logo

శ్రమజీవులకు వేతనమేదీ!

ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నవారికి ప్రోత్సాహకాలే కాదు సకాలంలో ఇవ్వాల్సిన వేతనాలకూ హామీ లేకుండా పోతుంది.

Published : 30 Nov 2022 02:07 IST

మూడు నెలలుగా నిలిచిన చెల్లింపులు
జిల్లాలో రూ.11 కోట్ల బకాయిలు

వాగులో పూడికతీత పనులు చేస్తున్న ఉపాధి కూలీలు

ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నవారికి ప్రోత్సాహకాలే కాదు సకాలంలో ఇవ్వాల్సిన వేతనాలకూ హామీ లేకుండా పోతుంది. ఈ ఏడాది వేసవి భత్యాన్ని నిలిపేశారు. తద్వారా కొంత మేర కూలి తగ్గింది. మరోవైపు రెండు పూటలా పని చేయిస్తున్నారు. అయినా చేసిన పనికి సంబంధించి సెప్టెంబరు 3వ తేదీ నుంచి డబ్బులు అందక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొందరు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. గ్రామాల్లో ఇప్పటికే రబీ సీజన్‌ ప్రారంభం కావడంతో ఎక్కువ మంది వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. దీంతో కూలీల సంఖ్య తగ్గుముఖం పట్టింది.

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: వారం పాటు ఉపాధిపనులకు వెళ్లిన కూలీల వివరాలతోపాటు, వారు చేసిన పనిని బట్టి తర్వాతి వారంలో బుధవారం లోపు మండల కార్యాలయాల్లో కంప్యూటర్‌ ఆపరేటర్లు అంతర్జాలంలో నమోదు చేస్తారు. వెంటనే కూలీల బ్యాంకు ఖాతాకు డబ్బులు జమ అవుతాయి. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉపాధి పనులకు వెళ్తారు. గత మూడు నెలలుగా సుమారు లక్ష మందికి రూ.11 కోట్ల మేర వేతన బకాయిలు నిలిచిపోయాయి. ఇప్పటికే 12 వారాలు పూర్తి కావడంతో డబ్బులు ఎప్పుడు చేతికి అందుతాయా అని ఎదురు చూస్తున్నారు.

ఇతర పనులు చూసుకుంటూ..

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం వల్ల వలసలు వెళ్లేవారి సంఖ్య కొంత మేర తగ్గింది. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రకాశం జిల్లాలోని వ్యవసాయ కూలీలకు స్థానికంగానే పని దొరికేది. మే నెలలో అత్యధికంగా సుమారు 2.50 లక్షల మంది కూలీలు ఈ పనులకు హాజరయ్యారు. అదే స్థాయిలో జూన్‌, జులై నెలలోనూ చేశారు. జనవరి నెలాఖరు నుంచే వ్యవసాయ సీజన్‌ మందగించనున్న నేపథ్యంలో ఆ తర్వాత ఉపాధి పనులకు మరింత డిమాండ్‌ వస్తోంది. ఏ రంగంలో పనికి వెళ్లినా కూలీలకు వారం చివర్లో డబ్బులు ఇస్తారు. అదే ఉపాధి పనులకు వెళ్తే మాత్రం సకాలంలో ఇవ్వకపోవడం, అదీ తక్కువగానే రావడం కారణంగా ఎక్కువ శాతం ప్రత్యామ్నాయంగా ఇతర పనులకు వెళ్తున్నారు. ప్రస్తుతం 11,800 మంది కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. మరో రెండు నెలల్లో పనులు ముమ్మరంగా జరగనున్నాయి. కూలీల సంఖ్య తగ్గితే ఆ ప్రభావం గ్రామాల్లోని మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధుల పనులపై పడుతుంది. వారికి వేతనాల చెల్లింపు ఆధారంగా 60:40 కింద మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులు వస్తాయి. వాటి లభ్యతను బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిహామీ అనుసంధానం కింద గ్రామాల్లో సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్‌వాడీ, ఆరోగ్య క్లినిక్‌ల నిర్మాణ పనులు చేపడుతోంది.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు