logo

పర్యాటకం మాటున పొరుగు మద్యం!

జిల్లాలో అక్రమ మద్యం వ్యాపారులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు దొరుకుతున్న మద్యాన్ని కొన్ని బృందాలు ఏర్పాటుచేసుకుని రైళ్ల ద్వారా తీసుకొచ్చి స్థానికంగా అధిక రేటుకు విక్రయిస్తున్నారు.

Published : 30 Jan 2023 01:47 IST

యథేచ్ఛగా గోవా, పుదుచ్చేరిల నుంచి రవాణా

గోవా మద్యం విక్రయిస్తూ పామూరులో పట్టుబడిన  నిందితులతో సెబ్‌ అధికార్లు

కనిగిరి, న్యూస్‌టుడే: జిల్లాలో అక్రమ మద్యం వ్యాపారులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు దొరుకుతున్న మద్యాన్ని కొన్ని బృందాలు ఏర్పాటుచేసుకుని రైళ్ల ద్వారా తీసుకొచ్చి స్థానికంగా అధిక రేటుకు విక్రయిస్తున్నారు. అయినా ఎక్సైజ్‌, సెబ్‌ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. పశ్చిమ ప్రకాశంలో ఈ తరహా మద్యం ఎక్కడికక్కడ కనిపిస్తోంది. గోవా, పుదుచ్చేరి, ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యాన్ని దిగుమతి చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఆ రాష్ట్రాల్లో రూ.500కు కొనుగోలు చేసిన మద్యం బాటిల్‌ను కనిగిరి ప్రాంతంలో రూ.1500కు పైగా విక్రయిస్తున్నారు. గోవాలో ఓ కంపెనీ మద్యం బాటిల్‌ రూ.680 ఉండగా ఇక్కడ రూ.1600 ఉంది. నేరుగా రైలు ద్వారా నెల్లూరు చేర్చి తర్వాత మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి, ఇతర మండలాల్లోని డాబాలు, రెస్టారెంట్లకు తరలిస్తున్నారు. ఇటీవల కనిగిరి ప్రాంతంలోని దాబాల్లో ముగ్గురిని విచారించగా ఓ వాలంటీర్‌, కొందరు చోటా మోటా నాయకుల పేర్లు చెప్పడం విశేషం. ఇదే తరహాలో రావినూతల, పామూరులోనూ స్వాధీనం చేసుకున్నారు.

అనుమానం రాకుండా..

ముఠా సభ్యులు పర్యాటకుల మాదిరి గోవా, పుదుచ్చేరి వెళ్తారు. అక్కడ నచ్చిన సరకు కొనుగోలు చేసి బ్యాగుల్లో నింపుకొని రైళ్లలో ప్రయాణిస్తారు. అలా కొందరు మార్కాపురం మీదుగా రైలులో తీసుకువచ్చి అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా కనిగిరి ప్రాంతంలోని కొన్ని గృహాల్లో రహస్యంగా భద్రపరుస్తున్నారు. మరో ముఠా సభ్యులు సింగరాయకొండకు తొలుత తరలించి అక్కడినుంచి కందుకూరు, పామూరు తీసుకువెళ్తున్నారు. ఏజెంట్లను ఏర్పాటుచేసుకుని దాబాలు, దుకాణాలకు అమ్ముతున్నారు. ఎవరైనా తనిఖీ చేస్తున్నారని తెలిస్తే మామూళ్లు ఇచ్చి తప్పించుకుంటున్నారు. ఎక్సైజ్‌, సెబ్‌ అధికారులు పట్టుకుంటే అధికార పార్టీ నాయకులతో ఫోన్లు చేయిస్తున్నారు. ఇటీవల పామూరు మండలంలో ఈ దందాలో ప్రమేయం ఉన్న వాలంటీర్‌తో పాటు మరొకరిని పట్టుకుని నేతల నుంచి ఫోన్‌ రాగానే విడిచిపెట్టేశారు.


నిఘా పెట్టాం

ఇతర రాష్ట్రాల మద్యాన్ని ఇక్కడ విక్రయించడం నేరం. ఎవరైనా ఇలా అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పామూరులో పట్టుకుని నిందితులను జైలుకు పంపించాం. ఓ వాలంటీర్‌ను అదుపులోకి తీసుకుని విచారించాం. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్న 20 మందిపై నిఘా పెట్టాం. ఎవరినీ వదిలేది లేదు.  

అబ్దుల్‌ జలీల్‌, సెబ్‌ సీఐ, కనిగిరి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని