logo

పులుల సంచారంతో అలజడి నల్లమల శివారు పల్లెలు అప్రమత్తం

నల్లమల సమీపంలోని గ్రామాల్లో పెద్ద పులుల సంచారం అలజడి రేపుతోంది. వెలగలపాయ, మాగుటూరు, పాపినేనిపల్లి, దోర్నాల, గిద్దలూరు అటవీ పరిధి గ్రామాల్లోకి ఆహారం, నీటి కోసం ఇవి వస్తున్నాయి.

Published : 26 Jan 2023 02:56 IST

అర్థవీడు, న్యూస్‌టుడే

ఆవు కళేబరం వద్దకు పులి రెండోసారి వస్తున్న దృశ్యం సీసీ కెమెరాలో చిక్కింది ఇలా..

2008 పులుల గణన ప్రకారం నల్లమలలో 60కి పైగా పెద్ద పులులు ఉండగా..ఒక్క మార్కాపురం డివిజన్‌ పరిధిలో 48 వరకు ఉన్నాయి.

నల్లమల సమీపంలోని గ్రామాల్లో పెద్ద పులుల సంచారం అలజడి రేపుతోంది. వెలగలపాయ, మాగుటూరు, పాపినేనిపల్లి, దోర్నాల, గిద్దలూరు అటవీ పరిధి గ్రామాల్లోకి ఆహారం, నీటి కోసం ఇవి వస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతంలోని పశువులు, జీవాలు వీటికి బలవుతున్నాయి. పులులను గుర్తించి అడవిలోకి తరమడంలో అటవీ అధికారులు విఫలమవుతున్నారు. క్షేత్రస్థాయి అధికారులు ప్రతి రోజు బీట్‌ పరిధిలో పెట్రోలింగ్‌ చేయకపోవడం, స్థానికంగా నివాసం ఉండకపోవడంతో పాటు ముఖ చిత్ర హాజరు వేసే నెపంతో మార్కాపురం  రేంజ్‌ కార్యాలయానికి వెళ్లడం వంటి కారణంగా  అందుబాటులో ఉండటం లేదు.

పదేళ్లలో అర్థవీడు మండల పరిధిలోని వెలగలపాయ, పాపినేనిపల్లి, మాగుటూరు సమీప గ్రామాల్లో సుమారు 10 వరకు ఎద్దులు..మరో 20 వరకు గేదెలు, ఆవులు పులుల దాడిలో మృత్యువాత పడ్డాయి. ఇటీవల మాగుటూరుకు చెందిన గురుస్వామికి చెందిన ఆవుపై శంఖరాపురం-లక్ష్మీపురం రహదారి సమీపంలో పెద్దపులి దాడి చేసి చంపింది. ఆవు కళేబరం వద్దకు దాడి చేసిన పులి రెండు సార్లు వచ్చి పోవడం అటవీ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాల్లో చిక్కింది. అదే సమయంలో మాగుటూరు సమీప పొలాల్లో దుప్పిని వేటాడి..పొలాల గట్టునే తిని వెళ్తున్న ఘటన చూసి రైతులు భయభ్రాంతులకు గురయ్యారు. రెండు రోజుల వ్యవధిలో వెలగలపాయ సమీపంలో మరో ఎద్దు పై దాడి చేసింది. గట్టిగా కేకలు వేయడంతో పారిపోయినట్లు  రైతులు తెలిపారు. క్షేత్రస్థాయి అధికారులు అటవీ పరిధి గ్రామాలకు అందుబాటులో ఉంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని రైతులు, పశు పోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అభయారణ్యానికి కూతవేటు దూరంలో ...

అర్థవీడు మండల పరిధిలోని లోయ, మండల కేంద్ర సమీప పల్లెలు అన్నీ నల్లమల అభయారణ్యానికి కూతవేటు దూరంలోనే ఉన్నాయి. బొల్లుపల్లి, వెలగలపాయ నుంచి నాగులవరం, కాకర్ల వరకు నల్లమల అడవి నుంచి ఎత్తైన కొండ ఒకటే ఉంది. కొండకు అటూ ఇటూ..లోయ.. మండల కేంద్రానికి ఆనుకుని ఉన్న సుమారు 20 గ్రామాలు కొండల అంచునే ఉంటున్నాయి. పెద్ద పులులు, చిరుతలు వీటి సమీపంలోనే సంచరిస్తుంటాయి. ఇక్కడి ప్రజల జీవనాధారం పశుపోషణ కావడంతో వాటి మేతకు అడవి లోకే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పులుల దాడిలో పశువులు మృత్యువాత పడుతున్నాయి. అటవీ శాఖ నష్టపరిహారంగా నగదు ఇస్తున్నా పులుల సంచారంతో పశు పోషకులు, రైతులు అటు వైపు వెళ్లేందుకు భయపడుతున్నారు.

పులి దాడిలో మృత్యువాత పడిన ఆవు


ప్రత్యేక నిఘా ఉంచాం..

ఏడాది వయసున్న పులులు తల్లి నుంచి వేరై ఎటైనా వెళ్తుంటాయి. అలా మాగుటూరు వైపు వచ్చిన పులి వేట కోసం వచ్చి ఉంటుంది. ఆవుపై దాడి చేసిన విషయం తెలుసుకుని క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేశాం. ఆవు కళేబరం వద్ద కెమెరా ఏర్పాటు చేసి వాటి సంచారం తెలుసుకున్నాం. ఆహారం కోసం వేటాడే క్రమంలో అవి దారి తప్పడం సహజం. సమీప గ్రామాల్లో పశుపోషకులకు, రైతులకు వీటి సంచారంపై అవగాహన కల్పించాం.

ప్రసాద్‌రెడ్డి, డీఆర్వో, నాగులవరం సెక్షన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని