ఇద్దరు మిత్రుల విషాదాంతం

వారిద్దరిదీ విడదీయరాని స్నేహ బంధం. చిన్నప్పటి నుంచి ఎక్కడికైనా కలిసే వెళ్లేవారు. దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలన్నది వారి లక్ష్యం.

Updated : 02 Dec 2022 06:10 IST

ఈతకు వెళ్లి జవాన్ల మృత్యువాత
కన్నీరుమున్నీరైన పూసలపాడు

రామచంద్రారెడ్డి, శివకోటేశ్వరరెడ్డి (పాత చిత్రాలు)

కంభం, న్యూస్‌టుడే : వారిద్దరిదీ విడదీయరాని స్నేహ బంధం. చిన్నప్పటి నుంచి ఎక్కడికైనా కలిసే వెళ్లేవారు. దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలన్నది వారి లక్ష్యం. ఇంటర్మీడియేట్‌ పూర్తిచేసిన వెంటనే ఆర్మీకి ఎంపికయ్యారు. వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఒకేసారి సెలవు పెట్టి స్వస్థలానికి వస్తుంటారు. ఈదఫా కూడా అలానే చేశారు. వచ్చే వారం విధులకు తిరిగి పయనం కావాల్సి ఉండగా విధికి కన్నుకుట్టింది. సరదాగా ఈతకు దిగిన ఇద్దరూ మునిగిపోయి మృత్యువాతపడ్డారు. ఈ విషాద సంఘటన బేస్తవారపేట మండలం పూసలపాడులో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థుల కథనం మేరకు..
పూసలపాడు గ్రామానికి చెందిన కర్నాటి రామచంద్రారెడ్డి (26), మోర్తాల శివకోటేశ్వరరెడ్డి (27)లు 2018లో ఆర్మీకి ఎంపికయ్యారు. వీరిలో రామచంద్రారెడ్డి సిక్కింలోను, శివ డిస్పూర్‌(అసోం)లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇద్దరికీ వివాహాలు కాలేదు. గత నెల రెండోవారంలో సెలవులపై గ్రామానికి వచ్చారు. బుధవారం సాయంత్రం సరదాగా ఈత కొట్టేందుకు గ్రామానికి సమీపంలోని వెలిగొండ పునరావాస కాలనీ వద్ద ఉన్న నీటి కుంట వద్దకు వెళ్లారు. లోపలికి దిగిన ఇద్దరూ లోతు ఎక్కువగా ఉండడంతో ఊపిరాడక మునిగిపోయారు. రాత్రయినా ఇళ్లకు చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్‌ చేశారు. స్పందన లేకపోవడంతో పలు ప్రాంతాల్లో వెతికారు. గురువారం ఉదయం కుంట వద్ద వారి దుస్తులు, చరవాణులు కనిపించాయి. తొలుత రామచంద్రారెడ్డి మృతదేహం కనిపించింది. అగ్నిమాపక సిబ్బంది సహకారంతో గాలించి మధ్యాహ్నం శివకోటేశ్వరెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. తహసీల్దార్‌ శాంతి పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్సై మాధవరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేశారు.  

కొద్దిరోజుల్లో విధుల్లో చేరాల్సి ఉండగా..

శివకోటేశ్వరరావు నాయనమ్మ ఇటీవల మృతిచెందారు. ఈనెల 13న ఆయన విధుల్లో చేరాల్సి ఉంది. రామచంద్రారెడ్డి తన స్నేహితుడి కంటే ముందు 8వ తేదీనే బయలుదేరాల్సి ఉంది. ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగింది. ఇక వీరిరువురివీ వ్యవసాయ కుటుంబాలే. రామచంద్రారెడ్డి తల్లి గతంలోనే మృతిచెందారు. తండ్రి వెంకటరెడ్డి, ముగ్గురు సోదరులు, సోదరి ఉన్నారు. అందరికంటే ఇతనే చిన్నవాడని బంధువులు తెలిపారు. శివ కోటేశ్వరరెడ్డికి తల్లిదండ్రులు రాములమ్మ, చిన్నపుల్లారెడ్డి, సోదరుడు ఉన్నారు. చేతికి అందివచ్చిన తమ పిల్లల మృతితో వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

విలపిస్తున్న శివకోటేశ్వరరెడ్డి తల్లి, గ్రామస్థులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని