ఈ-పంట.. సున్నా వడ్డీకి తంటా
కష్టనష్టాలకోర్చి పంటను సాగు చేయడమే తప్ప సాంకేతిక విషయాలపై తగిన అవగాహన లేక రైతులు నష్టపోతున్నారు.
రాయితీ వర్తింపులో చిక్కుముడి
నిబంధనల కొర్రీతో దూరమైపోతున్న రైతులు
ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: కష్టనష్టాలకోర్చి పంటను సాగు చేయడమే తప్ప సాంకేతిక విషయాలపై తగిన అవగాహన లేక రైతులు నష్టపోతున్నారు. కర్షకులకు కొంత ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని అమలుచేస్తుంది. 2020 రబీ సీజన్, 2021 ఖరీఫ్ సీజన్‌లో పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించినవారికి ఇది వర్తిస్తుంది. అర్హులైన రైతుల జాబితాను గత రెండు వారాలుగా జిల్లాలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ఉంచారు. అభ్యంతరాలుంటే రైతులు మరోవిడత అర్జీ పెట్టుకునేందుకు అవకాశం కల్పించారు. ఎంపికైనవారికి ఈ నెల 29న వడ్డీ రాయితీ నిధులు వారి బ్యాంకు ఖాతాలకు జమ కానున్నాయి. అయితే సున్నా వడ్డీ పంట రుణాలకు ఈ-పంట నమోదు తప్పనిసరి. దాంతోపాటు రెండు చోట్ల రుణం తీసుకున్నా ఒక్కదానికే వర్తింపజేశారు. ఇలాంటి వడపోత కారణంగా సగం మంది లబ్ధికి దూరమయ్యారు.
వడ్డీ రాయితీ ఎలా ఇస్తారంటే..
పంట రుణాలపై వాస్తవ వడ్డీ 11 శాతం. బ్యాంకులు రెండు శాతం తగ్గించుకుని 9 శాతానికి ఇస్తున్నాయి. రుణం ఇచ్చే సమయంలోనే కేంద్ర ప్రభుత్వం రెండు శాతం రాయితీ ఇస్తోంది. ఏడాదిలోపు చెల్లిస్తే మరో మూడు శాతాన్ని ప్రోత్సహకంగా అందజేస్తోంది. మిగిలిన నాలుగు శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద భరిస్తోంది. ఏడాదిలోగా రుణాన్ని చెల్లించకుంటే ఆ రైతు 7 శాతం చొప్పున వడ్డీ భరించాల్సి ఉంటుంది.
పూర్తి అవగాహన లేక
వ్యవసాయ రుణాలు మంజూరు లేదా రుణాన్ని పునరుద్ధరించే సమయంలో .. ఏ పంట కోసమనేది రైతులను బ్యాంకర్లు అడగడం లేదు. తమకు కావాల్సిన 1బి, అడంగల్ ప్రతులను తెప్పించుకుని దరఖాస్తు నమూనా నింపి పక్కన పెడుతున్నారు. ‘బిజీగా ఉన్నాం, రేపు రుణ మొత్తాన్ని మీ పొదుపు ఖాతాలో జమ చేస్తాం..డ్రా చేసుకోండి’ అంటూ పలు శాఖల్లో సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమయంలో స్థానికంగా సాగు చేసే ఏదో ఒక పంటను ఆ రైతు పేరు మీద నింపేస్తున్నారు. ఇక్కడే తేడా వస్తుంది. వ్యవసాయశాఖ పరంగా సున్నా వడ్డీ కావాలన్నా.. పంటకు బీమా వర్తించాలన్నా.. ఉత్పత్తులను ఆర్‌బీకేల ద్వారా విక్రయించాలన్నా ఈ-పంట కొలమానం. ఆ సమయంలో ఒక రకం పైరు సాగు చేసినట్లు ఉంటే; బ్యాంకు రుణం ఇచ్చిన సమయంలో మరో రకం చేసినట్లు నమోదు కనిపిస్తుంది. ఇలా వేర్వేరు కావడంతో ఈ-పంటలో ఉన్నవారికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను పరిగణనలోకి తీసుకుని వడ్డీ రాయితీ ఇస్తున్నారు. మరికొందరు రైతులు అవగాహన లేక ఈ-పంట నమోదు చేసుకోలేదు. అటువంటివారు రుణం సకాలంలో చెల్లించినా సున్నా వడ్డీ రాయితీకి అనర్హులయ్యారు. మరి కొందరు ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు, సొసైటీల్లోనూ రుణం తీసుకున్నారు. ఆధార్ అనుసంధానం ద్వారా ఒక రుణానికే వడ్డీ రాయితీ ఇవ్వనున్నారు. 2020 రబీ సీజన్, 2021 ఖరీఫ్ సీజన్‌లో 57,410 మంది రుణాన్ని తిరిగి చెల్లించగా, అందులో ఇప్పటివరకు 29,804 మందిని మాత్రమే సున్నా వడ్డీకి అర్హులయ్యారు. మిగతా 27,606 మంది పథకానికి దూరమయ్యారు. నిబంధనలు లేకుండా సకాలంలో చెల్లించిన అందరికీ వడ్డీ రాయితీ విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Sridevi: ‘ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’ పేరుతో శ్రీదేవి జీవిత చరిత్ర
-
Crime News
Crime News: విషాదం.. మంటల్లో నలుగురు చిన్నారుల సజీవ దహనం
-
Sports News
IND vs AUS: లంచ్ బ్రేక్.. అర్ధశతకం దిశగా లబుషేన్.. ఆసీస్ స్కోరు 76/2 (32)
-
World News
Biden: జిన్‌పింగ్‌కు పరిమితులు తెలుసు..: బైడెన్
-
World News
Earthquake: చేజారిన ఆ 72 గంటలు.. తుర్కియే, సిరియాల్లో భారీగా పెరగనున్న మృతులు..!
-
Movies News
Prakash Raj: ‘కశ్మీర్ ఫైల్స్’పై ప్రకాశ్‌రాజ్ తీవ్ర వ్యాఖ్యలు