logo

శత మర్కటం... ప్రాణ సంకటం

కోతుల దాడులతో ప్రజలు, రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్లలోకి దూరి వస్తువులు ఎత్తుకెళ్లడం, ఒంటరిగా ఉన్న వారిపై దాడులు చేయడంతో ఇప్పటికే పలువురు ప్రాణాలు సైతం కోల్పోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.

Updated : 03 Dec 2022 05:43 IST

- ఈనాడు, ఒంగోలు, పీసీపల్లి, న్యూస్‌టుడే: కోతుల దాడులతో ప్రజలు, రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్లలోకి దూరి వస్తువులు ఎత్తుకెళ్లడం, ఒంటరిగా ఉన్న వారిపై దాడులు చేయడంతో ఇప్పటికే పలువురు ప్రాణాలు సైతం కోల్పోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. వాటికి భయపడి పరుగులు తీసిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్సలు సైతం చేయించుకున్నారు. ఇవే కాకుండా పంటలను ధ్వంసం చేస్తున్నాయి. వాటి బెడద తట్టుకోలేక కొందరు రైతులు పంటలు సాగు చేయడమే మానుకున్నారు. పీసీపల్లి మండలంలోని మురుగమ్మి, పీసీపల్లి, చింతగుంపల్లి, గుంటుపల్లి, లక్ష్మక్కపల్లి, మారెళ్ల పంచాయతీలోని సుమారు 20కి పైగా గ్రామాల్లో అధికంగా కోతులున్నాయి. ఆ ప్రాంతాల్లో రైతులు సాగుచేసిన బత్తాయి, మామిడి, వరి, దానిమ్మ, మిరప, పత్తి, కూరగాయలు, మినుము ఇలా చాలా రకాల పంటలను పాడు చేస్తున్నాయి.

ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు...: * పీసీపల్లి మండలంలోని మురుగమ్మిలో రెండు రోజుల కిత్రం ఆరుబయట మంచంపై ఉన్న మూడు నెలల చిన్నారిని ఓ కోతి ఎత్తుకెళ్లే క్రమంలో ఇనుప సామగ్రిపై జారవిడిచింది. బిడ్డ ప్రాణాలు కోల్పోయింది.

* ఈ ఏడాది నవంబర్‌లో హనుమంతునిపాడు మండలం మూరవారిపల్లిలో ఉడుముల తిరుపతమ్మ అనే మహిళ డాబాపై పూలు కోసేందుకు వెళ్లారు. ఆ సమయంలో కోతుల గుంపు ఒక్కసారిగా ఆమె మీదకు ఎగబడటంతో భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో మెట్ల పైనుంచి జారిపడటంతో వెన్నుముక దెబ్బతిని మంచానికే పరిమితమయ్యారు.

* మార్కాపురంలో సుమారు ఆరు నెలల క్రితం ఓ బేల్దారీ మేస్త్రీ కూలి పని కోసం వచ్చి మూడంస్తులపైన పని చేస్తున్నారు. అక్కడికి కోతులు రావడంతో భయంతో పక్కకు వెళ్లేందుకు ప్రయత్నించి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘటనలో జిల్లా వ్యాప్తంగా మరికొన్ని చోటుచేసుకున్నాయి.


భయం..భయం

యర్రగొండపాలెం కొలుకుల రోడ్డులోని వీధిలో నిత్యం పది వానరాలు అటువైపుగా వచ్చే వాహనదారులు, పాదచారులపై దాడి చేస్తున్నాయి. ఓ వృద్ధుడు నడిచి వస్తుండగా అతడి కాలిని ఓ వానరం చుట్టి గాయపరిచింది. ఈ పరిణామానికి భయపడ్డ ఆయన కాలిని గట్టిగా వెనక్కు తీసుకుని వేగంగా ముందుకు వెళ్లిపోయారు.


ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి...

మా మండలంలో అనేక గ్రామాల్లో కోతులు సంచారం ఎక్కువగా ఉంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులపై అధికంగా దాడులు చేస్తున్నాయి. పంటలను సైతం ధ్వంసం చేస్తున్నాయి. ఒక్కోసారి ఇళ్లలోకి చొరబడి వస్తువులు ఎత్తుకుపోతున్నాయి.

- కాలం రమణయ్య, పెదఇర్లపాడు, పీసీపల్లి మండలం


పనులు మానుకొని కాపలా కాస్తున్నాం

కోతుల బెడదతో నానా అవస్థలు పడుతున్నాం. మా ఊరిలోనే నలుగురు కోతులు కరవడంతో గాయపడ్డారు. వీధుల్లోకి రావాలంటే భయమేస్తోంది. పనులు మానుకుని ఇళ్ల వద్ద కాపలా ఉండాల్సి వస్తోంది. వాటి బెడద తీర్చేందుకు అధికారులు చొరవ చూపాలి.

- బండారు వెంకట నర్సయ్య, మారెళ్ల,  పీసీపల్లి మండలం


గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటాం

మండలంలోని పలు గ్రామాల్లో వానరాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తున్నాయని తెలిసింది. పంచాయతీ అధికారులను ఆదేశాలిచ్చి వాటిని తరిమేందుకు చర్యలు తీసుకుంటాం. కోతుల దాడుల్లో గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందేలా చూస్తాం.

- రమణారెడ్డి, ఇన్‌ఛార్జి ఎంపీడీవో పీసీపల్లి


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని