logo

స్తంభాన్ని ఢీకొట్టి... యువకుడి దుర్మరణం

వేగంగా వెళ్తున్న బుల్లెట్‌ అదుపు తప్పి టెలిఫోన్‌ స్తంభాన్ని డీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. తాలూకా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Published : 29 Jan 2023 02:02 IST

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: వేగంగా వెళ్తున్న బుల్లెట్‌ అదుపు తప్పి టెలిఫోన్‌ స్తంభాన్ని డీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. తాలూకా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కేశవరాజుకుంటకు చెందిన ఉమ్మడిశెట్టి అంకబాబు కుమారుడు వెంకటేష్‌ (18)... గద్దలగుంటలోని స్నేహితులను కలిసేందుకు శుక్రవారం సాయంత్రం వెళ్లాడు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో బుల్లెట్‌ వాహనంపై ఇంటికి తిరిగి బయలుదేరాడు. వేగంగా వెళ్తున్న వాహనం... వీఐపీ రోడ్డులో అదుపుతప్పి టెలిఫోన్‌ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి యువకుడి తల రెండుగా చీలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమయంలో పెద్ద శబ్ధం రావడంతో పరిసర నివాసితులు... వెంటనే 108కు సమాచారం ఇచ్చి, రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


బాలిక మృతిపై ఆందోళన

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: కందుకూరు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఆరేళ్ల బాలిక మృతి వివాదానికి దారి తీసింది. వైద్యులు సక్రమంగా వైద్య సేవలందించనందునే బాలిక మృతి చెందారంటూ తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం బాలిరెడ్డిపాలేనికి చెందిన నల్లపు వీరనారాయణ, ఆదిలక్ష్మి కుమార్తె పుష్పవల్లి(6) జ్వరంతో బాధపడుతున్నారు. శుక్రవారం వాంతులు అయి నీరసంగా ఉందని కందుకూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. శనివారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో బాలిక మృతిచెందారు. ముక్కు పచ్చలారని తమ బిడ్డ అనారోగ్యంతో బాధపడుతున్నా వైద్యులు పట్టించుకోలేదని చిన్నారి తల్లి, బంధువులు ఆరోపించారు. శుక్రవారం ఉదయం జూనియర్‌ వైద్యుడు పరీక్షించారని, అదేరోజు రాత్రి నర్సులు ఇంజెక్షన్‌ వేశారు మినహా ఏ వైద్యుడు మా బిడ్డకు వైద్యం చేయలేదని వారు తెలిపారు. అసలు ఏం బాగా లేదో కూడా చెప్పలేదని వాపోయారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శకుంతల మాట్లాడుతూ చిన్నారికి శనివారం వేకువజామున నిద్రలో పిడుసు లేదా గుండె సంబంధిత సమస్య తలెత్తి మృతి చెందినట్లు భావిస్తున్నామన్నారు. వైద్యుల నిర్లక్ష్యమేమీ లేదని, వైద్య సేవలు సక్రమంగా అందించినట్లు వివరించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని