logo

కన్నీటి తడి

యర్రగొండపాలెం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల రైతులు పంట పొలాలకు నీటి సౌకర్యం లేక అగచాటు పడుతున్నారు.

Published : 25 Nov 2022 05:56 IST

ట్యాంకర్లతో పంటను కాపాడుకుంటున్న రైతులు

ట్యాంకర్‌ నీటిని పొలాల వద్ద ఉన్నకుంటల్లో నింపుతున్న దృశ్యం

త్రిపురాంతకం, న్యూస్‌టుడే: యర్రగొండపాలెం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల రైతులు పంట పొలాలకు నీటి సౌకర్యం లేక అగచాటు పడుతున్నారు. ఉన్న బోర్ల నుంచి నీరు రాకపోవడం, కొత్తవి వేసినా ప్రయోజనం లేక త్రిపురాంతకంలోని సాగర్‌ జలాలను ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి తడుపుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో భూగర్భజలాలు పడిపోయాయి. బోరుబావులను నమ్ముకుని పంటలు సాగుచేస్తే చివరకు అవీ వట్టిపోయాయి. ప్రస్తుతం సుమారు 15 వేల హెక్టార్లలో మిర్చి వేశారు. ఇది పూత దశలో ఉండటంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంది. నీటి తడి కొద్దిగా ఆలస్యమైనా దెబ్బతినే అవకాశం ఉంది. యర్రగొండపాలెం మండలంలోని ఆమనిగుడిపాడు, బోయలపల్లి, గురిజేపల్లి, గోళ్లవిడిపి, అయ్యంబొట్లవారిపల్లి గ్రామాలతో పాటు.. త్రిపురాంతకం మండలం రామసముద్రం, దువ్వలి గ్రామాల్లో భూగర్భ నీటి వనరులు చాలా తక్కువ. బోరు వేసినా నీరు పడుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. దీంతో కొందరు రైతులు సుమారు 10కి పైగా లారీ ట్యాంకర్లను బాడుగకు తీసుకున్నారు. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగర్‌ జలాలను తీసుకొచ్చి పొలాల్లో తవ్వి సిద్ధం చేసుకున్న కుంటల్లో నిల్వ చేసుకుంటున్నారు. అనంతరం మిర్చి పంటకు నీరు పెడుతున్నారు. ఇందుకు రూ.లక్షల్లో ఖర్చవుతుంది. మూడు ట్యాంకర్ల ద్వారా తెచ్చినా ఎకరా పంటకు కూడా సరిపోవడం లేదని తెలిపారు. తాను 15 ఎకరాల్లో మిర్చి వేశానని, అధిక సొమ్ము వెచ్చించి రెండు లారీ ట్యాంకర్లతో నీటిని తీసుకువస్తున్నట్లు ఆమనిగుడిపాడు గ్రామ రైతు జి.వెంకటేశ్వర్లు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని