logo

లాభాలంటూ నమ్మించాడు.. కొంపలు ముంచాడు!

‘‘బొట్టుబిళ్లలు, దీపం వత్తుల తయారీతో ఇంటి దగ్గరే ఉంటూ నెలకు రూ.30 వేల సంపాదన’’ అంటూ ఓ వ్యక్తి ఘరానా మోసానికి తెరలేపాడు.

Published : 29 Nov 2022 02:17 IST

నిర్వాహకుడు రమేశ్‌

ఈనాడు- హైదరాబాద్‌ : ‘‘బొట్టుబిళ్లలు, దీపం వత్తుల తయారీతో ఇంటి దగ్గరే ఉంటూ నెలకు రూ.30 వేల సంపాదన’’ అంటూ ఓ వ్యక్తి ఘరానా మోసానికి తెరలేపాడు. ఏకంగా 1,400 మందితో వాటి తయారీ యంత్రాలు కొనుగోలు చేయించాడు. సరకు కిలోల లెక్కన తనకు విక్రయిస్తే లాభాలు ఇస్తానంటూ నమ్మించి నిండా ముంచాడు. రూ.కోట్లలో మోసానికి పాల్పడి బోర్డు తిప్పేసిన ఆ ఘరానా మోసం హైదరాబాద్‌లోని ఏఎస్‌రావు నగర్‌లో వెలుగులోకి వచ్చింది.
రాచర్ల మండలానికి చెందిన రావులకొల్లు రమేశ్‌ ఆర్‌ఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌(గోయింగ్‌ టుగెదర్‌) పేరుతో  ఏఎస్‌రావునగర్‌లో గతేడాది కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహించే ఇతడు ఇంటి దగ్గరే ఉంటూ బొట్టు బిళ్లలు, వత్తుల తయారీ ద్వారా రూ.వేలల్లో సంపాదించవచ్చంటూ వీడియోలు పోస్టు చేసేవాడు. ముడి సరకు ఇస్తామని తయారు చేసిన ఉత్పత్తిని తానే కొంటామని నమ్మించాడు.  ఏడాది కాలంలో రమేశ్‌ 842 మందికి వత్తుల తయారీ, 600 మందికి బొట్టు బిళ్లల యంత్రాలు అమ్మాడు. కొన్నివారిలో నాలుగు రాష్ట్రాలకు చెందినవారున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో ధరకు అంటగట్టాడు. కొత్తవారిని చేరిస్తే కమీషన్లు ఇచ్చాడు. తొలి రెండు నెలలు ఒప్పందం ప్రకారం డబ్బు చెల్లించిన రమేశ్‌.. ఆ తర్వాత వాయిదా వేస్తూ వచ్చాడు. కొన్ని రోజులుగా ఉత్పత్తులను తీసుకోవడం నిలిపేయడం, చెల్లింపులు ఆపడంతో కొందరు నిలదీశారు. యంత్రాలు వెనక్కు తీసుకుని డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డబ్బు తర్వాత ఇస్తామంటూ కార్యాలయంలో పనిచేసే సుధాకర్‌, రామారావు సర్దిచెప్పేవారు. ఇలా పలుమార్లు వెళ్లినా లాభం లేకుండా పోయింది. చెల్లింపులు ఆపడంతో అనుమానం వచ్చిన బాధితులు ఆదివారం కార్యాలయానికి వెళ్లగా రమేశ్‌ కనిపించలేదు. దీంతో  ఠాణాలో ఫిర్యాదు చేశారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని