logo

పునరావాస కాలనీల్లో నాసిరకం పనులపై నిరసన

పునరావాస కాలనీలో నాసిరకం పనులను తక్షణమే నిలుపుదల చేయాలని నిర్వాసితులు కలెక్టర్‌ కారు ఎదుట ధర్నా నిర్వహించారు.

Published : 30 Nov 2022 02:07 IST

కలెక్టర్‌ కారు ఎదుట ధర్నా చేస్తున్న వెలిగొండ నిర్వాసితులు

మార్కాపురం, న్యూస్‌టుడే:  పునరావాస కాలనీలో నాసిరకం పనులను తక్షణమే నిలుపుదల చేయాలని నిర్వాసితులు కలెక్టర్‌ కారు ఎదుట ధర్నా నిర్వహించారు. స్థానిక ఉప కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం జరిగిన పరివర్తన 2.0 కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌కు వెలిగొండ నిర్వాసితుల సంఘం కన్వీనర్‌ గాలి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వాసితుల సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు.  అనంతరం కలెక్టర్‌ కార్యక్రమం ముగించుకొని వెళ్తున్న సందర్భంగా కారు ఎదుట నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. గొట్టిపడియ పునరావాస కేంద్రంలో జరుగుతున్న నాసిరకం పనులను నిలుపుదల చేయాలని, చెల్లించిన బిల్లులను తక్షణమే రికవరీ చేయాలని నినాదాలు చేశారు. పనుల్లో రూ.6 కోట్ల వరకు అవినీతి జరిగిందని, అధికారులు గుత్తేదారులతో కలిసి కుమ్మక్కయిన ఈఈని తక్షణమే సస్పెండ్‌ చేయలన్నారు. వెలిగొండ ప్రాజెక్టులో బాగంగా గతంలో నిర్మాణం చేసిన సుంకేసుల కాలనీ, ప్రస్తుతం పనులు జరుగుతున్న  గుండంచెర్ల కాలనీలో పనుల నాణ్యతపై కూడా పరిశీలన చేపట్టాలన్నారు. నాసిరకం పనులు చేసి ఉంటే తక్షణం వాటిని నిలుపుదల చేయాలన్నారు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు వేల్పుల చెన్నారెడ్డి, బుర్రి చిన్న వెంకటేశ్వర్లు, రాచకొండ శ్రీనివాసులు, తుమ్మా వెంకటేశ్వరరెడ్డి, ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, జి.రాజశేఖర్‌రెడ్డి, కె.డేవిడ్‌, నిర్వాసితులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని