logo

అంతా ఇష్టారాజ్యం!

గుండ్లకమ్మ ప్రాజెక్టును ఆనుకుని కొందరు అడ్డగోలుగా చేపల చెరువులు సాగు చేస్తున్నారు.

Published : 28 Nov 2022 02:46 IST

గుండ్లకమ్మను ఆనుకుని చేపల చెరువుల ఏర్పాటు
నిబంధనలకు విరుద్ధంగా జలాశయంలోనూ వేట
న్యూస్‌టుడే - మద్దిపాడు

జలాశయాన్ని ఆనుకుని ఏర్పాటు చేసిన చేపల చెరువులు

గుండ్లకమ్మ ప్రాజెక్టును ఆనుకుని కొందరు అడ్డగోలుగా చేపల చెరువులు సాగు చేస్తున్నారు. ఈ పేరిట బయట ప్రాంతాల మత్స్యకారులను రప్పించి... జలాశయంలోనూ అనధికారికంగా వేట చేయిస్తున్నారు. స్థానిక మత్స్యకారుల ఉపాధికి గండి కొడుతున్నారు. గతంలోనూ ఇదే తరహా వ్యవహారంలో వివాదాలు తలెత్తడంతో అధికారులు చొరవ చూపి పరిష్కరించారు. ప్రస్తుతం... వ్యాపారుల వైఖరితో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.

నిబంధనల ప్రకారం గుండ్లకమ్మ జలాశయాన్ని ఆనుకుని చేపల చెరువులు తవ్వరాదు. కానీ కొందరు వ్యక్తులు అడ్డగోలుగా చెరువులు తవ్వించి చేపల పెంపకం చేపడుతున్నారు. బయటకు మామూలు చేపలని చెబుతున్నా... చాలా వరకు నిషేధిత క్యాట్‌ ఫిష్‌నే పెంచుతున్నారు. మాంసం వ్యర్థాలు, జంతు కళేబరాలను వీటికి మేతగా వేస్తున్నారు. దీంతో ఆ పరిసరాలు కలుషితమవుతున్నాయి. చెరువులకు అవసరమైన నీటిని సైతం గుండ్లకమ్మ నుంచే పెడుతున్నారు. అంతా బాహాటంగానే సాగుతున్నా... ఈ అనధికారిక వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా ప్రయోజనం ఉండడం లేదని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేపల చెరువుల నిర్వహణకు వాటి యజమానులు... కృష్ణ, పశ్చిమ గోదావరి, మచిలీపట్నం తదితర ప్రాంతాల నుంచి మత్స్యకారులను రప్పిస్తున్నారు. వారందరికీ ఇక్కడే తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేస్తున్నారు. వీరిద్వారా జలాశయంలోని చేపలనూ పట్టిస్తున్నారు. దీంతో గుండ్లకమ్మపైనే ఆధారపడిన లైసెన్స్‌డ్‌ మత్స్యకారుల ఉపాధికి గండి పడుతోంది.

సమస్య మళ్లీ మొదటికి...

గుండ్లకమ్మ ప్రాజెక్టు ద్వారా ఈ పరిసరాల్లోని దాదాపు నాలుగు వేల మంది మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. జలాశయంలో వీరు మాత్రమే చేపల వేట సాగించేలా ప్రత్యేకంగా లైసెన్స్‌లను సైతం ప్రభుత్వం మంజూరు చేసింది. మత్స్య సంపదకు కొరత లేకుండా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏటా చేప పిల్లలను సైతం విడిచిపెడతారు. బయటివారెవరూ ఇక్కడ వేట సాగించడానికి వీల్లేదు. కానీ, కొందరు వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి మత్స్యకారులను రప్పించి... వారి ద్వారా అనధికారికంగా వేట సాగించేవారు. ఈ క్రమంలో తరచూ వివాదాలు తలెత్తడంతో... మత్స్యశాఖ అధికారులు పక్కాగా తనిఖీలు చేపట్టి బయటి ప్రాంతాల వారిని ఖాళీ చేయించారు. ఆ సమస్య సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో... చేపల చెరువుల పేరిట మళ్లీ బయటి వారిని రప్పించారు. పాత పునరావాస గ్రామాల్లో వారికి ఆవాసం కల్పించి... అనధికార వేట చేయిస్తున్నారు. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.

కాపలాదారుల కోసం వేసిన పాకలు

* జలాశయంలో పెద్ద చేపలను మాత్రమే పట్టాలి. మత్స్యసంపద వృద్ధి దృష్ట్యా పిల్లలను పట్టరాదు. ఇందుకు అనుగుణంగానే వలలు వినియోగించాల్సి ఉంటుంది. కానీ... బయటి నుంచి వచ్చిన మత్స్యకారులు చిన్న కన్నులు కలిగిన వలలను వినియోగిస్తూ పిల్లలను సైతం పడుతున్నారు. వీటిని అనధికారిక చెరువుల్లో పెంచుతున్న క్యాట్‌ఫిష్‌కు ఆహారంగా అందిస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు గేట్లు దెబ్బతిని... నీరంతా బయటకు పోయి మత్స్యసంపద పూర్తిగా తగ్గిపోయింది. ఉన్న కొద్ది పాటి చేపలనూ బయటవారు తీసుకుపోతుండడంతో... స్థానిక మత్స్యకారులకు తీరని నష్టం వాటిల్లుతోంది.


పరిశీలించి చర్యలు తీసుకుంటాం...

జలాశయాన్ని ఆనుకుని అనధికారికంగా చేపలు చెరువులు సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గుండ్లకమ్మలోనూ లైసెన్స్‌ కలిగిన వారు మాత్రమే వేట సాగించాలి. ఆ ప్రాంతాన్ని పరిశీలించి బయటివారు ఉంటే ఖాళీ చేయిస్తాం.

చంద్రశేఖర్‌, మత్స్యశాఖ జేడీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని