logo

భగ్గుమన్న ఉపాధ్యాయులు

ఉపాధ్యాయుల సమస్యలపై బుధవారం విజయవాడలో ధర్నా చేయడానికి వెళ్లిన వారిని అరెస్టులు చేసి, కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహించారు.

Published : 01 Dec 2022 03:06 IST

అక్రమ అరెస్టులను నిరసిస్తూ దీక్షలు

కలెక్టరేట్‌ వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహిస్తున్న యూటీఎఫ్‌ నేతలు

ఒంగోలు నగరం, ఒంగోలు గ్రామీణం, కనిగిరి, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల సమస్యలపై బుధవారం విజయవాడలో ధర్నా చేయడానికి వెళ్లిన వారిని అరెస్టులు చేసి, కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహించారు. యూటీఎఫ్‌ జిల్లా కోశాధికారి కె.లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిలర్‌ డి.వీరాంజనేయులు నేతృత్వంలో కలెక్టరేట్‌ వరకు నినాదాలు చేస్తూ ప్రదర్శనగా వచ్చారు. సాయంత్రం 6.30 నుంచి కలెక్టరేట్‌ ఎదుట జాగరణ దీక్ష చేపట్టారు. ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించే నియంతృత్వ చర్యలను ఖండించారు. ప్రభుత్వ అణచివేత ధోరణికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని తాలూకా కేంద్రాల్లో నిరసన చేపట్టామన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, మెడికల్‌ రీఇంబర్స్‌మెంట్‌కు సంబంధించిన బకాయిలు దీర్ఘకాలంగా ఇవ్వలేదన్నారు. ఉద్యోగులు దాచుకున్న పొదుపు మొత్తాలను అవసరాలకోసం ఇవ్వకుండా మానసిక వేదనకు గురిచేస్తున్నారన్నారు. యూటీఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడలో ధర్నాకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించి ఈ రోజు అడ్డుకోవడం హేయమైన చర్యన్నారు. సంఘ నాయకులు వై.వెంకట్రావు, కె.ఆదినారాయణ, జి.శేషయ్య, కె.హనుమంతరావు, హరిబాబు, ప్రసాద్‌, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

కనిగిరి పీవీఆర్‌ పార్కు ఎదుట బుధవారం రాత్రి నిరసన

జాగరణ చేస్తున్నయూటీఎఫ్‌ నాయకులు

కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో యూటీఎఫ్‌ నాయకుల గృహాలకు మంగళవారం అర్ధరాత్రి పోలీసులు వెళ్లారు. విజయవాడకు వెళ్లకూడదని, ధర్నాలో పాల్గొనకూడదని నోటీసులిచ్చి దాదాపు 120 మందిని గృహ నిర్బంధం చేశారు. సీఎస్‌పురం నుంచి విజయవాడ ధర్నాకు వెళ్లిన పలువురు యూటీఎఫ్‌ ప్రతినిధులను అక్కడి పోలీసులు అరెస్టుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని