logo

ఇదేం సర్దుబాటు!

జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటుకు అనుసరిస్తున్న విధానాలపై వారంతా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నిబంధనలు పాటించకుండా సుదూర ప్రాంతాలకు వెళ్లమనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Updated : 04 Dec 2022 05:36 IST

దూర ప్రాంతాలకు ఎలా వెళ్లాలంటున్నఉపాధ్యాయులు

జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటుకు అనుసరిస్తున్న విధానాలపై వారంతా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నిబంధనలు పాటించకుండా సుదూర ప్రాంతాలకు వెళ్లమనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పదోతరగతి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా సబ్జెక్టు టీచర్‌ ఒక్కరూ లేని పాఠశాలకు సమీపంలో అదనంగా ఉన్నచోట నుంచి టీచర్లను నియమించాలని విద్యాశాఖ కమిషనర్‌ ఇటీవల ఆదేశాలిచ్చారు. దీనికి కొన్ని సవరణలు చేస్తూ తాజా ఉత్తర్వులిచ్చారు. ఆ ప్రకారం 3,4,5 తరగతులు విలీనం చేసిన ఉన్నత పాఠశాలల్లో కూడా సబ్జెక్టు టీచర్లను నియమించాలని, మండలస్థాయిలో ఎస్‌జీటీల సర్దుబాటు కూడా చేపట్టాలని నిర్ణయించారు. ఏ మండలంలో ఉన్నవారిని అక్కడే సర్దుబాటు చేయాలని.. లభ్యం కాని పక్షంలో డివిజన్‌ స్థాయిలో ఎక్కడ అవసరమైతే అక్కడ నియమించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. గత రెండురోజులుగా డీఈవో కార్యాలయంలో కసరత్తు పూర్తిచేసి జాబితా తయారు చేశారు. ఆ సమాచారం తెలిసి కొందరు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆ మండలంలో లేకపోతే సమీపంలో నియమించాలని.. అలా కాకుండా మూడు, నాలుగు మండలాలు అవతల దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో డిఫ్యూటేషన్‌ వేస్తే ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు.

యూనియన్ల అభ్యంతరం

ఉపాధ్యాయుల డిఫ్యూటేషన్లు రద్దు చేయాలని, పదోన్నతులు పొందిన వారికి స్థానాలు కేటాయించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కె.శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరారెడ్డి, రవి డిమాండ్‌ చేశారు. సర్దుబాటు అక్కడికక్కడ కాకుండా సీఎస్‌పురం వారిని పుల్లలచెరువు, పామూరు నుంచి త్రిపురాంతకంలో నియమిస్తున్నారన్నారు.  పదోన్నతులకు ఆమోదం తీసుకొని పోస్టుల్లో నియమించకుండా డిఫ్యూటేషన్లు వేయడం ఏమిటని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వి.జనార్ధన్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి డి.శ్రీనివాసులు ప్రశ్నించారు. సీఎస్‌పురం నుంచి దొనకొండ మండలానికి వేయడం సరికాదన్నారు. సర్దుబాటు పేరుతో సీనియారిటీ పాటించకుండా ఇష్టారీతిన డిఫ్యూటేషన్లు వేయడాన్ని ఎస్టీయూ అసోసియేట్‌ అధ్యక్షులు గవిని శివశంకర్‌ ఖండించారు. బదిలీలు వెంటనే చేపట్టాలని కోరారు.

ఇంకా ఉత్తర్వులు ఇవ్వలేదు

డిఫ్యూటేషన్లపై ప్రాథమిక జాబితా తయారు చేశాం. ఇంకా ఎవరికీ ఉత్తర్వులు ఇవ్వలేదు. ఆదివారం ఉప విద్యాశాఖ అధికారులతో చర్చించి ఉపాధ్యాయులు పనిచేస్తున్న పాఠశాలలకు సమీపంలోనే వేయడానికి చర్యలు తీసుకుంటాం.

బి.విజయభాస్కర్‌, డీఈవో

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు