logo

భరోసా ఇవ్వని ఉన్నతి

స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు అనుసంధాన రుణాలు అందిస్తున్న విషయం తెలిసిందే.

Updated : 30 Jan 2023 06:36 IST

ఉపాధి లేక ఆవేదనలో ఎస్సీ, ఎస్టీ సంఘాల మహిళలు

      ఒంగోలు మండలంలో సమావేశమైన స్వయం సహాయక సంఘాల మహిళలు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు అనుసంధాన రుణాలు అందిస్తున్న విషయం తెలిసిందే. అదే మాదిరి ఎస్సీ, ఎస్టీ సంఘాల్లోని మహిళల జీవనోపాధికి రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ఫ్‌) డీఆర్డీఏ ద్వారా అమలుచేస్తున్న ఉన్నతి పథకం గతంలో బాగానే ఆదుకున్నా ప్రస్తుతం ఆశించిన లక్ష్యానికి దూరంగా ఉంది. ఈ పథకం కింద వడ్డీ లేని రుణాలు అందేవి. దీనిని వాయిదాల కింద 36 నెలల్లో తిరిగి చెల్లించాలి. గతంలో దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లోనే బ్యాంకు ఖాతాలో రుణం జమయ్యేది. తద్వారా పిల్లల చదువు, లేకుంటే ఇంట్లోని వైద్య ఖర్చులకు సైతం వినియోగించుకునేవారు. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న ఆరు నెలలకు కూడా రుణం మంజూరు కాకపోవడంతో మహిళలు బయట అప్పు దొరకక..ఉపాధి లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల వైఎస్సార్‌ కేపీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది.

15,529 మందికి మాత్రమే లబ్ధి

పదేళ్ల కితం ఎస్సీ, ఎస్టీలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ‘ఉన్నతి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇటీవల వరకు సంఘంలోని అయిదుగురు సభ్యులకు మాత్రమే రూ.50 వేల వరకు సున్నావడ్డీ రుణాన్ని అందించేవారు. దీనికి సభ్యులందరి తీర్మానం అవసరం. వడ్డీ రాయితీ ఉండటంతో ఉన్నతి రుణాలకు డిమాండ్‌ ఉండేది. తొలుత తీసుకున్న సభ్యులంతా చెల్లిస్తేనే భవిష్యత్తులో మిగతా సభ్యులకు రుణం దక్కేది. తదనంతర కాలంలో సెర్ఫ్‌ నిబంధనలను సవరించడంతో సంఘంలోని 10 మంది సభ్యులూ రుణం తీసుకోవడానికి అవకాశం దక్కింది. అయితే బ్యాంకు లింకేజీతోపాటు, ఇతరత్రా రుణాలు తీసుకుని ఉంటే వాయిదాలు సక్రమంగా చెల్లిస్తూ ఉండాలి. రుణ చరిత్ర ఆధారంగా సంఘంలోని మహిళలకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ఇస్తారు. గతేడాదిగా జగనన్న కాలనీల్లోని పక్కాగృహ నిర్మాణ లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.1.80 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేస్తోంది. పెరిగిన నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అదనంగా రూ.35 వేల చొప్పున రుణం మంజూరుకు ప్రభుత్వం డీఆర్డీఏ అధికారులను ఆదేశించింది. బ్యాంకు లింకేజీ రుణం ఇవ్వని మహిళలకు స్త్రీనిధి, ఉన్నతి పథకాల కింద లబ్ధిదారుల పేర్లు నమోదు చేయించారు. అలాంటి వారు కూడా ప్రస్తుతం రుణం కోసం నిరీక్షిస్తున్నారు. చేతిలో నగదు లేక ఇంటి నిర్మాణ పనులు ముందుకు నడవడం లేదు. ఉన్నతి పథకం కింద ఇప్పటివరకు జిల్లాలోని 15,529 మంది మహిళలు రూ.56.67 కోట్ల మేర రుణం తీసుకున్నారు. అందులో రూ.29.73 కోట్ల మేర మాత్రమే వసూలు చేశారు. దీంతో రికవరీ కూడా అధికారులకు తలనొప్పిగా మారింది.

రుణం ఎప్పుడు ఇస్తారో..

గత ఆరు నెలలుగా జిల్లాలోని 1,683 మంది మహిళలు ఉన్నతి రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. సాధారణంగా ఈ రుణం కావాల్సినవారు గ్రామస్థాయిలోనే వీవోఏను కలుస్తారు. ఆమె వద్ద పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకుని బయోమెట్రిక్‌ వేస్తారు. ఆ తర్వాత సీసీ, ఏపీఎం లాగిన్‌కు వెళ్తుంది. అక్కడి నుంచి జిల్లా స్థాయిలో డీఆర్డీఏ, తర్వాత సెర్ఫ్‌ లాగిన్‌కు డేటా పంపిస్తారు. దీంతో దరఖాస్తుదారుల బ్యాంకు ఖాతాకు నేరుగా రుణం జమవుతోంది. అందుకు వారం రోజులు గడువు. కానీ కొన్నాళ్లుగా రుణ మంజూరు ప్రక్రియ నిలిచింది. 183 మందికి రూ.89.37 లక్షల రుణం నిమిత్తం ప్రక్రియంతా పూర్తయినా నిధుల లభ్యత లేక ఇంతవరకు జమ కాలేదు. పెండింగ్‌ విషయం తెలుసుకున్న అధికారులు మంజూరు ప్రక్రియను నిదానం చేశారు. దాంతో మిగతా 1,500 దరఖాస్తుదారుల వివరాలు ఇతర దశల్లో అపరిష్కృతంగా ఉన్నాయి. వీరికి మరో రూ.6 కోట్ల మేర నిధులు అవసరం. వారంతా జీవనోపాధుల నిమిత్తం రుణం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని