logo

సర్వజనలో కీలక సేవలు

జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిలో ఎట్టకేలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకొని వైద్యం అందించాలని నిర్ణయించారు

Updated : 26 Nov 2022 04:01 IST

ఆరు విభాగాల్లో నిపుణుల నియామకం



ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన వారు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిలో ఎట్టకేలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకొని వైద్యం అందించాలని నిర్ణయించారు. మొత్తం 8 విభాగాలకు వైద్యులను నియమించాలని కోరుతూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భగవాన్‌ నాయక్‌ వైద్య విద్య సంచాలకుని కోరగా ఆ మేరకు అంగీకరించి ఇటీవల ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుతం ఆరుగురు వైద్యులు బాధ్యతలు తీసుకున్నారు. దాంతో వారు చూసే ఓపీ, ఆసుపత్రిలో చేరే రోగులకు సేవలందించే సమయాలను నిర్దేశించారు. అవసరమైన మందులు కేంద్రీయ ఔషధ కేంద్రంలో అందుబాటులో లేకపోతే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ (హెచ్‌డీఎస్‌) నిధులతో కొనుగోలు చేస్తారు. ఇప్పటివరకు వైద్యులు లేక వినియోగించని వ్యాధి నిర్ధరణ పరికరాలకు మోక్షం కలగనుంది. సూపర్‌ స్పెషాలిటీ ఓపీ ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందని సూపరింటెండెంట్‌తో పాటు ఆర్‌ఎంవో డాక్టర్‌ చైతన్య తెలిపారు.

అందుబాటులోకి వచ్చిన సేవలు పరిశీలిస్తే..

ప్రతి సోమ, గురువారాల్లో సర్జికల్‌ ఓపీ మూడో నంబరులో న్యూరాలజిస్టు అందుబాటులో ఉంటారని అధికారులు తెలిపారు. మంగళ, శుక్రవారాల్లో ప్లాస్టిక్‌ సర్జన్‌ సేవలందిస్తారు. ‌ ప్రతి సోమ, శుక్రవారాల్లో మూడో నంబరు ఓపీ విభాగంలో యూరాలజిస్టు ఉంటారు ‌ మంగళ, శుక్రవారాల్లో మూడోనంబరు ఓపీలో పీడియాట్రిక్‌ సర్జన్‌ .. పదోనంబరు ఓపీలో కార్డియాలజిస్ట్‌ అందుబాటులో ఉంటారు. బుధ, శుక్రవారాల్లో పదోనంబరు ఓపీలో నెఫ్రాలజిస్ట్‌ సేవలుంటాయి.

ఆ రెండు విభాగాల్లోనూ భర్తీ అయితే..

గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌, న్యూరోఫిజీషియన్‌ వైద్యుల పోస్టులు ఇంతవరకు భర్తీకాలేదు. రోజువారీ వచ్చే రోగుల్లో ఈ తరహా సమస్యలతో ఉన్నవారు అధికమే. గ్యాస్ట్రోస్కోపీ యంత్రం అందుబాటులో ఉన్నా వైద్యుడు, సాంకేతిక సిబ్బంది లేక నిరుపయోగంగా మారింది. డాక్టర్‌ భగవాన్‌ నాయక్‌ మాట్లాడుతూ అన్ని స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతమున్న నిపుణులు ఉదయం ఓపీ చూశాక, సాయంత్రం ఆసుపత్రిలో రోగుల పరిశీలన.. శస్త్ర చికిత్సలకు హాజరవుతారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని