logo

భూములు నిజం.. నగదు మాయం...

సేకరించిన రూ.కోట్లకు లెక్కలు లభించడం లేదు. ఖాతాల నిర్వహణా సక్రమంగా లేదు. కొందరికి క్యాష్‌బ్యాక్‌ రూపంలో ఆదాయం వచ్చినట్లు చెబుతున్నారు.

Published : 28 Nov 2022 02:46 IST

లెక్క తేలని సంకల్ప సిద్ధి ఆస్తులు
కనిగిరిలోని 150 ఎకరాలే గుర్తింపు
ఈనాడు, అమరావతి

సేకరించిన రూ.కోట్లకు లెక్కలు లభించడం లేదు. ఖాతాల నిర్వహణా సక్రమంగా లేదు. కొందరికి క్యాష్‌బ్యాక్‌ రూపంలో ఆదాయం వచ్చినట్లు చెబుతున్నారు. సొమ్ములు ఎక్కడి నుంచి చెల్లించారో వివరాలు తెలియదు. కనిగిరిలో కొనుగోలు చేసినట్టు చెబుతున్న భూమి మినహా ఇతర చర, స్థిర ఆస్తులు కనిపించడం లేదు. ఇదీ సంకల్ప సిద్ధి ఈ మార్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ వ్యవహారం. మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ విధానంలో తక్కువ కాలంలో పెట్టుబడి ఆరు రెట్లు అవుతుందని నమ్మించి వసూలు చేసిన సొమ్ము ఎటువైపు వెళ్లిందో పోలీసులు గుర్తించలేకపోతున్నారు. ఈ మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ సంస్థకు సూత్రధారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులేనని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు దర్యాప్తుపై ఉన్నత స్థాయిలో రాజకీయ ఒత్తిడి ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. గత నాలుగు రోజులుగా పోలీసు బృందాలు పలుచోట్ల విచారణ చేపట్టి ఒక్క కనిగిరిలో మినహా ఎక్కడా ఎలాంటి ఆస్తులు కనిపెట్టలేదు. నిడమానూరు, విజయవాడ దుర్గా అగ్రహారంలో ఏర్పాటు చేసిన ఈ మార్ట్‌లో ఉన్న గృహోపకరణాలను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టోర్లు సీజ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంస్థ ఎండీ గుత్తా వేణుగోపాలకృష్ణ, డైరెక్టర్‌గా ఉన్న ఆయన తనయుడు కిరణ్‌కుమార్‌లు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు. వీరితో పాటు పలువురు ఉద్యోగులను విచారిస్తున్నారు.

మరో 50 ఎకరాలు కొనుగోలుకు రంగం సిద్ధం!...: కనిగిరిలో కొనుగోలు చేసిన 150 ఎకరాల్లో ఎర్రచందనం, శ్రీగంధం మొక్కలు పెంచేలా ఒక అగ్రోస్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు మూడు పోలీసు బృందాలు కనిగిరి వెళ్లి విచారణ చేశాయి. అక్కడే మరో 50 ఎకరాలు కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తేలింది. దీనికి సొమ్ములు చెల్లించలేదు. వచ్చే ఆదాయంలో తమకు, అగ్రోస్‌ సంస్థకు 60:40 నిష్పత్తి ప్రకారం ఒప్పందం కుదుర్చుకున్నారు.

లంచాల పైనా పోలీసుల ఆరా..!: సంకల్ప సిద్ధి సంస్థ నుంచి కొంత మంది అధికారులు, మీడియా వ్యక్తులకు(ఈనాడు కాదు) అందిన లంచాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక ప్రముఖ మీడియా ఛానల్‌ ప్రతినిధి సూత్రధారుడిగా పంపకాలు సాగినట్టు గుర్తించారు. దీనికి సంబంధించిన చిత్రాలు లభించాయని తెలిసింది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. కొంతమంది పోలీసులకు భారీ మొత్తం అందజేసినట్లు విచారణలో తెలిపినట్లు సమాచారం. నెల క్రితం ఓ విభాగానికి చెందిన పోలీసులకు చందా రూపంలో పెద్ద మొత్తమే అందించారని అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని