logo

వేతనాలు లేక.. భద్రత కానరాక

ఓ వైపు వాహనాల నిర్వహణను ప్రభుత్వం, యాజమాన్యం పట్టించుకోవడం లేదు.. మరోవైపు ఏళ్లతరబడి తమ సమస్యలూ పరిష్కరించకపోవడంతో 108 సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కొద్దిరోజులుగా దీక్షలు చేస్తున్నారు.

Published : 24 Jan 2023 03:05 IST

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు


ఉద్యోగుల రిలే నిరాహార దీక్షనుద్దేశించి మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.సుబ్బారావు

ఓ వైపు వాహనాల నిర్వహణను ప్రభుత్వం, యాజమాన్యం పట్టించుకోవడం లేదు.. మరోవైపు ఏళ్లతరబడి తమ సమస్యలూ పరిష్కరించకపోవడంతో 108 సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కొద్దిరోజులుగా దీక్షలు చేస్తున్నారు.

జిల్లాలో 39 వరకు 108 వాహనాలు ఉండగా 250 మంది సిబ్బంది ఉన్నారు. పది వాహనాలు మరమ్మతులతో ఉన్నాయి. దాదాపు అన్నింటికీ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, బీమా కాలపరిమితి ముగిసింది. వాటిని పునరుద్ధరించలేదు. కొన్ని వాహనాల్లో అత్యవసర ఇంజక్షన్లు, సిరంజిలు, బ్యాండేజిలు, గ్లవుజులు, మాస్కులు వంటి సామగ్రి లేవు. కొన్ని వాహనాలు 80 వేల నుంచి లక్ష కిలోమీటర్లు తిరిగినవి ఉన్నాయి. కేఎంపీఎల్‌ పేరుతో 60 కి.మీ కంటే ఎక్కువ వేగంగా వెళ్లకూడదని సిబ్బందిపై ఒత్తిడి ఉంది. అంబులెన్సు ఏదైనా అనుకోని ప్రమాదానికి గురైతే దాని ఖర్చును డ్రైవర్‌నే భరించమనడం, లేకుంటే విధులకు దూరం పెట్టడం వంటి ఇబ్బందులకు అధికారులు గురిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీనికితోడు రాష్ట్రవ్యాప్తంగా చిన్నచిన్న కారణాలు చూపి దాదాపు వంద మందిని విధుల నుంచి తొలగించడం, సస్పెండ్‌ చేస్తుండటం వంటి అంశాలతో ఉద్యోగుల్లో అభద్రతా భావం నెలకొంది.

డిసెంబరు నుంచే ఆందోళనబాట: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిసెంబరు 14న ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చారు. అప్పటి నుంచి విధులకు ఆటంకాలు కలగకుండా వివిధ మార్గాల్లో ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించి భద్రత కల్పించాలని రాజమండ్రిలో సీఎం జగన్‌ను కలిసి వినతి అందించారు. అయినా సమస్యలకు పరిష్కారం లభించలేదు. ప్రస్తుతం ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద రిలే నిరాహార దీక్షలను సిబ్బంది నిర్వహిస్తున్నారు. ఉద్యోగ భద్రత కోసం వివిధ రూపాలలో ఆందోళనలు తెలుపుతున్నా చలనం లేదని వాపోయారు. ఈపీఎఫ్‌, పీఎఫ్‌కు సంబంధించి యాజమాన్య కోటా కూడా తమ వేతనం నుంచే కోతవేస్తున్నారని, వాహనాలకు సరైన మరమ్మతులు చేయించడంలేదన్నారు.


కొనసాగిన రిలే నిరాహార దీక్షలు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు, కనీస వేతన చట్టం అమలు కోరుతూ 108 ఒప్పంద ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం భవన్‌ వద్ద సోమవారం కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత వైఖరితో ఉందని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లోనూ 108 సిబ్బందికి వెయిటేజ్‌ ఇచ్చి అవకాశం కల్పించాలన్నారు. సంఘ కార్యనిర్వహక అధ్యక్షుడు సీహెచ్‌.భాస్కర్‌, నాయకులు జి.రత్నకుమారి, ఎం.చిరంజీవి, ఎం.బాలవంశీ, షేక్‌ జిలానీ బాషా తదితరులు పాల్గొన్నారు. తొలుత ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అయ్యప్పరెడ్డి దీక్షలను ప్రారంభించారు.


డిమాండ్లు పరిష్కరించకుంటే మెరుపు సమ్మె

108 సిబ్బందికి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. అందుకే ఆందోళనబాట పట్టాం. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి.  కాంట్రాక్టు ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించాలి. ఏఈఎంఎస్‌ వచ్చాక తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. పీఎఫ్‌, ఈఎస్‌ఐ యాజమాన్యం వాటాలను చెల్లించాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. డిమాండ్లు పరిష్కరించకుంటే మెరుపు సమ్మెకు దిగుతాం. -హరిబాబు, 108 యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు


కదలలేక.. కుయ్యో మొర్రో

సోమవారం మద్యాహ్నం 12.30 గంటల సమయంలో ఒంగోలు చర్చి సెంటర్‌ వద్ద కనిపించిన దృశ్యమిది. మరమ్మతులకు గురైన ఓ 108 వాహనాన్ని బాగుచేయిండం కోసం మరో అంబులెన్సుకు తాడు కట్టి పాత రిమ్స్‌ ప్రాంతానికి ఇలా తీసుకెళ్లారు.

ఈనాడు, ఒంగోలు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని