logo

కానరాని పేర్లు.. వేదనలో నిర్వాసితులు

జిల్లాలోనే కీలకమైన ప్రాజెక్టు వెలిగొండ. ఇది పూర్తయితే పశ్చిమ ప్రకాశంలో తాగు, సాగునీటి కష్టాలు తీరుతాయి.

Published : 26 Jan 2023 02:56 IST

వెలిగొండ ముంపు గ్రామాల్లో పరిస్థితి
న్యాయం చేయాలంటూ దరఖాస్తుల వెల్లువ
మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే

మార్కాపురం మండలం గొట్టిపడియ నిర్వాసిత గ్రామం

జిల్లాలోనే కీలకమైన ప్రాజెక్టు వెలిగొండ. ఇది పూర్తయితే పశ్చిమ ప్రకాశంలో తాగు, సాగునీటి కష్టాలు తీరుతాయి. ఇంతటి కీలకమైన ప్రాజెక్టు కోసం పుట్టి పెరిగిన గ్రామాలను, వ్యవసాయ భూములను త్యాగం చేసిన నిర్వాసితుల పరిస్థితి మాత్రం దయనీయంగానే ఉంది. పునరావాసం కల్పన, పరిహారం దక్కక ఇప్పటికీ ముంపు గ్రామాల్లోనే వీరు జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల నిర్వాసితుల పేర్లతో నూతన గెజిట్‌ జాబితాను ప్రకటించింది. అందులో అనేకమంది పేర్లు లేకపోవడంతో వారంతా తల్లడిల్లుతున్నారు. అధికారులు చెప్పిన ఆధారాలు అందజేసిన తర్వాత మళ్లీ ఏదో ఒకటి లేదంటూ మెలికలు పెడుతున్నారని వాపోతున్నారు. తమకు అర్హత కల్పించాలని, జాబితాలో పేర్లు చేర్చాలని దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు ముంపు గ్రామాల్లో అధికారుల బృందాలు పర్యటించి విచారణ చేపట్టాయి. ఇప్పటికైనా న్యాయం చేయాలని వారంతా కోరుతున్నారు.

కలనూతలలో దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు

1457 దరఖాస్తులు

వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలుగా మార్కాపురం మండలం గొట్టిపడియ, అక్కచెరువుతండా.. పెద్దారవీడు మండలం సుంకేసుల, కలనూతల, గుండంచెర్ల, కాటంరాజుతండా, చింతలముడిపి.. అర్థవీడు మండలం లక్ష్మీపురం, సాయిరాంనగర్‌, రామలింగేశ్వరపురం, కృష్ణనగర్‌ ఉన్నాయి. ఈ 11 గ్రామాల నుంచి 7319 మంది నిర్వాసితులు ఉన్నారంటూ అధికారులు గెజిట్‌ జాబితా ప్రకటించారు. ఇంకా అనేకమంది అర్హుల పేర్లు ఇందులో లేవని ఆ గ్రామాల నిర్వాసితులు వాపోతున్నారు. ప్రతి గ్రామంలో సగటున 40 నుంచి 200 మంది వరకు వీరు ఉన్నారు. గెజిట్‌లో తమను చేర్చాలంటూ 1457 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి.


మా కుటుంబ సభ్యుల పేర్లు లేవు

మా పూర్వీకుల నుంచి గొట్టిపడియలోనే ఉంటున్నాం. ప్రభుత్వం ప్రకటించిన గెజిట్‌ జాబితాలో మా అమ్మ పేరు ఒక్కటే ఉంది. మా దంపతుల పేర్లు లేవు. అనేకమార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. దళారులకు లంచాలు ఇచ్చే పరిస్థితి లేదు. అధికారులే న్యాయం చేయాలి.

సాలువ శ్రీనివాసులు, గొట్టిపడియ ముంపు గ్రామం


జాబితాలో చోటు కోసం పదేపదే దరఖాస్తులు

వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామంలో ఉన్నా మా పేర్ల్లు లేవు. ఇక్కడే ఉన్నట్లు అన్ని ఆధారాలు అధికారులకు అందజేశాం. అనేకసార్లు పరిశీలన చేశారు.. విచారణ జరిపారు. అయినా నిర్వాసితుల జాబితాలో మాకు చోటు దక్కలేదు. కలెక్టర్‌, జేసీలకు సైతం వినతులు ఇచ్చాం.

పెరుమాళ్ల భాగ్యలక్ష్మి, గొట్టిపడియ


పూర్వీకుల నుంచి ఇక్కడే

మా తల్లి, అన్నదమ్ముల పేర్లు జాబితాలో ఉన్నాయి. నాతో పాటు నా కుమారులు, కుమార్తెల పేర్లు (అయిదుగురు) కానరాలేదు. అధికారులు మార్కాపురం మండలంలోని ఇడుపూరు సమీపంలో ఏర్పాటు చేసిన నిర్వాసితుల కాలనీలో ఇంటి పట్టాలు మంజూరు చేశారు. జాబితాలో నమోదు కోసం కొన్నేళ్లుగా తిరుగుతున్నా. ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేసి న్యాయం చేయాలి.

జి.మల్లికార్జున, కలనూతల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని