logo

భూప్రకంపనలు

జిల్లా కేంద్రం ఒంగోలులో కొన్నాళ్లుగా భూదందాలు జరుగుతున్నాయి. రూ.వందల కోట్ల విలువైనవి పరాధీనమయ్యాయి.

Published : 04 Dec 2022 05:23 IST

సీఐడీ కన్నుతో జిల్లా కేంద్రంలో అలజడి

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రం ఒంగోలులో కొన్నాళ్లుగా భూదందాలు జరుగుతున్నాయి. రూ.వందల కోట్ల విలువైనవి పరాధీనమయ్యాయి. వివాదాల్లో ఉన్నవి గుర్తించడం,  హక్కుదారులను భయభ్రాంతులకు గురిచేయడం, జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ(జీపీఏ) తీసుకోవడం.. ఆ తర్వాత అన్ని బలాలను ఉపయోగించి భూములను స్వాధీనం చేసుకోవడం వంటివి చకచకా జరుగుతున్నాయి. దురాక్రమణలను ఎదిరించలేక, స్వార్జితమైన భూములు అన్యాక్రాంతమవుతుంటే ఇదేం అన్యాయమని ప్రశ్నించలేక విలవిల్లాడిన బాధితులెందరో. రాజకీయ, రెవెన్యూ, పోలీసు వ్యవస్థలను ఆశ్రయించినా ఫలితం శూన్యం.. ఎట్టకేలకు ఓ న్యాయవాది ఫిర్యాదుపై నేర పరిశోధన విభాగం (సీఐడీ) దృష్టి సారించింది. ఒంగోలులో వివాదాస్పద భూ ఆక్రమణలకు సంబంధించి వివరాలు కోరింది. ఈ నెల 9వ తేదీ లోగా అన్ని అంశాలతో తమ ఎదుట హాజరుకావాలని ఒంగోలు తహసీల్దారుకు సీఐడీ డీఎస్పీ(నెల్లూరు) కె.వేణుగోపాల్‌ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.

ఖాళీ జాగా కనిపిస్తే చాలు..

రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి రాగానే ఒంగోలులో అక్రమార్కులు బరితెగించారు. నకిలీ జీపీఏలు సృష్టించి భూములను ఆక్రమించారు. స్థానిక మంగమ్మ కళాశాల సమీపంలో 2.90 ఎకరాలపై కన్నేశారు. కడపకు చెందిన వ్యక్తులు సైతం ఇందులో ప్రవేశించారు. కొందరు పోలీసులు వీరికి సహకారం అందించారు. హక్కుదారులను భయభ్రాంతులకు గురిచేసి కోట్ల విలువైన భూమిని కారుచౌకగా కొట్టేశారు. మంగమూరు రోడ్డులో సాగర్‌ కాలువ సమీపంలోని 6.30 ఎకరాల భూమిదీ అదే కథ.. స్థానిక మర్రిచెట్టు సమీపంలో ఉన్న దీనిపై నాయకుల కళ్లుపడ్డాయి. ఓ సామాజిక వర్గానికి చెందిన యజమానులను బెదిరించారు. వ్యవహారం న్యాయస్థానంలో ఉండగానే రెవెన్యూ అధికారులను ప్రలోభాలకు గురిచేసి రాత్రికిరాత్రే కందుకూరు(ప్రస్తుతం నెల్లూరు జిల్లా)లో రిజిస్ట్రేషన్‌ చేసేశారు. వీరిలో జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి సోదరి పేరు ఉన్నట్లు తెలిసింది. ఆమె పేరిట మూడెకరాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు సమాచారం. ఆ వివరాలను సైతం సీఐడీ తన నోటీసుల్లో పేర్కొంది. భూ దందాల్లో అధికార పార్టీ కీలక నేత, ఆయన తనయుడితో పాటు నగరానికి చెందిన నాయకుల ప్రమేయంపై విమర్శలు ఉన్నాయి. నాడు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న ఒక తహసీల్దార్‌ అప్పట్లో పెట్టిన వాట్సాప్‌ స్టేటస్‌ ప్రకంపనలు సృష్టించింది. తాజాగా ముఖ్య నేత చేపట్టిన ఓ స్థిరాస్తి ప్రాజెక్టులోనూ ప్రభుత్వ భూములున్నాయనే అరోపణలు ఉన్నాయి. ఓ ఎంపీపీ భర్తదీ అదే తీరు. రాష్ట్రంలోని ఓ సలహాదారుకు అత్యంత సన్నిహితుడైన ఆయన ఒంగోలు సమీప ప్రాంతాల్లో వివాదాస్పద భూములపై కన్నేసి ఇప్పటికే ఆక్రమించేశాడు.

ఆ రిజిస్ట్రేషన్ల వివరాలు కోరుతూ..

న్యాయవాది నుంచి తమకందిన ఫిర్యాదుమేరకు ఒంగోలులోని సర్వే నంబర్లు 138, 264, 267, 138/1, 138-1బీ1, 138-1బీ2, 138-1బీ3, 138-1బీ4, 138/2, 138/3, 264పీ, 264పీ1లో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల వివరాలు కోరుతూ తహసీల్దార్‌కు సీఐడీ నుంచి నోటీసులు వచ్చాయి. అనర్హులకు పట్టాలు మంజూరుచేశారంటూ గతంలో పనిచేసిన జిల్లా పాలనాధికారి, నలుగురు తహసీల్దార్ల పేర్లను కూడా ఫిర్యాదీదారు పేర్కొన్నారని సీఐడీ డీఎస్పీ పేర్కొన్నారు. ఈ ఉదంతంలో తాము ఇప్పటికే ఒంగోలుకు చెందిన ఒక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్‌ఓ)ని విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేశామన్నారు. వీరిద్దరూ తమ స్టేట్‌మెంట్లో యజమాని పేరేమిటో లేకుండానే ఖాతా నెం: 9099.. తేదీ 17.08.2021న 0.02 సెంట్ల భూమిని కేటాయించినట్లు అంగీకరించారు. ఆ భూమికి మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసిందెవరో తెలపాలని తాజాగా కోరారు. మొత్తంమీద భూదందాలకు సంబంధించి పేర్కొన్న సర్వే నంబర్లు, వాటి రిజిస్ట్రేషన్లు, పట్టా పాసు పుస్తకాలు తదితర వివరాలతో నెల్లూరులోని సీఐడీ కార్యాలయానికి రెవెన్యూ అధికారిని రప్పిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అంతటా ఇదే చర్చ నడుస్తోంది.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు