logo

చ్రేతికందితే ఒట్టు..!

అందిన కాడికి పెట్టుబడులు తెచ్చి.. అదునులో దుక్కి దున్ని.. విత్తు నాటింది మొదలు.. ఏడెనిమిది నెలలపాటు సంరక్షిస్తూ దిగుబడుల కోసం నిరీక్షించిన కంది రైతులకు చివరికి కన్నీరే మిగిలింది.

Published : 27 Jan 2023 02:13 IST

1.80 లక్షల ఎకరాల్లో సాగు
దిగుబడి లేక ఆందోళనలో రైతులు

తెగులు ఆశించి ఎండిపోయిన పంట

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు,న్యూస్‌టుడే, పీసీపల్లి: అందిన కాడికి పెట్టుబడులు తెచ్చి.. అదునులో దుక్కి దున్ని.. విత్తు నాటింది మొదలు.. ఏడెనిమిది నెలలపాటు సంరక్షిస్తూ దిగుబడుల కోసం నిరీక్షించిన కంది రైతులకు చివరికి కన్నీరే మిగిలింది. 2022-23 ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా సుమారు 1.80 లక్షల ఎకరాల్లో రైతులు కంది పంట సాగు చేశారు. వర్షాధార పంట కావడంతో ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు చేశారు. గతేడాది చివరిలో వచ్చిన మాండౌస్‌ తుపాను దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపింది. ఏకధాటిగా వర్షాలు పడటంతో పూత, పిందె రాలిపోయాయి. తర్వాత తెగులు సోకి పంట ఎండిపోగా, కొన్నిచోట్ల మొక్కలు ఏపుగా పెరిగినా కాయలు లేకుండా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎకరాకు క్వింటా దిగుబడి వచ్చే పరిస్థితి కూడా లేకపోయింది.

* ఆశలు వదులుకున్న అన్నదాతలు...: పశ్చిమ ప్రకాశంలోని కనిగిరి, దర్శి, గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం తదితర నియోజకవర్గాల్లో కంది సాగు ఎక్కువ. మాండౌస్‌ తుపాను కారణంగా పూత, పిందె, కాయ దశలో ఉన్న పంట మొత్తం చేతికి అందకుండా పోయింది. బోర్లు, బావుల కింద కొందరు రైతులు పంటను కాపాడుకునేందుకు పురుగుమందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. తుపాను ప్రభావంతో ప్రస్తుతం పంటను ఎండు తెగులు ఆశించింది. మొక్క పెరిగి కాయ లేకుండా పోయింది. దీంతో కొందరు రైతులు కట్టెను పశువులు, జీవాలకు మేతగా వదిలేశారు.  

* యూనిట్‌ పరిధి పెంపుతో ఆందోళన...: పంట నష్టం వాటిల్లితే మండలం యూనిట్‌గా గతంలో బీమా పరిహారం అందించేవారు. ప్రస్తుతం ఆ నిబంధనను 5 వేల హెక్టార్లుగా నిర్ణయించారు. మాండౌస్‌ తుపాను కారణంగా పంట నష్టాన్ని అధికారులు అంచనా వేసినప్పటికీ అందులో కందిని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో తమకు బీమా పరిహారం వస్తుందో లేదో అనే ఆందోళనలో రైతులున్నారు. కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలంలో ఖరీఫ్‌లో 14 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఇక్కడ ఎకరా కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో తమకు పంట నష్ట పరిహారం అందేలా చూడాలని అక్కడి రైతులు వేడుకుంటున్నారు.


నష్టపోకుండా చర్యలు చేపడతాం...

మాండౌస్‌ తుపాను నష్టాల్లో కంది పంటను పరిగణించలేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దిగుబడి తగ్గిందని భావించాం. వచ్చే నెల కోతలు ప్రారంభమవుతాయి. దిగుబడిని బట్టి నష్టం వివరాలు తెలుస్తాయి. ఆ మేరకు రైతులకు పరిహారం వస్తుంది. పంట నష్టం ఒకే మండలంలో 5 వేల హెక్టార్లు లేకుంటే పక్క మండలాలను కలిపి రైతులు నష్టపోకుండా చూస్తాం.  

శ్రీనివాసరావు, జేడీఏ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని