logo

విహారానికి వచ్చి.. అన్నా చెల్లెళ్ల గల్లంతు

కొద్దిరోజుల్లో ఆ ఇంట శుభకార్యం జరగాల్సి ఉంది.. ఇప్పటికే బంధువులంతా చేరుకుంటున్నారు. అంతా సందడిగా ఉంది.

Published : 30 Jan 2023 01:47 IST

బాలికను రక్షించిన మత్స్యకారులు.. కానరాని మరొకరి ఆచూకీ

పాకల తీరంలో ఘటన

కుమారుడు సిద్ధిఖీ ఆచూకీ లేక తీరం ఒడ్డున వేదనలో తండ్రి హమీద్‌

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: కొద్దిరోజుల్లో ఆ ఇంట శుభకార్యం జరగాల్సి ఉంది.. ఇప్పటికే బంధువులంతా చేరుకుంటున్నారు. అంతా సందడిగా ఉంది. సమీపంలో ఉన్న సముద్ర తీరానికి విహారం కోసం వారంతా వచ్చారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. స్నానాలు చేస్తున్న సమయంలో రాకాసి అలల ఉద్ధృతికి ఇద్దరు చిన్నారులు గల్లంతవగా వారిలో ఒకరిని మత్స్యకారులు రక్షించగలిగారు. మరొకరి ఆచూకీ ఇప్పటికీ కానరాలేదు. ఈ ఘటన పాకల తీరం వద్ద చోటుచేసుకుంది. రామాయపట్నం మెరైన్‌ సీఐ కిషోర్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి పరిధి ఫకీర్‌పాలెంలో షేక్‌ అబ్దుల్‌ హమీద్‌ దంపతులు నివసిస్తున్నారు. పదేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌ నుంచి ఇక్కడకు వచ్చిన వీరికి అయిదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. స్థానిక మసీదులో హమీద్‌ ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ఫిబ్రవరి మొదటివారంలో వీరి నూతన గృహ ప్రవేశ కార్యక్రమం ఉండటంతో బంధువులు వచ్చారు. ఆదివారం హమీద్‌ కుమారుడు అబ్దుల్‌ హమీద్‌ సిద్ధిఖీ(15), కుమార్తె అమల్‌, మరికొందరు బంధువులు కలిసి మొత్తం ఆరుగురు పాకల తీరం వద్దకు వచ్చారు. అంతా స్నానాలు చేస్తున్న వేళ రాకాసి వలలు విరుచుకుపడటంతో అన్నాచెల్లెలిద్దరూ కొట్టుకుపోయారు. బంధువులు పెద్దగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న మత్స్యకారులు అమల్‌ను రక్షించి ఒడ్డుకు చేర్చారు. సిద్ధిఖీ మాత్రం గల్లంతయ్యాడు. అపస్మారక స్ధితికి చేరుకున్న అమల్‌ను 108లో ఒంగోలు రిమ్స్‌కు.. అక్కడినుంచి మరో ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.

బోట్లతో గాలింపు

సిద్ధిఖీ ఆచూకీ కోసం మెరైన్‌ సిబ్బంది, మత్స్యకారులు బోట్లతో గాలిస్తున్నారు. మెరైన్‌ ఎస్సై ఈశ్వరయ్య, స్థానిక ఎస్సై ఫిరోజఫాతిమా, పోలీసు సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు తీరం వద్దకు చేరుకొని రోదించారు. సిద్ధిఖీ స్థానికంగా ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కాగా గత నాలుగైదు రోజులుగా ఈ తీరం వద్ద రాకాసి అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంది. ఈ సమయంలో సందర్శకులు ఆ ప్రాంతంలో లోపలికి వెళ్లడం ప్రమాదకరం. ఈ విషయం మెరైన్‌ సిబ్బందికి తెలుసు. ఘటన జరిగిన సమయంలో అక్కడకు వచ్చినవారికి గస్తీ సిబ్బంది అవగాహన కల్పించి హెచ్చరించాల్సి ఉన్నా అటువంటివేవీ జరగలేదని తెలుస్తోంది. చిన్నారులు కాస్త ఒడ్డునే ఉన్నప్పటికీ అల రూపంలో ముప్పు విరుచుకుపడిందని స్థానికులు తెలిపారు.

మత్స్యకారులు రక్షించిన బాలిక అమల్‌

సిద్ధిఖీ (పాతచిత్రం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని