logo

అత్యవసరానికి దూరాభారం

అత్యవసర వాహనం అవసరమైనా రాలేని పరిస్థితులు పశ్చిమ ప్రకాశం లోని మారుమూల మండలాల్లో నెలకొన్నాయి.

Published : 28 Jan 2023 02:47 IST

108 సేవలకు నోచుకోని మారుమూల ప్రాంతాలు
ఇబ్బందుల్లో పల్లె ప్రజలు
మరమ్మతులకు గురైతే సిబ్బందికి నరకమే

జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో అత్యవసర వాహనం అందిస్తామంటూ వినతి ఇస్తున్న నేస్తం పౌండేషన్‌ ప్రతినిధులు

అర్థవీడు, న్యూస్‌టుడే : అత్యవసర వాహనం అవసరమైనా రాలేని పరిస్థితులు పశ్చిమ ప్రకాశం లోని మారుమూల మండలాల్లో నెలకొన్నాయి. దీంతో ఆ మండల వాసులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. అసలే సిగ్నల్స్‌ లేని పల్లెలో ఏదో విధంగా 108 నంబరుకు కాల్‌ చేసినా ఆ వాహనం మండల కేంద్రం నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణించి రావాల్సిందే. దూరాభారంతో సకాలంలో చేరుకోలేక..క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. మండల కేంద్రాలకు పరిమితమైన 108 వాహన సేవలు సమయానికి అందక గ్రామాల ప్రజలు ఒక వైపు ఆవేదన పడుతుంటే..మరోవైపు చరవాణి సిగ్నల్‌ లేని పల్లెల్లో వాహనం మరమ్మతుల గురైతే ఆ సిబ్బంది పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

జిల్లాలో 39 వరకు 108 వాహనాలు, 250 మంది సిబ్బంది ఉన్నారు. ఒక్క మార్కాపురం డివిజన్‌ పరిధిలోనే 10 వాహనాలు ఉన్నాయి. ప్రతి మండల కేంద్రానికి ఒకటి చొప్పున ఈ వాహనాలను కేటాయించగా..ప్రతి రెండు వాహనాలకు పది మంది (పైలెట్లు ఈఎంటీలు) సిబ్బంది విధుల్లో ఉంటారు. నెలలో నాలుగు రోజుల (వీక్లీ ఆఫ్‌) సెలవుల కేటాయింపుతో పాటు ప్రతి నెలా..120 కేసులు 108 వాహనం లోనే తరలించేలా నిబంధనలు ఉన్నాయి. అయితే నెలలో 120 కేసులు పూర్తి చేయకపోతే మండలాల్లో ఉన్న వాహనాన్ని సిబ్బందిని..పట్టణ ప్రాంతాల్లో విధులు నిర్వహించేలా సూపర్‌వైజర్లు ఒత్తిడి తెస్తున్నారు. సిబ్బంది అకస్మాత్తుగా సెలవులు పెట్టుకోవాల్సి వస్తే పనిచేసే చోట నుంచి పక్క మండలాలకు పనిష్‌మెంట్‌ పేరుతో పంపుతుండటంతో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.
అర్థవీడు లోయ గ్రామాల్లో అత్యవసర వాహన సిబ్బంది విధులు నిర్వహించాలి అంటేనే బయటపడి పోతున్నారు..ఈ పల్లెల్లో చరవాణి పనిచేయదని వాహనం మరమ్మతులకు గురైతే క్షతగాత్రుల వద్దకు చేరుకోకుండానే వెనుదిరిగే పరిస్థితి ఉంటుంది. టైర్‌ పంచర్‌ అయినా..కంభం వెళ్లి సిబ్బందే బాగు చేయించుకునే పరిస్థితి ఉంటుంది.

* ఇటీవల అర్థవీడులో పనిచేసే ఓ పైలెట్‌ అనారోగ్యంతో సెలవు అడిగితే పక్క మండలానికి వెళ్లమని చెప్పడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసుకుంటానంటూ..వాట్సాప్‌ గ్రూపుల్లో సందేశం కూడా పంపారు.

* పొదిలి డివిజన్‌ కొనకనమిట్లలో పనిచేసే సిబ్బంది వేరే మండలానికి పంపడంతో వెళ్లే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు.

లోయలో వాహన టైరు పంచర్‌ కావడంతో కంభం వెళ్లి బాగు చేయిస్తున్న దృశ్యం..

110 కిలో మీటర్ల దూరం..

అర్థవీడు మండల కేంద్రం నుంచి అత్యవసర వాహనం లోయ గ్రామమైన వెలగలపాయ వెళ్లాలంటే 70 కిలోమీటర్లు పోవాలి. అక్కడ నుంచి మరో 40 కిలోమీటర్ల మేర తిరుగు ప్రయాణిస్తే గానీ కంభం ఏరియా వైద్యశాలకు చేరే పరిస్థితి లేదు. లోయ గ్రామాల్లో ప్రమాదానికి గురైన వారిని 108లో తరలించాలంటే ఆ ప్రాణాలను కాపాడుకోలేని దుస్థితి ఉంది. ‌్ర  అర్థవీడు 108 ఖాళీగా ఉంటే అదే వాహనం  110 కిలో మీటర్ల మేర ప్రయాణించి బాధితులను కంభం చేర్చాల్సి వస్తోంది. ఒక వేళ ఆ వాహనం బిజీగా ఉంటే కంభం నుంచి వాహనం రావాలంటే పోను, రాను మొత్తంగా 80 కిలోమీటర్ల దూరభారం తప్పదు. ‌్ర రెండేళ్ల క్రితం యాచవరం గ్రామానికి చెందిన ఒక వాలంటీర్‌ రోడ్డు ప్రమాదం గాయపడి 108 కోసం వేచి ఉండి వైద్యం అందక ప్రాణాలు కోల్పోయాడు. గత ఏడాది ఇదే మాసంలో రంగాపురం గ్రామానికి చెందిన ఓ గర్భిణికి నొప్పుల రాగా కంభం నుంచి 108 సకాలంలో రాకపోవడంతో ఆమెను ఆటోలో తరలిస్తుండగానే ఆటోలోనే ప్రసవించింది. ‌్ర  12 గ్రామాలు 14 వేల జనాభా నివసిస్తున్న లోయకు ప్రత్యేకంగా అత్యవసర వాహనం నడపాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.

వాహనం ఇస్తామన్నా స్పందించడం లేదు..

లోయ గ్రామాల వారికి అవసరమైన అత్యవసర వాహనం దాతల సాయంతో కొనుగోలు చేసి ఇస్తామని, దానికి పైలెట్‌ను పెట్టుకుని డీజిల్‌ పోసుకుని నడిపించే చూడాలంటూ మూడేళ్లుగా అధికారుల, ప్రజాప్రతినిధుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం..నేటికి మోక్షం కలగడం లేదు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు, జిల్లా వైద్యాధికారులకు సైతం ఈ విషయంపై పలుమార్లు వినతులు అందించినా, నేరుగా కలిసినా స్పందన లేదు. లోయ గ్రామాల్లోని యాచవరం పీహెచ్‌సీ పరిధిలో అత్యవసర వాహనం ఉంటే లోయ పరిధి ప్రమాద బాధితులను సకాలంలో వైద్యశాలలకు తరలించి కాపాడేందుకు వీలుగా ఉంటుంది.

- బోయపాటి రవి, నేస్తం పౌండేషన్‌ ప్రతినిధి, యాచవరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని