logo

ఆ నిర్లక్ష్యం ఖరీదు.. రెండు ప్రాణాలు

వారిద్దరివీ నిరుపేద కుటుంబాలు.. చిరు వ్యాపారాలు చేసుకుంటేనే జీవనం గడిచేది. వ్యాపారంలో భాగంగా అవసరమైన బిందెలు కొనుగోలు చేసేందుకు ఇళ్ల నుంచి బయలుదేరిన వీరిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడింది.

Published : 25 Jan 2023 03:06 IST

ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

అక్కడికక్కడే ఇద్దరు చిరు వ్యాపారుల దుర్మరణం

మార్కాపురం నేర విభాగం, న్యూస్‌టుడే: వారిద్దరివీ నిరుపేద కుటుంబాలు.. చిరు వ్యాపారాలు చేసుకుంటేనే జీవనం గడిచేది. వ్యాపారంలో భాగంగా అవసరమైన బిందెలు కొనుగోలు చేసేందుకు ఇళ్ల నుంచి బయలుదేరిన వీరిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడిపి ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఇరు కుటుంబాలకు చెందిన ముక్కు పచ్చలారని తొమ్మిదిమంది చిన్నారులకు చిరునవ్వును దూరం చేసింది.

మార్కాపురం పట్టణం రాజీవ్‌నగర్‌ శివారు కాలనీలో నివాసముండే విబూది పెద్ద మౌలాలి(33), పరిగ సుబ్బరాయుడు(28).. ప్లాస్టిక్‌ బిందెలను ఒంగోలు, నంద్యాల నుంచి తెచ్చి ద్విచక్ర వాహనాలపై చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయిస్తుంటారు. వరుసకు వీరిద్దరు బావబావమరుదులు. మంగళవారం పెద్ద మౌలాలి, సుబ్బరాయుడుతో పాటు సమీప బంధువులైన చిన మౌలాలి, శ్రీనివాసులు కలిసి రెండు రెండు ద్విచక్ర వాహనాలపై సరకు కోసం ఒంగోలు బయలుదేరి వెళ్లారు. జాతీయ రహదారి 544డిపై ప్రయాణిస్తూ తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీ సమీప అటవీశాఖ నర్సరీ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో పెద్దమౌలాలికి ఫోన్‌ రావడంతో రహదారి అంచున ద్విచక్ర వాహనం ఆపి మాట్లాడుతున్నాడు. అదే సమయంలో మార్కాపురం నుంచి ఒంగోలు వెళ్తున్న మార్కాపురం డిపో బస్సు (ఏపీ27జడ్‌0322) వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దానిపైనే ఉన్న పెద్దమౌలాలి, సుబ్బరాయుడు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలిసి అక్కడికి చేరుకున్న ఇరు కుటుంబాల సభ్యులు మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. పొదిలి సీఐ సుధాకర్‌ బాబు, తర్లుపాడు ఎస్సై ముక్కంటి, మార్కాపురం గ్రామీణ ఎస్సై సుమన్‌ చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాలను మార్కాపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు.

అయ్యో.. చిన్నారులూ

ప్రమాదంలో మృతి చెందిన పెద్దమౌలాలికి పధ్నాలుగేళ్ల క్రితం లక్ష్మీతో వివాహమైంది. వారికి కుమార్తెలు మహాలక్ష్మి(12), గాయత్రి (10), కుమారులు పెద్దరంగయ్య(9),  చిన రంగయ్య(4), గణేష్‌ (2) సంతానం. సుబ్బరాయుడుకు భార్య లక్ష్మీ, కుమార్తెలు రమ్యశ్రీ(7), శ్రీలక్ష్మి (4), కుమారులు పెద్దరంగయ్య(2), చిన్నరంగయ్య(1) ఉన్నారు. ఇరు కుటుంబాలకు చెందిన వారు పెద్దదిక్కు కోల్పోవడంతో ఆ తొమ్మిది మంది చిన్నారులకు ఆధారం లేకుండాపోయింది. మౌలాలి, సుబ్బరాయుడుల తల్లిదండ్రులు కూడా వృద్ధులు. వారి పోషణ సైతం ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. మార్కాపురం ఆసుపత్రి వద్దకు వారంతా చేరుకొని గుండెలు పగిలేలా రోదించారు.

మార్కాపురం వైద్యశాల వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని