logo

దిల్లీలో ఏం జరుగుతోంది..!

‘అమిత్‌ అరోడా ఎవరో నాకు తెలియదు.. ఎప్పుడూ కలవలేదు. దిల్లీ మద్యం వ్యాపారంలో మా పాత్ర లేదు. మా కుటుంబంలో ఎవరూ అందులో లేరు.

Published : 02 Dec 2022 03:00 IST

తాజా పరిణామాలపై మాగుంట స్పందన
జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశం

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ‘అమిత్‌ అరోడా ఎవరో నాకు తెలియదు.. ఎప్పుడూ కలవలేదు. దిల్లీ మద్యం వ్యాపారంలో మా పాత్ర లేదు. మా కుటుంబంలో ఎవరూ అందులో లేరు. దక్షిణాది వ్యాపారులపై ఉత్తరాదివారు కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగానే ఇదంతా జరుగుతోంది.’

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఛార్జిషీటులో తన పేరు ఉందని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి స్పందన ఇది. ఈ స్కామ్‌ దేశవ్యాప్తంగా గత నాలుగైదు నెలలుగా ప్రకంపనలు సృష్టిసోంది. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ వ్యక్తుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈడీ దర్యాప్తు మొదలైన తర్వాత చెన్నై, నెల్లూరులో మాగుంట కార్యాలయాలు, నివాసాల్లో కూడా బృందాలు తనిఖీలు చేపట్టాయి..ఈ తరుణంలో ఎంపీ తొలిసారిగా సెప్టెంబర్‌ 19న ఒంగోలులోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తనకు, తన కుమారుడు రాఘవరెడ్డికి దిల్లీ మద్యం వ్యాపారంతో ఎటువంటి సంబంధమూ లేదని నాడు స్పష్టం చేశారు. తమది మొదటి నుంచి మద్యం వ్యాపారంలో ఉన్న కుటుంబం కావడంతో ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపడేశారు. పథకం ప్రకారం కుట్రలు చేస్తూ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని అప్పట్లోనే వ్యాఖ్యానించారు. ఈడీ అధికారులు తమ కార్యాలయాలు, నివాసాల్లో నిర్వహించిన తనిఖీల్లో కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నారనే వార్తలు అవాస్తవమని.. తమ వద్ద ఎటువంటి పత్రాలు తీసుకోలేదని పంచనామాలో పేర్కొన్నారని చెప్పారు. అదే సమయంలో రానున్న ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నుంచి తన స్థానంలో కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీచేస్తారని కూడా ప్రకటించారు. మాగుంట సుదీర్ఘ వివరణతో ఈ వ్యవహారం కొంతకాలం సద్దుమణిగినట్లు కనిపించింది.

మరోవిడత రంగంలోకి దిగి..

తొలివిడతలో కేవలం తనిఖీలకే పరిమితమైన ఈడీ మలివిడతలో లిక్కర్‌ స్కామ్‌తో సంబంధం ఉన్న పలువురిని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఎంపీ మాగుంట తనయుడు రాఘవరెడ్డిని తన కార్యాలయానికి పిలిపించుకుని విచారించడం కలకలం రేపింది. ఇటీవల రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడైన శరత్‌ చంద్రారెడ్డి అరెస్టు తర్వాత ఈ కేసు దర్యాప్తు మరింత ఊపందుకుంది. స్కామ్‌లో కీలకపాత్ర పోషించిన అమిత్‌ అరోడాను అరెస్టు చేసి ప్రశ్నించిన ఈడీ అతనిచ్చిన వాంగ్మూలంలో భాగంగా ఎంపీ పేరును ప్రస్తావించడం తాజాగా చర్చనీయాంశమైంది. దక్షిణాది వ్యాపారులు ఉత్తరాది వైపు విస్తరించకుండా ఒక కుట్ర జరుగుతోందని, దానిలో భాగంగానే తమపై తప్పుడు అభియోగాలు మోపుతున్నారని ఎంపీ మాగుంట వాదన. తమ బృందం అన్ని అంశాలు పరిశీలిస్తుందని.. త్వరలో ఒంగోలులో తాను అన్ని వివరాలు వెల్లడిస్తానని ఎంపీ గురువారం పేర్కొన్నారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని