logo

కొంటారా! చి‘వరి’ వరకు సాగదీస్తారా!!

జిల్లాలో సాగయ్యే ప్రధాన పంటల్లో వరి ఒకటి. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి డిసెంబరు మొదటి వారంలో ధాన్యం నూర్పిళ్లు ప్రారంభం కానున్నాయి.

Updated : 28 Nov 2022 05:42 IST

వచ్చే వారం నుంచి ధాన్యం నూర్పిళ్లు
గత అనుభవాలతో పాఠాలు నేరిస్తే మేలు
త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే

ధాన్యాన్ని బస్తాల్లోకి నింపుతున్న కూలీలు(పాత చిత్రం)

జిల్లాలో సాగయ్యే ప్రధాన పంటల్లో వరి ఒకటి. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి డిసెంబరు మొదటి వారంలో ధాన్యం నూర్పిళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో 263 రైతు భరోసా కేంద్రాల ద్వారా 45 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్టు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. కేవలం మాటల్లోనే కాకుండా అందుకు సంబంధించి తగినంత మంది సిబ్బందిని కేటాయించి అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాల్సి ఉందని అనుభవాలు తెలుపుతున్నాయి. గత ఖరీఫ్‌లో ఆలస్యంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించడం.. సరైన ఏర్పాట్లు చేయకపోవడం.. రైతుల వివరాల నమోదులో జాప్యం చోటుచేసుకోవడం వంటి కారణాలతో ధాన్యాన్ని ప్రైవేట్‌ వ్యాపారులకు తెగనమ్ముకోవాల్సి వచ్చింది. ఫలితంగా ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కనీస మద్దతు ధర కన్నా రూ.300 తక్కువగా విక్రయించి అన్నదాతలు నష్టపోయారు. గతంలో చోటు చేసుకున్న పొరపాట్లకు ఈసారి తావివ్వకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

* ఈసారి రంగంలోకి వాలంటీర్లు...: ధాన్యం సేకరణకు ఆర్బీకేలు కాకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్‌), టుబాకో గ్రోయర్‌ యూనియన్‌ల ద్వారా 51 మద్దతు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఆర్బీకే సిబ్బందితో పాటు ఈసారి నుంచి కొత్తగా 160 మంది వాలంటీర్లను కూడా ప్రభుత్వం భాగస్వాములను చేసింది. ఈ-క్రాప్‌ నమోదై ఈకేవైసీ చేయించుకున్న రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేస్తామనే నిబంధన విధించారు. ధాన్యంలో 17 శాతం లోపే తేమ ఉండాలి. డిసెంబరు ఆరంభం నుంచి యంత్రాల ద్వారా వరి కోత, నూర్పిడిలు చేయడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈలోపే కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేసి యంత్రాలు, పరికరాలు అందుబాటులో ఉంచాలి. అన్నదాతలు తెచ్చిన ధాన్యం నమూనాలు వేగంగా పరిశీలించి జాప్యం లేకుండా వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

* ఆ కేంద్రాల్లో అక్రమాలు...: రబీ సీజన్‌లో చేపట్టిన ధాన్యం కొనుగోలులో త్రిపురాంతకం, పుల్లలచెరువు, దొనకొండ, ఒంగోలు తదితర మండలాలతో పాటు జిల్లాలో పలు చోట్ల అక్రమాలు చోటు చేసుకున్నాయి. వ్యాపారులు, ఆర్బీకే సిబ్బంది కుమ్మక్కై రైతులకు మద్దతు ధర దక్కకుండా చేశారు. ఈ కారణంగా ధాన్యం అమ్మిన పలువురు రైతులు నగదు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈసారి అక్రమాలకు తావివ్వకుండా పటిష్ఠ చర్యలు చేపట్టి ధాన్యాన్ని విక్రయించిన రైతులకు సకాలంలో నగదు జమ అయ్యేలా చూడాల్సి ఉంది.

* వేగం పెంచకుంటే తప్పవు వెతలు...: ధాన్యం కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. రైతులందరికీ తెలిసేలా ధాన్యం కొనుగోలు కేంద్రాలపై విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రధానంగా తేమ శాతం నిబంధనపై ముందుగానే అవగాహన కల్పించాలి. కల్లాల నుంచి వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్టు ఆర్బీకేలు కొనుగోలు చేయాలి. జాప్యం చేస్తే అత్యధిక శాతం రైతులు నిల్వ చేసే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం వేగంగా సేకరించకుంటే దళారులు, వ్యాపారులు రంగ ప్రవేశం చేసి మద్దతు ధర కన్నా తక్కువకు కొనుగోలు చేసే ప్రమాదముంది. కొనుగోలు చేసిన తర్వాత నగదు చెల్లింపుల్లో జాప్యం లేకుండా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యేలా అవసరమైన నిధులు కేటాయించాలి. ఈ-క్రాప్‌ నమోదు, ఈకేవైసీలో సమస్యలు పరిష్కరించాలి. కనీస మద్దుతు ధర కంటే తక్కువకు దళారులు, వ్యాపారులు కొనుగోలు చేయకుండా క్షేత్రస్థాయిలో పటిష్ఠ చర్యలు చేపట్టాలి.


పర్యవేక్షణకు అధికారుల నియామకం...

జిల్లాలో రైతులు పండించిన ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆర్బీకేలు, మద్దతు కొనుగోలు కేంద్రాల ద్వారా డిసెంబర్‌ రెండో వారం నుంచి ధాన్యం సేకరణ ప్రారంభిస్తాం. గన్నీ సంచులు, తేమ శాతం పరికరాలు అందుబాటులో ఉంచుతాం. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఆధ్వర్యంలో పర్యవేక్షణాధికారులను ఇప్పటికే నియమించారు.

పి.గ్లోరియా, పౌరసరఫరాల శాఖ డీఎం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని