుడ్డ, జూట్‌ సంచుల వాడకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వీటి తయారీలో చెంచు గిరిజన మహిళలను భాగస్వాములను చేసేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. తుమ్మల బైలు చెంచు గిరిజన గూడేనికి చెందిన 15 మంది మహిళలను హైదరాబాద్‌ తీసుకుని వెళ్లి అక్కడ  డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు గుడ్డ, కాగితం సంచుల తయారీలో శిక్షణ ఇచ్చారు. వాటి తయారీకి అవసరమైన సామగ్రిని అటవీశాఖ అందిస్తోంది. ఈ నెల 25 నుంచి 30 వరకు స్థానిక అటవీశాఖ కార్యాలయంలో అపోలో ఫార్మసీ ఆధ్వర్యంలో జూట్‌, గుడ్డ సంచుల తయారీలో గిరిజన మహిళలకు శిక్షణ అందించనున్నారు. అందుకోసం రూ.1.35 లక్షల విలువ చేసే పది యంత్రాలను కొనుగోలు చేశారు. ఇవే కాకుండా ఉసిరి, మామిడి, నిమ్మ తదితర పచ్చళ్ల తయారీపై తర్ఫీదు ఇవ్వనున్నారు.

5 గూడేల్లో యూనిట్లు

నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా అటవీశాఖ కృషి చేస్తోంది. అటవీ, వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వాములైన వారికి జీవనోపాధి కల్పించేందుకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనలో శిక్షణ ఇస్తున్నాం. పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణనిచ్చి ఐదు గూడేల్లో యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం.

- విశ్వేశ్వరరావు, అటవీ క్షేత్రాధికారి, దోర్నాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని