logo

ష్... ఇసుక అడగవద్దు!

జిల్లాలోని ఇసుక నిల్వ కేంద్రాలు ఖాళీ అవుతున్నాయి. మరోవైపు రీచ్‌లలో తవ్వకాలకు అనుమతులూ లేవు. దీంతో చిన్నపాటి ఇల్లు నిర్మించాలన్నా పేదలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Published : 31 Jan 2023 01:51 IST

జిల్లాలో సగం నిల్వ కేంద్రాలు వెలవెల
నిర్మాణాలకు పేద, మధ్యతరగతి అవస్థలు
- ఈనాడు డిజిటల్‌, ఒంగోలు

ఖాళీగా ఒంగోలు-1 ఇసుక నిల్వ కేంద్రం

జిల్లాలోని ఇసుక నిల్వ కేంద్రాలు ఖాళీ అవుతున్నాయి. మరోవైపు రీచ్‌లలో తవ్వకాలకు అనుమతులూ లేవు. దీంతో చిన్నపాటి ఇల్లు నిర్మించాలన్నా పేదలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిత్యం సరాసరి 2 వేల టన్నుల వరకు ఇసుక అవసరమవుతుందని అంచనా. డిపోల వద్ద జగనన్న కాలనీల లబ్ధిదారులతోపాటు, ప్రభుత్వ భవనాల నిర్మాణదారులు, నాడు-నేడు పనులు, సామాన్య వినియోగదారులకు అవసరమైన ఇసుక అందుబాటులో లేదు. ఇదే అదునుగా అక్రమ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.

‘‘ప్రభుత్వం నిర్ణయించిన ధరకే నాణ్యమైన ఇసుకను నియోజకవర్గాల వారీ నిల్వ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతాం.. నిర్దేశించిన ధరకు మించి ఎక్కువకు అమ్మినట్లు ఫిర్యాదుచేస్తే రూ.2 లక్షల జరిమానా, రెండేళ్లపాటు జైలు శిక్ష విధిస్తాం. అలానే అన్ని ఓపెన్‌ రీచ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌తోపాటు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్‌, ఇళ్ల వద్దకే అందించే సదుపాయం ఉంది. రీచ్‌ల వద్ద టన్ను రూ.475కే.’’ అంటూ గనులశాఖ ప్రకటించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరు. ఇసుక నిల్వ కేంద్రాలు, రీచ్‌లూ వెలవెలబోతూ కనిపిస్తున్నాయి.

రవాణా ఛార్జీలతో తడిసిమోపెడు

ఒంగోలు, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి, సంతనూతలపాడు, దర్శి, కొండపి ప్రాంతాల్లో ఇసుక నిల్వ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల వారీగా టన్ను రూ.940 నుంచి రూ.1460 ఉంది. రవాణా ఛార్జీలు వినియోగదారుడే భరించాలి. కొండపిలో టన్ను రూ.940 ఉంది. ట్రాక్టర్‌ ఇసుక తరలించాలంటే రూ.3760 అవుతుంది. రవాణా ఛార్జీలు కలిపితే 20 కిలోమీటర్ల పరిధిలో ఇల్లు చేరడానికి రూ.5,500. యర్రగొండపాలెంలో అత్యధికంగా టన్ను రూ.1460 ఉంది. ఒక ట్రాక్టర్‌ లోడు రూ.5,840 అవుతుంది. తరలించే దూరాన్నిబట్టి రూ.7 వేలు మొదలు రూ.8,500 ఖర్చు. గతంలో సమీపంలోని రీచ్‌ల వద్దకు వెళ్లి టన్ను రూ.475 చొప్పున చెల్లించి తీసుకెళ్లేవారు. ఇటీవల రీచ్‌లకు గడువు ముగియడంతో తవ్వకాలు నిలిపేశారు.


యథేచ్ఛగా అక్రమ వ్యాపారం

ఇసుక ఇబ్బందులను అనువుగా మలుచుకొని కొందరు అనధికారికంగా కాలువలు, నదులతోపాటు ప్రైవేటు రీచుల నుంచి తవ్వి తరలించేస్తున్నారు.  యర్రగొండపాలెం, మార్కాపురం, ఒంగోలు తదితర ప్రాంతాల్లో ఏకంగా డంప్‌లు పెట్టి వ్యాపారం సాగిస్తున్నారు. ఇందులో అధికారపార్టీ నాయకుల పాత్ర ఉండటంతో పోలీసు, సెబ్‌ అధికారులు మొక్కుబడి చర్యలతో మమ అనిపిస్తున్నారు.


ఇప్పుడెలా?

కనిగిరికి చెందిన రామిరెడ్డి ఇంటి నిర్మాణం చేపట్టారు. బయట మార్కెట్లో వాగులు, వంకల నుంచి తెచ్చిన ఇసుక ట్రాక్టర్‌ లోడు రూ.5 వేలు చెప్పడంతో నాణ్యత లేదని కొనుగోలు చేయలేదు. నెల్లూరు జిల్లా నుంచి ట్రక్కు ఇసుక రూ.6 వేలు వెచ్చించి కొనుగోలు చేశారు. 20 టన్నుల వరకు ఆయనకు అవసరం.  ఒంగోలు నగరంలోని మరో నిర్మాణదారు సైతం ట్రాక్టర్‌ ఇసుక అన్ని ఛార్జీలతో కలిపి రూ.6 వేలు అవుతుందని వాపోయారు.

రిక్తహస్తాలతో వెనుదిరిగి

ఒంగోలు-1 ఇసుక కేంద్రం ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఇక్కడ ఇటీవల వరకు పెద్ద మొత్తంలో డంప్‌ ఉండేది. కొన్నిరోజులుగా తవ్వకాలకు అనుమతులు లేకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి రాకపోవడంతో ఉన్న సరకు ఖాళీ అయింది. ఇది తెలియక కొందరు వాహనాలతో వచ్చి అక్కడున్నవారిని ఆరాతీస్తున్నారు. చేసేది లేక వెనుదిరుగుతున్నారు. కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి.


88 వేల టన్నుల నిల్వ

జిల్లాలో ప్రస్తుతం 6 నిల్వకేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఒంగోలు-1, మార్కాపురం, కనిగిరి, యర్రగొండపాలెం కేంద్రాల్లో స్టాకు లేదు. మిగిలిన కేంద్రాల్లో 88 వేల టన్నుల నిల్వ ఉంది. ఇసుక కావాల్సిన లబ్ధిదారులు, వినియోగదారులు వాటి నుంచి తెచ్చుకోవాలి. అత్యవసరం అనుకుంటే అనుమతి తీసుకుని పొరుగు జిల్లాల నుంచి తెచ్చుకోవచ్చు.

జగన్నాథరావు, డీడీ, గనులశాఖ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని