logo

ప్చ్‌.. సగమూ నిండని డిగ్రీ సీట్లు

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది డిగ్రీ కోర్సులో ప్రవేశాలు గణనీయంగా పడిపోయాయి. రెండు కౌన్సెలింగ్‌ ప్రక్రియలు పూర్తయినప్పటికీ బీకాం కంప్యూటర్‌ కోర్సులో మాత్రమే వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి.

Published : 05 Dec 2022 02:14 IST

ఇంజినీరింగ్‌ కోసం పొరుగుకు వలస
70 శాతం విద్యార్థుల ప్రైవేట్‌ బాట

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది డిగ్రీ కోర్సులో ప్రవేశాలు గణనీయంగా పడిపోయాయి. రెండు కౌన్సెలింగ్‌ ప్రక్రియలు పూర్తయినప్పటికీ బీకాం కంప్యూటర్‌ కోర్సులో మాత్రమే వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన అన్నింటిలోనూ సగం వరకు మిగిలిపోయాయి. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతా శాతం పడిపోవడం, డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ నెల రోజులు ఆలస్యంగా ప్రారంభం కావడం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. కరోనా తర్వాత ఈ విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు పూర్తిస్థాయిలో నిర్వహించారు. జిల్లాలో మొత్తం 42 వేల మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 66 శాతం ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీ పరీక్షల్లో 33 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ ప్రభావం డిగ్రీ ప్రవేశాలపై పడింది. కాస్త ప్రతిభ ఉన్నవారు, ఆర్థికస్తోమత కలిగిన వారు ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో ఇంజినీరింగ్‌ కోర్సులు అభ్యసించేందుకు వెళ్లారు. మిగిలిన వారిలో 70 శాతం మంది ప్రైవేట్‌ కళాశాలల బాట పట్టారు. గ్రామీణ పేద విద్యార్థులు కొందరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పొందారు.

* విద్యార్థులు లేని కోర్సుల రద్దు...: ప్రభుత్వ కళాశాలలో ఉన్న సీట్లలో 15 శాతం కన్నా తక్కువ ప్రవేశాలున్న కోర్సులను రద్దు చేయాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పది ప్రభుత్వ, రెండు ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలున్నాయి. ఒక్కో కళాశాలలో 84 నుంచి గరిష్ఠంగా 390 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం పది ప్రభుత్వ కళాశాలల్లో అన్ని కోర్సులు కలిపి 2054 సీట్లుండగా, 804 మాత్రమే భర్తీ అయ్యాయి.

* ఒంగోలు నగరంలోని డీఎస్‌ ప్రభుత్వ మహిళా కళాశాలలో రసాయన శాస్త్రం, కంప్యూటర్స్‌ పాఠ్యాంశాలుగా ఉన్న కోర్సుకు 30 సీట్లు ఉండగా ఒక్కరూ చేరలేదు.

* కందుకూరులో చరిత్ర, ఆర్థికశాస్త్రం, ప్రత్యేక తెలుగు బ్రాంచిలో 30 సీట్లకు గాను 8 మంది చేరారు.

* దర్శి, యర్రగొండపాలెం కళాశాలల్లో ఎంపీసీలో 15 శాతంలోపే చేరారు. వీటిల్లో చేరిన కొద్దిమందిని ఇతర బ్రాంచిలకు మార్చి.. వీటిని రద్దు చేయనున్నట్టు సమాచారం. దీనివల్ల విద్యార్థులు కోరుకున్న కోర్సు చదవలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం అందిస్తున్న విద్యాదీవెన ఉపకార వేతనాలకు సంబంధించిన నగదు సంవత్సరంలో నాలుగుసార్లు ఇవ్వాల్సి ఉండగా గత ఏడాది నాలుగో విడత జమ కాలేదని విద్యార్థులు చెబుతున్నారు.

* విద్యాదీవెన, వసతి దీవెన డబ్బులు సక్రమంగా జమకాకపోవడంతో ప్రభుత్వ కళాశాలల్లో చదివే పేద విద్యార్థులు ఇబ్బందులెదుర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని