logo

మళ్లీ పెద్దపులి దాడి

పెద్దపులి దాడిలో మరో ఆవు మృతి చెందిన సంఘటన మండలంలో శుక్రవారం వెలుగు చూసింది. మాగుటూరు గ్రామానికి చెందిన పది మంది పశువుల కాపర్లు లక్ష్మీపురం సమీపంలోని శంఖరాపురం నూతన రహదారిని ఆనుకుని ఒక దొడ్డిని ఏర్పాటు చేసుకున్నారు.

Published : 28 Jan 2023 02:47 IST

అర్థవీడు, న్యూస్‌టుడే: పెద్దపులి దాడిలో మరో ఆవు మృతి చెందిన సంఘటన మండలంలో శుక్రవారం వెలుగు చూసింది. మాగుటూరు గ్రామానికి చెందిన పది మంది పశువుల కాపర్లు లక్ష్మీపురం సమీపంలోని శంఖరాపురం నూతన రహదారిని ఆనుకుని ఒక దొడ్డిని ఏర్పాటు చేసుకున్నారు. పగలంతా సమీప కొండ ప్రాంతాల్లో ఆవులను మేపుతూ.. చీకటి పడితే అందులో ఉంచుతున్నారు. వారం రోజుల క్రితం 70 ఆవుల మందను పక్కనే కొండ ప్రాంతంలో మేతకు తోలారు. ఈ సమయంలో పెద్దపులి దాడి చేయడంతో ఒకటి మృతి చెందింది. దీంతో భయపడిన కాపరులు ఆవులను అక్కడ ఏర్పాటు చేసిన దొడ్డిలో ఉంచకుండా మాగుటూరుకు తరలించారు. గ్రామ సమీపంలోనే వాటిని ఉంచుతున్నారు. గురువారం అర్ధరాత్రి సమయంలో నాలి నాగేశ్వరరావుకు చెందిన ఒక ఆవుపై పెద్దపులి దాడి చేసి సమీపంలోని చెట్లలోకి ఈడ్చుకెళ్లి చంపేసింది. ఈ విషయాన్ని కాపరులు శుక్రవారం గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న నాగులవరం సెక్షన్‌ డీఆర్వో ప్రసాద్‌రెడ్డి, బీట్‌ అధికారి అండ్రూస్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆవు కళేబరానికి పంచనామా నిర్వహించారు. గ్రామానికి కూత వేటు దూరంలోనే పులి దాడి చేయడంతో సమీప ప్రజలు, రైతులు,  కాపరులు భయాందోళనకు గురవుతున్నారు. వేట రుచి మరిగిన పులి ఈ ప్రదేశాన్ని త్వరగా వదలి పోదని చెబుతున్నారు. పులిని ఈ ప్రాంతం నుంచి తరిమే ఏర్పాట్లు చేయాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు