logo

బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట పడేనా!

ఎండీయూ వాహనాలకు జీపీఎస్‌ అనుసంధానం చేసేందుకు మండలానికి ఓ గ్రామం చొప్పున ఎంపిక చేశారు. ఉదాహరణకు కొత్తపట్నం మండలంలో మడనూరు గ్రామం తీసుకున్నారు.

Published : 25 Nov 2022 05:56 IST

పంపిణీ చేసే వాహనాలకు జీపీఎస్‌ వ్యవస్థ
తొలివిడతగా 38 గ్రామాల్లో అమలు

ఎండీయూ వాహనాలకు జీపీఎస్‌ అనుసంధానం చేసేందుకు మండలానికి ఓ గ్రామం చొప్పున ఎంపిక చేశారు. ఉదాహరణకు కొత్తపట్నం మండలంలో మడనూరు గ్రామం తీసుకున్నారు. పాకల(సింగరాయకొండ), ఎం.నిడమలూరు(టంగుటూరు), ఆర్పీ రోడ్డు, గొడుగుపాలెం(ఒంగోలు), బసవన్నపాలెం, సీతారాంపురం(మద్దిపాడు), నాగులుప్పలపాడు(నాగులుప్పలపాడు)...తదితరాలు ఎంపికైనవాటిలో ఉన్నాయి.

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు రాయితీపై పంపిణీ చేస్తున్న బియ్యం అనేకచోట్ల అక్రమార్కుల పరమవుతున్నాయి. కార్డుదారుల ఇళ్ల వద్దకే నిత్యావసర వస్తువులు అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కితం మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్లు(ఎండీయూ) అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇంటింటికీ రేషన్‌ పేరుతో ఒక్కో వాహనానికి సుమారు రూ.7 లక్షల చొప్పున నిధులు ఖర్చు చేశారు. ఆపరేటర్లకు జీతాలు చెల్లిస్తున్నారు. ప్రతి ఇంటికీ సరకులు సరఫరా చేయాల్సి ఉన్నా సక్రమంగా జరగడం లేదు. వివిధ చోట్ల ఎండీయూ వాహనాలే అక్రమాలకు నిలయంగా మారాయి. ఎక్కువ శాతం కార్డుదారులకు బియ్యానికి బదులుగా కిలోకు రూ.9 నుంచి రూ.10 వరకు నగదు ఇస్తున్నట్లు గుర్తించారు. పైగా వాహనంలోనే ఆయా ప్రాంత డీలర్లు ఉండి కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పౌరసరఫరాలశాఖ దృష్టిపెట్టింది. 

ఎండీయూ వాహనాలపై నిఘా

జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15 వరకు ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటా బియ్యం, సరకుల పంపిణీ జరుగుతోంది. ఇటీవల గుత్తేదారులకు బిల్లుల పెండింగ్‌ కారణంగా కార్డుదారులకు కందిపప్పు, పంచదార నిలిచిపోగా కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. అది కూడా ఇంటింటా రాకుండా వీధిలో ఓ చోట నిలిపి అక్కడకు వస్తేనే ఇస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. కార్డులోని ఒక్కో కుటుంబ సభ్యునికి 5 కిలోల చొప్పున కిలో రూపాయికే సరఫరా చేస్తున్నారు. బియ్యం కొనుగోళ్లు, తరలింపులోనూ గతంలో మాదిరే అక్రమాలు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో డీలర్లు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్న ఫిర్యాదులు కోకొల్లలు. కొన్ని గ్రామాల్లో ఎండీయూ ఆపరేటర్లు డీలర్లతో మిలాఖత్‌ అయ్యారన్న విమర్శలున్నాయి. వాటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయోగాత్మకంగా మండలానికి ఒక్కో గ్రామం చొప్పున యంత్రాంగం ఎంపిక చేసింది. ఆ గ్రామ ఎండీయూ వాహనానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి; రాష్ట్ర, జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తారు. జిల్లాలో 38 మండలాలు ఉండగా, 38 గ్రామాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్దార్లు ఎంపిక చేశారు. వాటి వివరాలను జిల్లా పౌరసరఫరాలశాఖ కార్యాలయానికి అందజేశారు. డిసెంబర్‌ 1 నుంచి ఎండీయూ వాహనానికి జీపీఎస్‌ అనుసంధానించి, సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తారు. ఇది విజయవంతమైతే అంతటా విస్తరించనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపటినట్లు డీఎస్వో శ్యామ్‌కుమార్‌ తెలిపారు.


జిల్లాలో చౌకధరల దుకాణాలు 1,392
అన్నపూర్ణ కార్డులు 329
అంత్యోదయ అన్నయోజన 33,117
బియ్యం కార్డులు 6,22,079
ఎండీయూ వాహనాలు 385
ప్రతి నెలా పంపిణీ చేసే బియ్యం 10,393 మెట్రిక్‌ టన్నులు


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని