logo

ఎవరు చెప్పినా.. వినేదే లేదు!

పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రామాయపట్నంలో ఓడరేవు నిర్మాణంలో ఉంది. ఇందుకుగాను జిల్లాలోని చీమకుర్తి గ్రానైట్‌ డంప్‌ల నుంచి రాళ్ల తరలింపు ప్రక్రియ నిత్యం కొనసాగుతోంది.

Published : 29 Jan 2023 02:02 IST

జాతీయ రహదారిపై అదే దండుయాత్ర

అమలుకు నోచని అధికారుల సూచనలు
ప్రమాదకరంగానే గ్రానైట్‌ రాళ్ల తరలింపు

పట్ట కప్పకుండా ఒంగోలు నగరంలోని కర్నూలు పైవంతెన వద్ద రాళ్లను తీసుకెళ్తున్న ఓ టిప్పర్‌

ఒంగోలు అర్భన్‌, న్యూస్‌టుడే: పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రామాయపట్నంలో ఓడరేవు నిర్మాణంలో ఉంది. ఇందుకుగాను జిల్లాలోని చీమకుర్తి గ్రానైట్‌ డంప్‌ల నుంచి రాళ్ల తరలింపు ప్రక్రియ నిత్యం కొనసాగుతోంది. దాదాపు 300 టిప్పర్లతో వీటిని రవాణా చేస్తున్నారు. వాస్తవానికి ఒక్కో వాహనంలో 28 టన్నుల బరువునే రవాణా చేయాల్సి ఉన్నప్పటికీ 40 టన్నులకు మించి ఎక్కిస్తున్నారు. పరిమితికి మించిన బరువు కారణంగా రోడ్లు దెబ్బతింటున్నా.. వాహనాలు తరచూ మొరాయిస్తూ రహదారులపై నిలిచిపోతున్నా ఎవరికీ పట్టడంలేదు. వీటి వేగంతో కొద్దిరోజుల వ్యవధిలోనే వేర్వేరు ప్రాంతాల్లో ప్రమాదాలు చోటుచేసుకుని నలుగురి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిశాయి. అధికార పార్టీలోని ఓ కీలక నేతకు చెందిన బంధువు కంపెనీ నిర్మిస్తున్న ప్రాజెక్టు కావడంతో గనులు, రవాణా, పోలీసు శాఖల అధికారులు కిమ్మనడం లేదు. ఈ విషయాన్ని తెలుపుతూ ‘ఈనాడు’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ఎట్టకేలకు జిల్లా యంత్రాంగం స్పందించింది. చీమకుర్తిలో ఇటీవల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహన చోదకులకు అధికారులు పలు సూచనలు చేశారు. అయినప్పటికీ ఆచరణలో అవేమీ అమలు కావడం లేదు.

ఆగని ప్రమాదాల పరంపర...

గ్రానైట్‌ రాళ్ల కారణంగా ఒంగోలు- కర్నూలు రహదారిలో చోటుచేసుకుంటున్న ప్రమాదాల పరంపరకు అడ్డుకట్ట పడటంలేదు. అధికారులు చేస్తోన్న సూచనలను కొందరు డ్రైవర్లు పట్టించుకోవడం లేదు. ఎవరు చెప్పినా వినేదే లేదు అన్నట్టుగా ఆచణలో వ్యవహరిస్తున్నారు. తాజాగా పొదిలి మండలం ఉప్పలపాడు సమీపంలో చోటుచేసుకున్న ప్రమాదంలో మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌ ప్రయాణిస్తున్న కారును టిప్పర్‌ ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలవ్వగా.. చోదకుడు, వ్యక్తిగత సహాయకుడు, అటెండర్‌లు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించి మరిన్ని ప్రమాదాలు చోటుచేసుకోకుండా రాళ్ల తరలింపులో నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు చేపట్టాల్సి ఉంది.


క్షతగాత్రులకు అధికారుల పరామర్శ...

డ్రైవర్‌ బాషాను పరామర్శిస్తున్న కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌, జేసీ అభిషిక్త్‌ కిషోర్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలులోని సమావేశానికి హాజరయ్యేందుకు వస్తుండగా మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌ వాహనం పొదిలి మండలం ఉప్పలపాడు విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో శనివారం ప్రమాదానికి గురైంది. గ్రానైట్‌ కర్మాగారంలోకి వెళ్తున్న టిప్పర్‌, కారు ఢీకొన్నాయి. దీంతో సబ్‌ కలెక్టర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వాహన చోదకుడు, వ్యక్తిగత సహాయకుడు, అటెండర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. వీరిని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌, సంయుక్త కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌, మార్కాపురం ఉప కలెక్టర్‌ సేతు మాధవన్‌ పరామర్శించారు. బాధితులకు ఎలాంటి ప్రాణపాయం లేదని... డ్రైవర్‌ బాషా చేతులకు, అటెండర్‌ బెనహర్‌ కంటికి తీవ్ర గాయాలైనట్టు వైద్యులు కలెక్టర్‌కు వివరించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన టిప్పర్‌ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఒంగోలు ఆర్డీవో విశ్వేశ్వరరావు, తహసీల్దార్‌ మురళి, ఇతర అధికారులు ఉన్నారు.


సదస్సులో అధికారులు చెప్పిందేమిటి...

* గ్రానైట్‌ రాళ్లను తరలిస్తున్న లారీల చోదకులు కచ్చితంగా రహదారి భద్రతా నియమాలు పాటించాలి. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్త వహించాలి.

* లారీల్లో పరిమితికి మించి ప్రమాదకర స్థితిలో ఎత్తుగా పేర్చి రవాణా చేయొద్దు. రాళ్లపై టార్పాల్పిన్‌ పట్ట కప్పుకొని రహదారిపై తీసుకెళ్లాలి.

* టిప్పర్ల చోదకులు కచ్చితంగా హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి.

* మితిమీరిన వేగంతో నడపొద్దు.

* రహదారి అంచుల్లో నిలిపి ప్రమాదాలకు కారణం కారాదు.

* నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు.


ఆచరణలో డ్రైవర్లు చేస్తున్నదేమిటి...

* అనుమతికి మించిన బరువులతోనే ప్రమాదకరంగా రాళ్ల రవాణా ఇంకా సాగుతోంది.

* ఒక్కటంటే ఒక్క టిప్పర్‌కు కూడా రాళ్లపై టార్పాలిన్‌ పట్ట కప్పిన దాఖలాలు లేవు.

* పరిమితికి మించి వాహనం పైకి కనిపించేలా రాళ్లను వాహనాల్లోకి ఎక్కిస్తున్నారు.

* అధిక బరువుతో టైర్లు పేలి.. ఇంజిన్లు మరమ్మతులకు గురై వాహనాలు మొరాయిస్తున్నాయి. వీటిని రహదారి అంచుల్లోనే నిలపడం పరిపాటిగా మారింది.

* రోజుకు రెండు ట్రిప్పులు నడపాలనే లక్ష్యం విధించడంతో కొందరు డ్రైవర్లు మితిమీరిన వేగంతో పరుగులు తీయిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలకు కారణమవుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని