logo

టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ఇవ్వాలి

టిడ్కో ఇళ్లను తక్షణమే పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

Published : 03 Dec 2022 05:04 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

చింతల వద్ద ఇళ్లను సందర్శించి వస్తున్న రామకృష్ణ,
నాయకులు జగదీష్‌, ఎం.ఎల్‌.నారాయణ, వెంకటరావు తదితరులు

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు; న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం: టిడ్కో ఇళ్లను తక్షణమే పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. కొత్తపట్నం మండలం చింతల సమీపంలో అసంపూర్తిగా ఉన్న గృహాలను శుక్రవారం ఆయన, సీపీఐ నాయకులు పరిశీలించారు. ఇప్పటికే తుప్పు పట్టి, ఇళ్ల చుట్టూ నీరు చేరి శిథిలావస్థకు చేరుతున్నాయన్నారు. ఈ ఇళ్లను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మించారనే ఒక్క కారణంతోనే లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా జగన్‌ ఇబ్బంది పెడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. జగనన్న కాలనీల్లో ఒక్కో ఇంటికి ప్రస్తుతం ఇస్తున్న రూ.1.80 లక్షలు ఏ మాత్రం సరిపోవడం లేదని.. తక్షణమే రూ.5 లక్షలతోపాటు, సిమెంటు, ఇసుక, ఇనుము ఉచితంగా లబ్ధిదారులకు ఇవ్వాలన్నారు.

‘జగన్‌ సిగ్గుతో తల దించుకోవాలి’

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసును తెలంగాణకు బదిలీ చేయడమనేది ముఖ్యమంత్రి జగన్‌ సిగ్గుతో తలదించుకోవాల్సి విషయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ కేసు దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని, సీబీఐ విఫలమైందని ఆరోపించారు. వివేకానందను ఎవరు హతమార్చారనే విషయాన్ని అడిగితే పులివెందులలో చిన్న పిల్లవాడు కూడా జవాబు చెబుతారన్నారు. ప్రత్యర్థి పార్టీలను ఇబ్బంది పెట్టేందుకే కేంద్రంలోని భాజపా ప్రభుత్వం దిల్లీ మద్యం కుంభకోణాన్ని తెర పైకి తెచ్చిందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.జగదీష్‌, జిల్లా కార్యదర్శి ఎం.ఎల్‌.నారాయణ, పార్టీ నాయకులు ఆర్‌.వెంకటరావు, పీవీఆర్‌ చౌదరి, ఆర్‌.రామకృష్ణ, ఉప్పుటూరి ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని