logo

చేదోడుకు గడువు గండం...

వైఎస్సార్‌ చేదోడు పథకం లబ్ధిదారులకు చుక్కలు చూపుతోంది. ఆర్థికసాయం అందించేందుకు దరఖాస్తుల స్వీకరణ గడువు తక్కువగా ఉండటం.. ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు అందజేసేందుకు మూడు రోజులే సమయమివ్వడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు.

Published : 28 Jan 2023 02:47 IST

లబ్ధిదారులకు తప్పని ధ్రువీకరణం
అపరిష్కృతంగా 4,633 దరఖాస్తులు

ధ్రువీకరణ పత్రాల కోసం ఒంగోలు మండల తహసీల్దార్‌ కార్యాలయంలో

కంప్యూటర్‌ ఆపరేటర్‌ వద్ద వేచి ఉన్న దరఖాస్తుదారులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: వైఎస్సార్‌ చేదోడు పథకం లబ్ధిదారులకు చుక్కలు చూపుతోంది. ఆర్థికసాయం అందించేందుకు దరఖాస్తుల స్వీకరణ గడువు తక్కువగా ఉండటం.. ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు అందజేసేందుకు మూడు రోజులే సమయమివ్వడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. అవసరమైన పత్రాల కోసం దరఖాస్తు చేసుకుని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

మూడు రోజుల్లోనే పత్రాలివ్వాలంటూ...: జగనన్న చేదోడు పథకం కింద దర్జీలు, నాయీ బ్రాహ్మణులు, రజకులకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.10 వేలు చొప్పున ఆర్థికసాయం అందజేస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో రెండో విడత కింద సాయం అందించగా.. ఈ నెల 30న మూడో విడతగా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలో జమ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ పథకం కింద జిల్లా వ్యాప్తంగా 14,356 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 4,633 మందివి ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకే గడువిచ్చారు. పాత లబ్ధిదారుల నుంచి వేలిముద్రల సేకరణ కూడా ఇదే సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు రోజుల్లోనే పలు రకాల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని ప్రకటించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారితో పాటు, పాత వారు సైతం కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని సమాచారం అందించారు. దీంతో వీటి కోసం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. చివరి రోజైన గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా సచివాలయాలు, తహసీల్దార్‌ కార్యాలయాల్లో సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

మొరాయించిన ఏపీ సేవ పోర్టల్‌...: లబ్ధిదారులు కార్మిక ధ్రువీకరణ పత్రాన్ని(లేబర్‌ సర్టిఫికేట్‌) తాజాగా సచివాలయాల ద్వారా తీసుకోవాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఈ పత్రాన్ని రెండు గంటల్లోనే జారీ చేస్తున్నారు. కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు, బ్యాంక్‌ ఖాతా పాసుపుస్తకం, రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, ఫొటోను లబ్ధిదారుడు ఏ ప్రాంతంలో ఉంటే అక్కడ సచివాలయంలోనే అప్‌లోడ్‌ చేయాలి. షెడ్యూల్‌ ప్రకారం అన్ని వివరాలను గురువారం సాయంత్రంలోపు అనుసంధానం చేయాలి. అయితే సర్వర్‌ మొరాయించడంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు గడువు పొడిగించారు. సచివాలయాల్లో ఏదైనా ధ్రువీకరణ పత్రం కావాలంటే ఏపీ సేవ పోర్టల్‌లోనే అప్‌లోడ్‌ చేస్తారు. ఆ పోర్టల్‌లోనే తహసీల్దార్‌ కార్యాలయం నుంచి జారీ చేస్తారు. శుక్రవారం ఉదయం నుంచే జిల్లా వ్యాప్తంగా అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించిన ఏపీ సేవ పోర్టల్‌ సర్వర్‌ మొరాయించింది. దీంతో చేదోడు దరఖాస్తుదారులకు కార్యాలయాల వద్దనే సాయంత్రం వరకు పడిగాపులు తప్పలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పత్రాలు సమర్పించేందుకు గడువు పెంచాలని పలువురు కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని