logo

పేదల బియ్యం అక్రమార్కుల భోజ్యం

పేదల కడుపు నింపాల్సిన రేషన్‌ బియ్యం కొందరు అక్రమార్కులకు కోట్లాది రూపాయల ఆదాయ వనరులుగా మారిపోయాయి.

Published : 29 Nov 2022 02:17 IST

జిల్లాలో పక్కదారి పట్టించి విదేశాలకు..

అధికారం అండతో జోరుగా దందా

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు

అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నా అధికారులు స్పందించలేదంటూ
ఇటీవల కనిగిరిలో నిరసన తెలుపుతున్న స్థానికులు

పేదల కడుపు నింపాల్సిన రేషన్‌ బియ్యం కొందరు అక్రమార్కులకు కోట్లాది రూపాయల ఆదాయ వనరులుగా మారిపోయాయి. అధికార పార్టీ నేతల అండ చూసుకొని పంపిణీ చేయకుండానే వేల టన్నులను సరిహద్దులు దాటించేస్తున్నారు. మొక్కుబడి తనిఖీలతో అధికారులు సరిపెడుతున్నారు. పట్టుబడిన సందర్భాల్లో ముఖ్య నేతల పేర్లు చెప్పడంతో వదిలేస్తున్న పరిస్థితి. ఎవరినైనా అరెస్టు చేసి మిల్లులకు సీలు వేసినా ఆ వెంటనే పలుకుబడి ఉపయోగించి నిర్వాహకులు తెరిపిస్తున్నారు.

దర్శి మండలం రాజంపల్లిలో బియ్యం బస్తాలు స్వాధీనం
చేసుకున్న అధికారులు (పాతచిత్రం)

జిల్లాలో 6.22 లక్షల బియ్యం కార్డులు ఉన్నాయి. నెలకు సరాసరి 10 వేల టన్నులకుపైగా బియ్యం పంపిణీ జరుగుతోంది. ఇందులో దాదాపు 4 వేల టన్నుల వరకు పక్కదారి పడుతున్నట్లు అంచనా. అన్ని నియోజకవర్గాల్లో ఈ వ్యవహారం కొనసాగుతోంది. దర్శి, కనిగిరి, మార్కాపురం, సంతనూతలపాడులో అధికం. ఇళ ్లవద్దనే బియ్యం, ఇతర సరకులు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎండీయూ వాహనాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పల్లెల్లో చాలామంది తీసుకుంటుండగా, కొందరికి సరకు అయిపోయిందని చెప్పి డబ్బులు ఇస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 30శాతం మందికి మించి తీసుకోవడం లేదని తెలుస్తోంది.. ఇలా దారి మళ్లింపు నేపథ్యంలో కార్డుదారులు బియ్యం వద్దంటే డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వానికి గతంలో ప్రతిపాదనలు వెళ్లగా అది అమలులోకి రాలేదు.

నెలకు రూ.14 కోట్ల ఆదాయం

వాహనాలు వచ్చినపుడు లబ్ధిదారులు ఇళ్లలో ఉండకపోవడం, వారు ఉన్నప్పుడు వాహనాలు రాకపోవడం వంటివి చాలాచోట్ల కనిపిస్తుంది. కొన్నిసార్లు వాహనం ఎక్కడుందో కనుక్కుని అక్కడకు వెళ్లినా ఆ సమయంలో బియ్యం లేవని చెబుతుండటంతో వేలిముద్రలు వేసి బియ్యానికి బదులు డబ్బులు తీసుకుంటున్నారు. ఒంగోలు, సంతనూతలపాడు తదితర ప్రాంతాల్లో కిలో రూ.9, కొన్నిచోట్ల రూ.10 చొప్పున ధర కడుతున్నారు. కొందరు డీలర్లు రూ.10, రూ.12 చొప్పున మిల్లర్లు, వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అదే బియ్యాన్ని వారు అక్రమ వ్యాపారులకు కిలో రూ.15 చొప్పున ఇస్తున్నారు. అలా సేకరించినవాటిని కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు.. అక్కడినుంచి విదేశాలకు తరలిస్తున్నారు. బియ్యం వెళ్లే దేశాన్ని బట్టి అక్కడ కిలో రూ.25-35 ధరకు అమ్ముతున్నారు. ఇలా జిల్లా నుంచి నెలకు 4 వేల టన్నులు అక్రమంగా తరలిపోతుండగా ఆ మేరకు కిలోకు రూ.9 చొప్పున రూ.14 కోట్లు చేతులు మారుతున్నాయి. ఇందులో కొందరు ప్రజాప్రతినిధులకు కూడా వాటాలు వెళ్తున్నాయి.

కానరాని నిఘా

ఈ నెల 23న అర్థరాత్రి కనిగిరిలో అక్రమంగా తరలిస్తున్న 150 బస్తాల రేషన్‌ బియ్యాన్ని ప్రజాసంఘాల నాయకులు పట్టుకున్నారు. వాహనాన్ని నిలువరించి అధికారులకు సమాచారం ఇచ్చినా మరుసటిరోజు ఉదయం వరకు స్పందించకపోవడంతో స్థానికులు రోడ్డుపై బైటాయించి ఆందోళనకు దిగారు. ఆ తర్వాత అధికారులు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పది రోజుల క్రితం మద్దిపాడు మండలంలోని ఓ మిల్లులో అక్రమంగా రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకోవడానికి యత్నించగా వైకాపా ముఖ్య నేత ఫోన్‌ చేయడంతో వదిలేసినట్లు తెలిసింది.

ఆ మధ్య సంతనూతలపాడు నియోజకవర్గంలోని రెండు మిల్లుల్లో 5 వేల బస్తాలకు పైగా రేషన్‌బియ్యం గుర్తించిన అధికారులు సీలు వేశారు. రాజకీయ ఒత్తిడితో కొద్దిరోజుల్లోనే ఆ మిల్లు తెరుచుకుని యథావిధిగా నడుస్తుంది. ‌

ఈ ఏడాది సెప్టెంబరు 27న దర్శి మండలం రాజంపల్లిలోని ఓ టెంట్‌హౌస్‌లో బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారంతో విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. 200 బస్తాలు పట్టుకున్నారు. ఇలా ఇటువంటివి నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి.  


బృందాలు ఏర్పాటుచేసి  తనిఖీలు

శ్యామ్‌కుమార్‌, డీఎస్వో

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా అడ్డుకోవడానికి చర్యలు చేపడుతున్నాం. నిరంతర తనిఖీలతోపాటు విజిలెన్స్‌, పౌర సరఫరాల అధికారులతో బృందాలు ఏర్పాటుచేశాం. ఫిర్యాదులు రాగానే అధికారులు, సిబ్బంది వెంటనే వెళ్లి స్వాధీనం చేసుకుంటున్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి క్రిమినల్‌ కేసులు పెడుతున్నాం. 

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు