logo

విద్యుదాఘాతంతో రైతు మృతి

వరి చేలో ఎరువు చల్లి నీరు పెట్టే సమయంలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందారు.

Published : 02 Dec 2022 03:00 IST

చీమకుర్తి, న్యూస్‌టుడే: వరి చేలో ఎరువు చల్లి నీరు పెట్టే సమయంలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందారు. ఈ విషాద సంఘటన చీమకుర్తి మండలం మైలవరంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై వి.ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు.. మైలవరం గ్రామానికి చెందిన మద్దారపు వెంకట్రావు(45) అనే రైతు పొలంలో వరి సాగు చేశారు. చేనుకు యూరియా చల్లేందుకు సాయంత్రం సమయంలో పొలం వద్దకు వెళ్లారు. అనంతరం నీరు పెట్టేందుకు బోరు వేస్తున్న సమయంలో ఆధారం కోసం విద్యుత్తు స్తంభానికి ఏర్పాటు చేసిన తీగను తాకారు. దీంతో విద్యుదాఘాతానికి గురై వెంకట్రావు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. విషయాన్ని గుర్తించిన పరిసర ప్రాంత రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పంట పొలంలో విగతజీవిగా పడి ఉన్న వెంకట్రావును చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆయన కుమారుడు మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొని..

కొమరోలు గ్రామీణం, న్యూస్‌టుడే : ద్విచక్రవాహనం, ఆర్టీసీ బస్సు ఢీ కొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన తాటిచెర్ల మోటు వద్ద చోటు చేసుకుంది. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం మార్కాపురానికి చెందిన మునగాల బలరాం (40) ఫర్నిచర్‌ వస్తువులు కంతుల వారీగా ఇచ్చి వాటిని తిరిగి వసూలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో దోర్నాల నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో గురువారం వస్తున్నారు. కర్నూలు నుంచి కనిగిరికి వెళుతున్న ఆర్టీసీ బస్సు తాటిచెర్ల వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో బలరాం అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న గిద్దలూరు సీఐ ఫిరోజ్‌, కొమరోలు ఎస్సై సుబ్బరాజులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని