తాగుడు.. ఊగుడు...
ఎక్కడంటే అక్కడ తాగడం.. ఒల్లు మరిచి ఊగడం జిల్లాలోని అన్ని గ్రామాల్లో తరచూ కనిపిస్తున్న సాధారణ దృశ్యాలు.
ఊరూరా విచ్చలవిడిగా గొలుసు దుకాణాలు
వీధుల వెంట.. ఇళ్లలోనూ మద్యం విక్రయాలు
ఈనాడు డిజిటల్, ఒంగోలు - న్యూస్‌టుడే, సింగరాయకొండ, మార్కాపురం
కందుకూరు రోడ్డు కూడలిలో మద్యం దుకాణం వద్ద రోడ్డు పైనే మందుబాబులు
ఎక్కడంటే అక్కడ తాగడం.. ఒల్లు మరిచి ఊగడం జిల్లాలోని అన్ని గ్రామాల్లో తరచూ కనిపిస్తున్న సాధారణ దృశ్యాలు. చిల్లర దుకాణాలు, కిళ్లీ కొట్లు, దాబాలు, కిరాణా కొట్లతో పాటు కొందరు ఇళ్లలోనూ అక్రమంగా మద్యం నిల్వ చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న వాటితో పాటు అంతకుమించి అన్ని గ్రామాల్లోనూ గొలుసు దుకాణాలను నడుపుతున్నారు. కొన్నిచోట్ల మద్యం దుకాణం సిబ్బంది ఇతరులతో కుమ్మక్కై అమ్మకాలకు సహకరిస్తున్నారు. ఒక్కో క్వార్టర్ సీసాల పెట్టెపై రూ.300 నుంచి రూ.350 వరకు అదనంగా వసూలు చేస్తూ ఊళ్లలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. లంచాల మత్తు, అధికార నాయకుల ఒత్తిడితో సెబ్, పోలీసు అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే ఏకంగా పాఠశాలలు, ఇళ్లు, పంట పొలాల వద్దనే మందుబాబులు తాగుతూ మత్తులో మునుగుతున్నారు. దీంతో మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
* ద్విచక్ర వాహనంపై తెచ్చిస్తూ...: యర్రగొండపాలెంలో 10కి పైగా మద్యం గొలుసు దుకాణాలున్నాయి. చిరుతిండ్లు, రోడ్ల పక్కన చిన్న కూల్‌డ్రింక్ విక్రయించే కొన్ని దుకాణాల్లోనూ మద్యం అందుబాటులో ఉంచుతున్నారు. నాటు సారా విక్రేతల ఇళ్లపై దాడులు చేసే పోలీసులు.. అదే సమయంలో మద్యం గొలుసు దుకాణాల నిర్వాహకులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎక్సైజ్ అధికారులకు తరచూ ఫిర్యాదులు అందుతున్నా పట్టించుకోవడం లేదని పలువురు స్థానికులు విమర్శిస్తున్నారు. వై.పాలెం పట్టణంలోనే రోజుకు రూ.50 వేల వరకు అనధికారికంగా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. సీసాపై అదనంగా చెల్లిస్తే కోరుకున్న చోటికే ద్విచక్ర వాహనంపై తెచ్చి మరీ మందుబాబులకు అందిస్తున్నారు.
* ఇళ్లే విక్రయశాలలు...: గిద్దలూరు మండలం సంజీవరాయునిపేటలో మూడు మద్యం గొలుసు దుకాణాలున్నాయి. ఇళ్లల్లో నిల్వ ఉంచి మరీ విక్రయాలు సాగిస్తున్నారు. ఇక్కడికి సమీపంలోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచే తెస్తుండటం గమనార్హం. రోజుకు దాదాపు రూ.30 వేల వరకు గొలుసు దుకాణాల్లో అమ్మకాలు సాగుతుండగా.. సీసాపై అదనంగా రూ.20 నుంచి రూ.50 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
* దాచి.. అడిగిన వారికి అప్పగించి...: ఎస్‌ఎన్‌పాడు మండలంలోని చంద్రపాలెం మినహా గుడిపాడు, మాచవరం తదితర గ్రామాల్లో మద్యం గొలుసు దుకాణాలున్నాయి. కొందరు సమీపంలోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి సీసాలు తెచ్చి ఇళ్లు, సమీపంలోని రహస్య ప్రాంతాల్లో దాచి ఉంచి విక్రయాలు సాగిస్తున్నారు. రోజుకు ఇక్కడ రూ.20 వేల వరకు వ్యాపారం సాగుతోంది. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి.
* కూలీలు, కార్మికులే లక్ష్యంగా...: మార్కాపురం పట్టణం, గ్రామీణంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సిబ్బంది ఒక కేసుకు రూ.300 అదనంగా తీసుకుంటూ గొలుసు దుకాణ నిర్వాహకులకు సరఫరా చేస్తున్నారు. పెట్టెలో ఉండే 48 క్వార్టర్ సీసాల్లో ఒక్కో దానిపై రూ.30 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇళ్లు, ఇతర రహస్య ప్రాంతాలు, పట్టణ ప్రాంతంలో కూల్‌డ్రింక్ దుకాణాలు, చిన్నపాటి హోటళ్లు, బడ్డీ దుకాణాల ద్వారా కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, పేద ప్రజలే లక్ష్యంగా విక్రయాలు జోరుగా చేపడుతున్నారు.
* పండగల వేళ అదనపు దోపిడీ...: పీసీపల్లి, పామూరు, కనిగిరిలో పలుచోట్ల ప్రభుత్వ మద్యం సీసాలను ఇళ్లలో అక్రమంగా నిల్వ చేసి తెలిసిన వారికి విక్రయిస్తున్నారు. పండగలు, ఇతర కార్యక్రమాల సమయంలో ఒక్కో సీసాపై రూ.20 నుంచి రూ.50 వరకు ఎక్కువ వసూలు చేస్తున్నారు. కిరాణా దుకాణాల్లోనూ రోజు ఖర్చులకు వస్తాయంటూ మద్యం సీసాలను అందుబాటులో ఉంచుతున్నారు.
* బడ్డీకొట్లలోనూ ‘బార్లా’ తెరిచి...: ఒంగోలు నగరంలో 20 ప్రభుత్వ మద్యం దుకాణాలు, 15 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలు మూతపడిన తర్వాత శివారు, జాతీయ రహదారి వెంట ఉన్న కొన్ని దాబాలు, శీతలపానీయాల దుకాణాల్లో మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారు. అక్కడే గ్లాసులు, తినుబండారాలు అందుబాటులో ఉంచుతున్నారు. కర్నూలు పైవంతెన కింద, అద్దంకి బస్టాండ్, కొత్తపట్నం బస్టాండ్ సమీప ప్రాంతాల్లో ఈ తరహా వ్యవహారం జోరుగా సాగుతోంది.
‘కొండ’లో కూరగాయల దుకాణాల్లోనూ...
సింగరాయకొండ బస్టాండ్ సమీపంలో బహిరంగంగా మద్యం తాగుతున్న దృశ్యం
సింగరాయకొండ గ్రామంలో మొత్తం ఆరు ప్రభుత్వ మద్యం దుకాణాలున్నాయి. ఒక్కో చోట రోజుకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు విక్రయాలు సాగుతున్నాయి. ఇవికాకుండా అనధికారిక గొలుసు దుకాణాలు 20కి పైగా ఉన్నాయి. వాటిలోనూ ఒక్కో చోట రోజుకు 50 నుంచి 100 వరకు క్వార్టర్ సీసాలు విక్రయమవుతున్నాయి. చిన్నపాటి కిరాణా, శీతలపానీయాలతో పాటు కొన్ని కూరగాయల దుకాణాల్లోనూ మద్యం సీసాలు ఎప్పుడంటే అప్పుడు లభ్యమవుతున్నాయి. దుకాణాల ఎదుట, పక్కన.. బస్టాండ్ ప్రాంగణంలో, చెట్ల కింద బహిరంగంగానే తాగేస్తున్నారు. ఫకీర్‌పాలెం రహదారి వెంట, బడ్డీ దుకాణాలు, నివాసాల మధ్య మద్యం విక్రయిస్తున్నారని పోలీసు అధికారులకు పలువురు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవు. టంగుటూరు, కొండపి ప్రాంతాల్లోనూ విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు.
తెల్లవారు జాము నుంచే మొదలు...
దర్శిలో తాగిపడేసిన సీసాలు, ప్లాస్టిక్ గ్లాసుల వ్యర్థాలతో నిండిపోయిన కాలువ
దర్శిలో దాదాపు 10 వరకు అనధికార మద్యం గొలుసు దుకాణాలున్నాయి. వీటిలో తెల్లవారుజామున గం.4.30 నుంచి రాత్రి 12 గంటల వరకు విక్రయాలు సాగుతున్నాయి. అగ్రహారం, కల్లూరు, బొద్దికూరపాడు, కొచ్చర్లకోట గ్రామాల్లో ఒక్కో దుకాణంలో రోజుకు రూ.2 వేలు నుంచి రూ.10 వేల వరకు వ్యాపారం సాగుతోంది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎంఆర్‌పీపై రూ.10 అదనంగా చెల్లించి తెస్తున్న వ్యాపారులు, మందుబాబుల వద్ద రూ.30 నుంచి రూ.50 వరకు మరింత ఎక్కువ వసూలు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Ap Special Status: ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం
-
Movies News
rangamarthanda review: రివ్యూ: రంగ మార్తాండ
-
Sports News
Sachin - Sehwag: ముల్తాన్ టెస్టులో సిక్స్ కొడతానంటే.. సచిన్ అలా అనేశాడు: సెహ్వాగ్
-
World News
Medvedev: క్షిపణి రావొచ్చు.. ఆకాశాన్ని గమనిస్తూ ఉండండి: ఐసీసీకి మెద్వదేవ్ వార్నింగ్
-
Movies News
Brahmanandam: చనిపోయే వరకూ కమెడియన్‌గానే ఉంటా: బ్రహ్మానందం
-
General News
TSPSC: పేపర్ లీకేజీ కేసు స్టేటస్ రిపోర్టు ఇవ్వండి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు