logo

ప్రజల ఆరోగ్యానికి శాపాలు

ధనార్జనే లక్ష్యంగా కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రతీ వస్తువు కల్తీ చేస్తున్నారు. చివరకు చిన్నారుల నుంచి పెద్దల వరకు నిత్యం వినియోగించే పాలనూ వదలడంలేదు. కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.  

Updated : 24 Jan 2023 10:44 IST

వెలుగుచూస్తున్న కల్తీ దందా
కనిగిరి, దర్శి ప్రాంతాల్లో తయారీ కేంద్రాలు
న్యూస్‌టుడే, కనిగిరి, దర్శి

దర్శిలో కల్తీ పాల తయారీకి వినియోగించే సరంజామా

ధనార్జనే లక్ష్యంగా కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రతీ వస్తువు కల్తీ చేస్తున్నారు. చివరకు చిన్నారుల నుంచి పెద్దల వరకు నిత్యం వినియోగించే పాలనూ వదలడంలేదు. కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.  

శుపోషణ వ్యయప్రయాసలతో కూడుకున్నది. కంటిపాపల్లా మూగజీవాలను సంరక్షించుకోవడంతోపాటు నిత్యం వాటి మేతకు గ్రాసం, తవుడు, వివిధ పోషక పదార్థాలు వినియోగించాల్సి ఉంటుంది. సేకరించిన పాలకు లీటరు రూ.60 వరకు ధర పలుకుతుంది. ఈ శ్రమంతా ఎందుకని కొందరు అక్రమార్కులు కుటీర పరిశ్రమ మాదిరి కల్తీ పాల తయారీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. తక్కువ ధరకు లభించే ఓ కంపెనీ నూనె, యూరియా, లిక్విడ్‌, నీరు, పాలపొడి, సల్ఫర్‌, ఎముకల పొడి వంటి వస్తువులు ఉపయోగించి పాలు తయారుచేస్తున్నారు. లీటరుకు ఖర్చు రూ.20 మాత్రమే అవుతుంది. ఈ కల్తీ పాలను 40 లీటర్ల క్యాన్లలో నింపి దుకాణాలకు విక్రయిస్తున్నారు. లీటరు రూ.50 చొప్పున అమ్మకాలు చేస్తుండటం గమనార్హం.

తయారీలో ఉపయోగించే ఓ రసాయనం

ఒక్కో వ్యాపారి రూ.లక్ష సంపాదన

* కనిగిరి, వెలిగండ్ల, పీసీపల్లి మండలాలకు చెందిన కొందరు వ్యక్తులు కల్తీ పాల దందాలో సూత్రధారులు. అధికార పార్టీ అండతో వెలిగండ్ల మండలంలోని ఓ గ్రామంలో ఆరోగ్యమిత్రగా పనిచేసే వ్యక్తితోపాటు మరికొందరు కలిసి రోజూ 20 క్యాన్ల వరకు తయారుచేస్తున్నారు. వెలిగండ్ల, మాచవరం, విశ్వబ్రాహ్మణ కాలనీ, మొగుళ్లూరు, మల్లంరాజుపల్లి తదితర ప్రాంతాల సమీపంలో ఇలాంటి కేంద్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. అధికారుల నిఘా పెరగడంతో మకాం మార్చి సొంత నివాసాల్లోనే తయారీ కేంద్రాలను ఏర్పాటుచేశారు. రోజూ వెయ్యి లీటర్లకు పైగా కనిగిరి నియోజకవర్గంలోని కొన్ని పాల కేంద్రాలకు..  పలు టీ దుకాణాలకు విక్రయిస్తున్నారు. ఒక్కో తయారీదారు నెలకు రూ.70 వేల నుంచి లక్ష సంపాదిస్తున్నారు.

* దర్శి మండలం లంకోజనపల్లిలో ఓ వ్యక్తి తయారుచేస్తుండటంతో గతంలో అధికారులు వచ్చి హడావిడి చేశారు. సేకరించిన నమూనాల ఫలితాలు ఇంతవరకు వెల్లడించలేదు. సోమవారం దర్శి పట్టణంలోనూ కల్తీ వ్యవహారం వెలుగుచూసింది. పాల పొడి బస్తాలు, పొద్దు తిరుగుడు నూనె ప్యాకెట్లు, ఉప్పుతో పాటు అనేక మిక్సీలు బయటపడ్డాయి. శివరాజ్‌నగర్‌, దొనకొండ మండలం చందవరం, తాళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో ఈ తంతు నడుస్తుందన్న ఫిర్యాదులున్నాయి.

కనిగిరి విశ్వబ్రాహణ కాలనీలో ఓ ఇంటి సమీపంలో కల్తీ పాల తయారీకి వినియోగించే యూరియా, ఇతర పదార్థాలను పడవేసిన వ్యాపారులు


క్యాన్సర్‌, కిడ్నీ వ్యాధులకు ఆస్కారం..
- డా.ఎస్‌.సుబ్బారెడ్డి, మార్కాపురం వైద్యశాల సూపరింటెండెంట్‌

స్వచ్ఛమైన పశువుల పాలు తాగితే అన్ని రకాల విటమిన్లు లభిస్తాయి. అదే కల్తీ పాల వల్ల క్యాన్సర్‌ సోకే ప్రమాదం ఉంది. తయారీకి యూరియా, రసాయనాలు, ఇతర ప్రమాదకర పదార్థాలు కలపడం వల్ల మూత్ర పిండ వ్యాధులు, కాలేయం చెడిపోవడం, ఎముకలు క్షీణించడం వంటివి చోటుచేసుకుంటాయి. అందుకే ఇలాంటి పాలను వినియోగించకూడదు.


పర్యవేక్షణ పెంచి కల్తీని అరికడతాం
నరసింహుడు, ఆహారభద్రతాధికారి

ప్రజలు కల్తీ పాలపై అవగాహన కలిగిఉండాలి. ఎక్కడైనా ఇలాంటివి వెలుగుచూసిన వెంటనే సమాచారం ఇవ్వాలి. స్థానిక పోలీసుల సాయంతో తక్షణం చర్యలు తీసుకుంటాం. అలాగే పర్యవేక్షణ పెంచడం ద్వారా అక్కమార్కులను కట్టడి చేస్తాం.


దర్శిలో కల్తీ పాలకేంద్రం గుట్టురట్టు

సమావేశంలో పాల కల్తీ వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి.. చిత్రంలో సీˆఐ రామకోటయ్య, ఎస్సై రామకృష్ణ..స్వాధీనం చేసుకున్న సామగ్రి

దర్శి, న్యూస్‌టుడే: దర్శి పట్టణంలోని పొదిలి రోడ్డు ఎల్‌ఐసీ కాలనీలో పోలీసులు, ఆహార భద్రతా అధికారులు సంయుక్తంగా కల్తీ పాల తయారీ కేంద్రంపై దాడులు చేశారు. బోయపాటి పూర్ణచంద్రరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి సీఐ రామకోటయ్యతో కలిసి వెల్లడించారు. పూర్ణచంద్రరావు తొలుత పాలను సేకరించి డెయిరీకి పంపి జీవనం సాగించేవాడు. అదనపు ఆదాయం పొందాలనే ఉద్దేశంతో పాలపొడి, నూనె, ఉప్పు, ఇతర సామగ్రితో కల్తీ పాలు తయారుచేసి స్థానికంగా కేంద్రాలకు సరఫరా చేస్తున్నాడు. ఈ సందర్భంగా సిద్ధంగా ఉంచిన పాల డబ్బాలతోపాటు తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నమూనాలను పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు. పూర్ణచంద్రరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో ఎస్సై రామకృష్ణ, ఆహార భద్రతాధికారి నరసింహుడు తదితరులు పాల్గొన్నారు. పసిపిల్లలు తాగే పాలల్లో కూడా కల్తీ జరుగుతుందని.. నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా సహకరించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని