logo

మహిళలపై హింస నివారణకు చర్యలు

మహిళలపై జరుగుతున్న హింసను నివారించేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు.

Published : 26 Nov 2022 02:27 IST

లైంగిక వేధింపుల అడ్డుకట్టకు కమిటీ

అవగాహన ర్యాలీ ప్రారంభిస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: మహిళలపై జరుగుతున్న హింసను నివారించేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ఏర్పాటుచేసిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక హింస, సైబర్‌ నేరాలు, మానసికంగా వేధించడం వంటి అంశాలతో పాటు మహిళల ఆర్థిక పురోభివృద్ధి, సాధికారత, ఆరోగ్యం, పౌష్టికాహారం తదితరాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఐసీడీఎస్‌, వివిధ శాఖల సమన్వయంతో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. డీఆర్వో ఓబులేసు, మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారిణి ధనలక్ష్మి, డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి, నగరపాలక సంస్థ సహాయ కమిషనర్‌ వీరాంజనేయులు, ఒంగోలు డీఎస్పీ నాగరాజు, బాలల సంక్షేమ కమిటీ ఛైర్మన్‌ రామాంజనేయులు, సీడీపీవోలు, అంగన్‌వాడీ పర్యవేక్షకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  


వీటికి ఫిర్యాదు చేయాలి

మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌

గృహహింస, లైంగిక వేధింపులు, లింగ వివక్ష, సైబర్‌ బాధితులు డయల్‌-100, పోలీసు వాట్సాప్‌ నంబర్‌ 9121102266 కు ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ సూచించారు.

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: పోలీసు శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై కేసులు నమోదుచేసి కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ హెచ్చరించారు. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు వీలుగా అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కమిటీకి ఛైర్మన్‌గా ఎస్పీ వ్యవహరిస్తారు. అదనపు ఎస్పీ(అడ్మిన్‌) కె.నాగేశ్వరరావు, డీపీఓ పరిపాలనాధికారి ఎం.సులోచన, పర్యవేక్షకురాలు డి.శైలజ, దిశ పీఎస్‌ ఎస్సై దీపిక సభ్యులుగా ఉంటారు. ఒంగోలులోని పోలీసు కల్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు.  వేధింపులకు గురైన ఉద్యోగులు ధైర్యంగా ముందుకొచ్చి ఈ కమిటీ దృష్టికి తీసుకురావాలన్నారు. డాక్టర్‌ టి.స్వాతి, డాక్టర్‌ భానుమతి తదితరులు మహిళలకు పలు అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని