logo

అనుమానాస్పద స్థితిలో చిన్నారి మృతి

అద్దంకిలోని గరటయ్య కాలనీ నాలుగో వీధి ప్రాంతానికి చెందిన చిన్నారి వల్లెపు హేమంత్‌ (3) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.

Published : 30 Jan 2023 01:47 IST

తండ్రి, నాయనమ్మలపై మేనమామ దాడి
భర్త, అత్తపై ఫిర్యాదు చేసిన బాలుడి తల్లి

అద్దంకి, న్యూస్‌టుడే: అద్దంకిలోని గరటయ్య కాలనీ నాలుగో వీధి ప్రాంతానికి చెందిన చిన్నారి వల్లెపు హేమంత్‌ (3) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. తండ్రి, నాయనమ్మల నిర్లక్ష్యం కారణంగానే మృతిచెందాడంటూ మేనమామ నాగరాజు మరికొందరు దాడి చేసి గాయపరిచారు. ఎస్సై ఆర్‌.ఆదిలక్ష్మి అందించిన వివరాల మేరకు.. గరటయ్య కాలనీలో శ్రీనాథ్‌, తిరుపతమ్మ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఐదేళ్ల కిత్రం వివాహం జరిగింది. వీరికి ఒక బాబు హేమంత్‌ ఉన్నాడు. తిరుపతమ్మది చీమకుర్తి మండలం పల్లామల్లి. అద్దంకి పట్టణంలోని ఓ రెస్టారెంట్‌లో శ్రీనాథ్‌ పనిచేస్తున్నారు. ఈనెల 27వ తేదీ నుంచి హేమంత్‌ జ్వరంతో బాధపడుతుండటంతో స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి నుంచి జ్వరంతో పాటు వాంతులు పెరగడంతో ఆదివారం ఉదయం తిరిగి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు ఘొల్లుమన్నారు. విషయం తెలుసుకున్న చీమకుర్తిలోని బాలుడి మేనమామ, బంధువులు అద్దంకి వచ్చారు. బాలుడి మృతికి తండ్రి, నాయనమ్మలపై అనుమానం వ్యక్తం చేస్తూ వారిపై దాడి చేశారు. వారిద్దరికీ గాయాలు కావటంతో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. భర్త శ్రీనాథ్‌, అత్త వెంకాయమ్మలు సకాలంలో స్పందించి మెరుగైన వైద్య చికిత్స అందిస్తే బాలుడు బతికేవాడని, చెప్పినా వినిపించుకోలేదని తల్లి తిరుపతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు వారిపై కేసు నమోదు చేశారు. ఎస్సై మాట్లాడుతూ అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతిచెందాడని, పోస్టుమార్టం నివేదిక అందిన తరువాత మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని