logo

కన్నతల్లిని కిరాతకంగా చంపిన కుమారుడు

కన్న కొడుకే తల్లిని కిరాతకంగా చంపిన సంఘటన పుల్లల చెరువు మండలంలోని ముటుకుల పంచాయతీ తెల్లగట్ల గ్రామంలో చోటుచేసుకుంది.

Updated : 26 Jan 2023 07:05 IST

హనుమమ్మ ( పాత చిత్రం)

పుల్లలచెరువు, న్యూస్‌టుడే : కన్న కొడుకే తల్లిని కిరాతకంగా చంపిన సంఘటన పుల్లల చెరువు మండలంలోని ముటుకుల పంచాయతీ తెల్లగట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. ఈ గ్రామానికి చెందిన కొప్పెరబోయిన హనుమమ్మ(65)కు నలుగురు కుమారులు. అందరికీ వివాహమయ్యాయి.. నాలుగో కుమారుడైన వెంకటేశ్వర్లు వద్ద ఉంటోంది. వెంకటేశ్వర్లుకు భార్య కళ్యాణి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే వెంకటేశ్వర్లుకు మతిస్థిమితం లేకపోవడంతో తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. దీంతో భార్య అతనిని వదిలి పుట్టింటికి వెళ్లింది. కొంత కుదుటపడిన తరువాత మళ్లీ భర్త వద్దకు ఆమె వచ్చారు. ఈ క్రమంలో 21వ తేదీ మళ్లీ భార్య, భర్తల మధ్య గొడవ చోటుచేసుకోవడంతో కళ్యాణి పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లారు. మంగళవారం వెంకటేశ్వర్లు భార్య వద్దకు వెళ్లి ఇంటికి రావాలని కోరినా ఆమె నిరాకరించడంతో ఇద్దరు పిల్లలను తీసుకుని తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో తల్లి హనుమమ్మ కొడుకును మందలించడంతో విచక్షణ కోల్పోయిన వెంకటేశ్వర్లు బుధవారం ఆమె నిద్రిస్తున్న సమయంలో ఇంటి లోని కూరగాయలను కోసే కత్తితో గొంతు కోసి హతమార్చాడు. అదే గ్రామంలో నివాసముంటున్న హనుమమ్మ అక్క వద్దకు వెళ్లి అమ్మ చనిపోయిందని చెప్పాడు. ఆమె వెళ్లి అన్నదమ్ములకు విషయాన్ని తెలియజేసింది. వారు అక్కడికి చేరుకొని రక్తపుమడుగులో పడి ఉన్న తల్లిని చూసి చలించిపోయారు. వెంటనే పుల్లలచెరువు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ వేముల సుధాకర్‌ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని